Advertisement

నన్ను 40 ఏళ్లు వెనక్కి పంపింది: కె. విశ్వనాధ్‌

Wed 19th Feb 2020 11:07 AM
k viswanath,sitarama sastry,sankarabharanam,40 years,complete,celebration  నన్ను 40 ఏళ్లు వెనక్కి పంపింది: కె. విశ్వనాధ్‌
40 Years Completed to Sankarabharanam Movie నన్ను 40 ఏళ్లు వెనక్కి పంపింది: కె. విశ్వనాధ్‌
Advertisement

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం’ విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్‌ గారు మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 1980లో శంకరాభరణం చిత్రం విడుదలైంది. నేను ‘శంకరాభరణం’ సినిమా ఇప్పుడు చూసినా కూడా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది’ అన్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘మరో శంకరాభరణం, మరో సాగర సంగమం లాంటి చిత్రాలను ప్రస్తుత దర్శకుల నుంచి ఆశించకూడదు. ఎందుకంటే కె.విశ్వనాథ్‌ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా. అందువల్ల మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయని ఎదురుచూసి భంగపడొద్దు. మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు, తీసేవారు లేరు’ అన్నారు.

ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాని పాఠ్య గ్రంథంగా పెట్టి భవిష్యత్‌ దర్శకులకు ఎలాంటి సినిమాలు తీయాలో నేర్పాలి.  సెల్‌ ఫోన్‌ లోనే సినిమాలు తీస్తున్న, చూస్తున్న ఈరోజుల్లో శంకరాభరణంని ఆదర్శంగా తీసుకుని అలాంటి చిత్రంను తీయాలి’ అని సూచించారు.

సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ‘శంకరాభరం లాంటి సినిమా తీయడం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారు మనకందించిన శంకరాభరణం చిత్రం చిరస్మరణీయం.’ అన్నారు.

చంద్రమోహన్‌ ఆ రోజుల్లో శంకరాభరణంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘మరో రెండు రోజుల్లో మా అన్నయ్య కె.విశ్వనాథ్‌ 90ల్లోకి అడుగిడుతున్నారు. మా ఇద్దరి కాంబినేషన్‌ లో మంచి హిట్‌ సినిమాలు వచ్చాయి. మా అన్నయ్య వంద పుట్టిన రోజులు జరుపుకోవాలి. శంకరాభరణం 50 ఏళ్ళ ఫంక్షన్‌ కి కూడా మా అన్నయ్య రావాలి’ అని ఆకాంక్షించారు. బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ.. ‘శంకరాభరణం లాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం. ఎన్ని తరాలు మారినా శంకరాభరణం తెలుగు సినిమా చరిత్రలో కలికితురాయిగా నిలుస్తుంది ’ అన్నారు. 

సినీ విశ్లేషకుడు రెంటా జయదేవ మాట్లాడుతూ.. ‘మొట్టమొదటి సారిగా తెలుగు సినిమాకి  జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘శంకరాభరణం’. మళ్ళీ 39 ఏళ్ళకు బాహుబలి ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అంతకుముందు వరకు ఈ సినిమాకి ఏదీ పోటీ లేదు. కమర్షియల్‌ గా కూడా ‘శంకరాభరణం’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్‌ లాంటి పెద్ద పెద్ద హీరోలు లేకుండానే మంచి కమర్షియల్‌ విజయం సాధించిన సినిమా ఇది’ అన్నారు.   

ఈ కార్యక్రమంలో విశ్వనాథ్‌ గారితో పాటు చంద్రమోహన్‌, డబ్బింగ్‌ జానకి, భీమేశ్వర్రావు, సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేసిన వంశీ, కస్తూరి, వీరితో పాటు ఏడిద నాగేశ్వర్రావు కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్‌, అంతేగాకుండా సీతారామశాస్త్రి, ఎల్బీ శ్రీరామ్‌, హరీష్‌ శంకర్‌, కాశీ విశ్వనాథ్‌, బి.వి.ఎస్‌.రవి, దశరథ్‌, రచయిత ప్రవీణ్‌ వర్మ, తనికెళ్ళ భరణి, అశోక్‌ కుమార్‌, అనంత్‌, రమేష్‌ ప్రసాద్‌, అచ్చిరెడ్డి, మాధవపెద్ది సురేష్‌, డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు.  తదితరులు పాల్గొన్నారు.

40 Years Completed to Sankarabharanam Movie:

Celebrities speech at Sankarabharanam Movie Special Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement