Advertisement

చిరు తప్పుకుంటే బాలయ్య ‘బండి’ నడిపిస్తాడా!?

Fri 29th May 2020 06:23 PM
tollywood,tollywood present situation,mega star chiranjeevi,balakrishna,chiranjeevi vs balayya,maa,telugu film industry,peddanna post,telugu cine industry  చిరు తప్పుకుంటే బాలయ్య ‘బండి’ నడిపిస్తాడా!?
Analysis About Tollywood Situation.. Chiranjeevi vs Balayya! చిరు తప్పుకుంటే బాలయ్య ‘బండి’ నడిపిస్తాడా!?
Advertisement

టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితి ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉంది.! అదెలాగంటారా.. ఎవరో ఒకరు ఇండస్ట్రీకి అన్నీ తానై బాధ్యతలను భుజాన వేసుకుని మరీ చేస్తుంటే కొందరికది జీర్ణించట్లేదో లేకుంటే ఆ స్థానం తనకు రాలేదేం.. తనకేం తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తుండటాన్ని చూస్తే ఏమని అర్థం చేసుకోవాలో.. ఎలా ఊహించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా, పెద్దన్నగా ఉన్న దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావుకు ముందు.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పరిస్థితులు ఊహించని రీతిలో మారిపోయాయ్. అప్పటి వరకూ అందరూ ఆయన మాటనే వేదంగా భావించే పెద్దలు, నటీనటులు ఇప్పుడు ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్లు మీడియా గొట్టాల ముందుకు.. ఇంటర్వ్యూల వేదికగా తెగ వాగేస్తున్నారు. అది కూడా తాము మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు సమంజసం..? పక్కనోడి మీద బురదజల్లితే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా..? అనేది ఇసుమంత కూడా ఆలోచించకుండా విచక్షణ లేని మాటలు మాట్లాడేయటం వారి విజ్ఞతకే వదిలేయాల్సి వస్తోంది.

అందరూ మంచిగా ఉండాలన్నది తప్పా..!?

దాసరి మరణాంతరం ‘పెద్దన్న’ పాత్ర పోషించడానికి పెద్దలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఘట్టమనేని కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మంచు మోహన్ బాబు లాంటి పెద్దలు ఉన్నారు. ‘ఎస్.. నేనున్నా బాధ్యతలు తీసుకుని ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తా’నని ఒక్కరూ ముందుకు రాలేదు. పైగా కొందరు తమ వల్ల కాదులెండి మెగాస్టార్ చిరంజీవే ఇందుకు అసలు సిసలైన వ్యక్తి ఆయన ముందుంటే తామంతా వెనుకండి బలోపేతం చేస్తామని మోహన్ బాబు లాంటి వారు సభా వేదికగానే చెప్పేశారు. ఎవరో తనకు బాధ్యతలు అప్పగించినా.. అప్పగించుకున్నా.. అసలు తాను పెద్దన్న అనే పాత్ర పోషించాలని ఏనాడూ అనుకోలేదు చిరు. కానీ కళామాతల్లి సమక్షంలో అందరూ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీకి అన్నీ తానై.. ఎలాంటి ఆపద వచ్చినా.. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కర్త, కర్మ, క్రియే తానే అన్నట్లుగా ముందుకెళ్తున్నారు మెగాస్టార్. ఇందుకు చక్కటి ఉదాహరణే కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ). కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ మూగబోవడంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే వారికోసం చారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి.. ఓ కమిటీని వేసి మరీ వారి అవసరాలన్నీ తీర్చడం మొదలుపెట్టాడు చిరు. మొదట మెగాస్టారే కోటి రూపాయిలివ్వగా ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు, మెగా హీరోలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా చిరునే ముందుండి నడిపించారు. కానీ అన్నీ చేసిన చిరును ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వేలెత్తి చూపిస్తున్నారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో.. అర్థం కాని పరిస్థితి. అందరూ మంచిగా ఉండాలని చిరు కోరుకోవడం తప్పని బాలయ్య పరోక్షంగా చెబుతున్నారా లేకుంటే ఆయన మనసులో ఇంకేమైనా ఉందా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

దాచుకోవడానికి.. దోచుకోవడానికేముంది..!?

సినిమా షూటింగ్స్ పున: ప్రారంభానికి గాను మెగాస్టార్ ఇంట్లో సినీ పెద్దలు, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి భేటీ జరగడం.. ఆ తర్వాత అందరూ ఒక్కటిగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం విదితమే. చిరు ఇంట్లో భేటీకి సంబంధించి ఆడియో, వీడియోలు రిలీజ్ చేశారు. భేటీ కూడా తిప్పికొడితే గంట కూడా జరగలేదు. ఆ తర్వాత కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఏకంగా సీఎంవోనే అధికారికంగా అసలేం చర్చించారు..? అనేదానిపై నిశితంగా ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఇలా అన్నీ ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం.. దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి నాడు.. ఎన్టీఆర్ ఘాట్, బసవతారకం ఆస్పత్రి వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సబబో అర్థం కావట్లేదు. భూములు పంచుకుంటున్నారా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆయన అంటున్నారు సరే.. ఇలా చేయాల్సి వస్తే ఏ ఇద్దరో ముగ్గురో కూర్చుని మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేస్తారు కదా.. చిరు ఇంట్లో జరిగిన భేటీకి బోలెడు మంది ఎందుకొచ్చినట్లు..!? పోనీ బాలయ్య చెబుతున్నట్లుగా భూములు వగైరాకు సంబంధించి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలుంటే బయటపెట్టి మీరే కింగ్ అవ్వొచ్చు.. కానీ అలాంటివి ఏమీ చేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల ఒరిగేదేమైనా ఉందా..?. సీసీసీకి ఇచ్చిన రూపాయి మొదలుకుని తలసానితో భేటీ, కేసీఆర్‌తో కీలక సమావేశంకు సంబంధించి ఇలా అన్నీ పూసగుచ్చినట్లుగా వివరాలు ట్విట్టర్ వేదికగా.. మీడియాకు ప్రకటనలు ఇవ్వడం ఇలా అన్నీ చిరు చేస్తున్నారు. మరి ఇందులో దాచుకోవడానికి.. మీరు అనుకున్నట్లుగా దోచుకోవడానికి ఏముంది..? బాలయ్యా..!.

బాలయ్యకు ‘పెద్దన్న’ పాత్ర కావాలా..!?

ఇండస్ట్రీలో బాలయ్య.. చిరు ఇద్దరూ ఇద్దరే. ప్రస్తుతం చిరు అన్నీ తానై ఏ సమస్య వచ్చినా తన కుటుంబ సమస్యగా భావించి ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తున్నారు. పోనీ అదే చిరు స్థానంలో బాలయ్య ఉండగలరా..? బాలయ్యే అన్నింటికీ ముందుండి ‘బండి’ నడిపించగలడా..!? అది అస్సలు జరిగే పనేనా..!?. బాలయ్య అందర్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. బాలయ్య ఇంతవరకూ దేన్నయినా లీడ్ చేశారా..? పోనీ చిరుకు ఉన్న కాంటాక్ట్స్ బాలయ్య బాబుకు ఉన్నాయా..?. అంతెందుకు ఇండస్ట్రీలో మీరు పెద్దగా ఉంటానంటే ఒప్పుకునే వాళ్లు.. మీ వెంట ఉండేవాళ్లు ఎంతమంది ఉన్నారన్నది ఇక్కడ అసలు సిసలైన ప్రశ్న. ఇండస్ట్రీకి మంచి చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను స్థాపించి మరీ ముందుకు నడిపిస్తున్నారు చిరు. పోనీ నాటి నుంచి నేటి వరకూ ‘మీ’ అనే మార్క్ ఎక్కడైనా ఉందా అంటే వెనక్కి తిరిగి చూస్తే అన్నీ ప్రశ్నార్థకాలే..!. పైగా కథ ఎలాంటిదైనా సరే సినిమా చేయాలంతే అన్నట్లుగా నటించేస్తుంటారని.. ఆ తర్వాత అసలు అది రిలీజ్ అయితే ఎలా ఆడుతోందో లేదో కూడా మీరు ఆలోచించరు.. పట్టించుకోరని ఆరోపణలు చాలనే ఉన్నాయ్.!. మీ సొంత సినిమాను పట్టించుకోని మీరు.. అన్నేసి సినిమాలు వస్తున్న.. అంతంత మంది నటీనటులున్న ఇండస్ట్రీని ఎలా నడిపిస్తారు.. పోనీ ఇండస్ట్రీ పెద్దలు ఏదైనా సమస్య వస్తే.. మిమ్మల్ని ఏ మొహంతో సంప్రదిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అసలే ఆవేశం మరీ..!

