Advertisement

‘శంకరాభరణం’ చిత్రానికి 40 ఏళ్లు..!

Sun 02nd Feb 2020 01:34 PM
jv somayajulu,manju bhargavi,tulasi,sankarabharanam,movie,40 years,complete  ‘శంకరాభరణం’ చిత్రానికి 40 ఏళ్లు..!
Sankarabharanam Movie completed 40 Years ‘శంకరాభరణం’ చిత్రానికి 40 ఏళ్లు..!
Advertisement

కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ - ఫిబ్రవరి 2కు నాలుగు దశాబ్దాలు పూర్తి

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 2వ తేదీకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఫిబ్రవరి 2 , 1980లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కళాఖండం విడుదలైంది. కళా తపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు. శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం చక్కగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇది ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలుమూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన.

శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.  ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి.

కథేమిటి?

శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు)  గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.  వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్ర్తి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్ర్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది.

సంగీతమే ప్రాణం 

ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన... వెరసి ‘శంకరాభరణం’ అనే కళాఖండం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కాలం మారినా ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

నటీ నటులు

జె.వి .సోమయాజులు

మంజు భార్గవి

అల్లు రామలింగయ్య

చంద్ర మోహన్

రాజ్యలక్ష్మి

తులసి

నేపధ్య గానం

ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం

ఎస్. జానకి

వాణి జయరాం

Sankarabharanam Movie completed 40 Years:

40 Years completed to Sankarabharanam Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement