టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’. ఒకటి రెండు కాదు సినిమా షూటింగ్ ప్రారంభం మొదలుకుని రిలీజ్‌కు ముందు రోజు వరకూ అన్ని వివాదాలే. ఆఖరికి ఇటు సెన్సార్ బోర్డు.. అటు హైకోర్టు షాక్‌లు మీద షాక్‌లు.. వరుస ఎదురుదెబ్బలతో అసలు సినిమా రిలీజ్ చేస్తామో లేదో అని దర్శకనిర్మాతలు భావించిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు సరిగ్గా సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సెన్సార్ సర్టిఫికెట్ రావడం.. హడావుడి మధ్యే సినిమా రిలీజ్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడిక సినిమా ఎలా ఉంది..? సినిమాలు పాత్రల సంగతేంటి..? ఎవరెవరి పాత్రలు ఎలా ఉన్నాయ్..? మొత్తమ్మీద సినిమా ఎలా ఉంది..? అనేది ఇప్పుడు రాజకీయాలు, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
సినిమాలో ఏదో ఉంటుంది..? ఆర్జీవీ ఏదో కొత్తదనం.. ఇంట్రెస్టింగ్ విషయాలు చూపించి ఉంటారని చాలా మంది ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికులు థియేటర్లకు క్యూ కట్టారు. అది కూడా ఫస్ట్ షోకే టికెట్లు బుక్ చేసుకుని వెళ్లారు. థియేటర్ నుంచి బయటికొచ్చాక మీడియా.. సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి చెప్పుకొస్తున్నారు. అస్సలు సినిమా ఏ మాత్రం బాగాలేదని కొందరు అంటుంటే.. అబ్బే దీన్ని సినిమా అంటారా..? మరికొందరు ఆర్జీవీని తిట్టిపోస్తున్నారు. అయితే ఆర్జీవీ అభిమానులు, ఓ పార్టీకి చెందిన అభిమానులకు మాత్రం చాలా బాగుంది.. సూపర్బ్ అని కితాబిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ‘మూవీ మస్తీ’ ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ‘అమ్మరాజ్యం..’పై తిట్టిపోసింది. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఈ సినిమాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. దీని కన్నా జబర్దస్త్ స్కిట్స్ చూడటం చాలా బెటర్’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. ఇలా సినిమా చూసిన పలువురు తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది.. ‘ఆర్జీవీ సినిమా అంటే ఏదో ఆశించి వెళ్తాం కానీ.. ఇలా తీశాడేంటి..’ అని ఒకింత సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. సినిమా టాక్‌పై చైనాలో బిజిబిజీగా ఉన్న వర్మ ఎలా రియాక్ట్ అవుతారో మరి.