నిర్మాత సి. కళ్యాణ్ అన్నట్లుగా ఫేస్ వాల్యూ అంటే.. అందరితో కలిసి మెలిసి పనిచేసే తత్వం.. కలుపుకుని పోయే తత్వం.. చూడగానే ఆయనకు ఓ గుర్తింపు ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశ్యం. పోనీ ఆయన అన్నట్లుగానే ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందర్నీ ఏకం చేయడం గానీ.. అటు ఆంధ్రాలో ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కానీ మీరు డైరెక్టుగా వెళ్లి మాట్లాడే అవకాశాలున్నాయా..? అంటే అస్సలే లేవ్ గాక లేవు ఎందుకంటే అటు ఇటు ఇద్దరూ మీరు గెలిచిన టీడీపీకి బద్ధ శత్రువులే.. పోనీ లౌక్యంతో ఏమైనా చేయగలరా అంటే చేసేదేమీ లేకపోయినా అసలే ఆవేశం మరి.. వీటన్నింటికీ మీరు రెడీగా ఉన్నారంటే తక్షణమే ఇండస్ట్రీ పెద్దలను కూర్చొబెట్టి బాధ్యతలు తీసుకోవచ్చు.. పోనీ మీ మాట విని వారంతా కూర్చోవడానికి రారు అనుకుంటే మీరే ఓ ప్రకటన రిలీజ్ చేయొచ్చు. అసలు ఇలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా అంటే అదీ లేకపాయె. మరి ఏమీ లేనప్పుడు.. మీరేమీ చేయలేనప్పుడు అన్నీ తానై చేస్తున్న చిరును ఇండైరెక్టుగా బూతులు తిట్టడమేంటి..? లేనిపోని ఆరోపణలు ఏంటి..? ఇది ఎంతవరకు సమంజసం.. అసలు ఎందుకిలా చేస్తున్నారో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఇక్కడ అసలు పాయింట్.!

మీరిచ్చిందేంటి.. ఏం చేసినట్లు!?

సీనియర్ హీరో అయ్యుండి.. కరోనా కష్టకాలంలో ఇటు ఇండస్ట్రీని.. అటు మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంకు పైసా కూడా ప్రకటించని మీరు ఇండస్ట్రీకి ఏదో కొంచెం ఇవ్వండని ఒకరిద్దరి ప్రోదల్భంతో మీరు రూ. 25 లక్షలు ఇచ్చారనే పుకార్లూ ఉన్నాయ్. పైగా మీరు (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడే మీ మీద ఏ రేంజ్‌లో వ్యతిరేకత వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పైగా ఇప్పుడు కూడా అంతకుమించి ఉంది. ఇక ఇండస్ట్రీకి వస్తే.. మీరిచ్చిన విరాళం అది కూడా ఆఖరున అదేదో సామెత ఉంది కదా ‘చావుకు చెబితే దినంకు వచ్చినట్లుగా’.. ఎప్పుడో ఇచ్చారు. అసలు ఈ టైమ్‌లో సీనియర్.. అటు ప్రజాప్రతినిధి అయిన మీరు ముందుండి అన్నీ చూసుకోవాల్సింది పోయి ‘నన్ను ఎవడూ పిలవలేదు’ అని అనడం ఎంతవరకు సబబు..?. పోనీ బొట్టెట్టి పిలవడానికి అదేమైనా పేరంటమా..!?. పిలవక పోవడం తప్పే కానీ.. ఇదేం పేరంటం కాదు కదా.. నిజంగా నీకు సినీ కార్మికుల మీద ప్రేమ ఉంటే.. కచ్చితంగా ముందుకు రావాలి. అలా రాకపోగా పిలవలేదని చెప్పడమేంటి..?. పోనీ అన్ని విషయాలు నిర్మాత సి. కల్యాణ్ మీతో చెప్పానని చెబుతున్నారు. అంటే సమాచారం మీదాకా వచ్చినట్లే కదా. అంతేకాదు..‘ అవసరమైతే పిలువు నేనూ వస్తా’నని చెప్పావనీ చెబుతున్నారు కదా మరి ఆ మాటలకు స్పందించవేం..!?. పోనీ ఆయన ఏమైనా అబద్ధం చెబుతున్నారా..? అంటే అదేం లేదో ఆయన మీకు అత్యంత ఆప్తులు కూడా..!. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘నేను పెద్ద అనుకునే వారెప్పుడూ.. ఒకరు చెప్పే వరకు.. పిలిచే వరకు ఆగకూడదు.. ముందుకు రావాలంతే.. మనకు కావాల్సింది.. జరగాల్సిందే పని అంతే అనేది ఎరగాలి మరి బాలయ్యా.!

తిట్టేస్తున్నారు బాలయ్యా..!?

వాస్తవానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలు.. అది కూడా బూతులు మాట్లాడేయం ఇండస్ట్రీ పెద్దలకు మరీ ముఖ్యంగా నందమూరి, టీడీపీ వీరాభిమానులకే నచ్చలేదు. నెట్టింట్లోకి వెళ్లి కాస్త సెర్చ్ చేస్తే.. అసలు ఆయనగారిని ఏ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారో అర్థమవుతుంది. పోనీ మీరు మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మీ నందమూరి హీరోలను ఒక్క మాట అడిగి చూడండి.. ‘ఏరా నేను మాట్లాడింది కరెక్టేగా’ అని అసలు విషయమేంటో అప్పుడు తెలుస్తుంది. పోనీ.. ఇండస్ట్రీలో నలుగుర్ని పిలిపించో.. లేకుంటే ఛాంబర్‌లో మీటింగెట్టి అడగండి మీరు మాట్లాడింది కరెక్టో కాదో తేలిపోతుందిగా. ఒకట్రెండు చానెల్స్‌లో అలా డప్పు కొడుతున్నారే తప్ప ఏమీ లేదన్నది కొందరి వాదన. ఎంతసేపూ మా బ్రీడూ.. మా బ్లడ్ అని చెప్పుకుని గర్వంగా ఫీలవుతుంటారు.. అలాగే అందరికీ ఉంటుంది కదా..! మరి ఎదుటివారేదో వారి ప్రయత్నం చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి.. లేదా మిన్నకుండిపోవడమే చేయాల్సింది పోయి.. బూతులు తిడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా..?.. మీ మాదిరో వాళ్లు కూడా నోటికి బుద్ధి చెబితే పరిస్థితి ఎందాకా వెళ్తుందో.. అనేది ఒక్కసారి ఆలోచించయ్యా బాలయ్యా..!. 

మొత్తం మీద చూస్తే.. పాత వ్యవహారాలను మనసులో పెట్టుకుని.. తనకు ఇష్టంలేని ఇద్దరు ముఖ్యమత్రులను కలుస్తున్నారనే ఇండైరెక్టుగా పెద్ద దిక్కుగా అన్నీ తానై చూసుకుంటున్న చిరును బాలయ్య బూతులు తిట్టేశాడన్నది ఇక్కడ కొందరి వాదన అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ అలా చేస్తే బాలయ్యకు ఏమైనా ఒరుగుతుందా..? పోనీ చిరును తప్పుకోమనండి నేనూ ఆ బాధ్యతలు తీసుకుంటానని చెప్పే పరిస్థితులున్నాయా..? పోనీ బాలయ్య పగ్గాలు చేపడితే పరిస్థితి ఏంటి..? చేపట్టాక ఇండస్ట్రీలో పరిస్థితులను ఊహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో.. మనకు చేతనైతే చేయాలి లేకుంటే మిన్నకుండిపోవాలి అంతేకానీ లేని పోని అనుమాలెత్తుకోవడం ఎందుకు.. అంతెత్తున ఎగిరి ఆరోపణలు చేయడమెందుకు.. ఇష్టానుసారం వాగేయడం వల్ల ఒరిగేదేంటి..?. ఆధారాలుంటే అవతలి వ్యక్తిని పడగొట్టేయచ్చు.. పోనీ భూములు భూములు అంటున్న బాలయ్యకు ఆ లెక్కేంటే తేల్చేస్తే పోలా.. ఆ ప్రయత్నమేదో చేసి మీ వల్ల అయితే పెద్దన్నగా ఉండండి బాలయ్యో..!

గమనిక :- ఇది ఇండస్ట్రీలోని పలువురు పెద్దల మనసులోని మాట (బయటికి చెప్పుకోలేని వారు).. అదే విధంగా నెటిజన్ల పెదాల నుంచి వచ్చిన పదాలను అక్షరాల మూటగా పేర్చి www.cinejosh.com కథనం అందించింది అంతే తప్ప ఎవర్నీ వ్యక్తిగతంగా కించపరచాల్సిన.. అంతకుమించి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.

Analysis About Tollywood Situation.. Chiranjeevi vs Balayya!:

Analysis About Tollywood Situation.. Chiranjeevi vs Balayya!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement