కథలో కంటెంట్ ఉంటే చాలు ఆ మూవీ ఎక్కడికో వెళ్తుంది.. అని నిరూపించిన చిత్రం ‘కేజీఎఫ్’. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద ఏ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ ప్రాజెక్ట్‌ను నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. సీక్వెల్ ఎలా ఉండబోతోంది..? ఇందులో యష్‌ను నీల్ ఎలా చూపించబోతున్నారు..? అని అటు తెలుగు.. ఇటు కన్నడ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని మరోవైపు యష్ అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఓ కార్యక్రమంలో భాగంగా నీల్ మాట్లాడుతూ ‘కేజీఎఫ్-2’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరీ ముఖ్యంగా ‘ధీర ధీర..’ సాంగ్ గురించి ఆయన మాట్లాడుతూ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సాంగ్‌ను చాప్టర్-1లో యాక్షన్ సీన్ కోసం కొంచెం మాత్రమే పెట్టామని.. చాప్టర్-2లో ఫుల్ సాంగ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘వాస్తవానికి కేజీఎఫ్-01 పార్ట్ కోసం ధీర.. ధీర పాటను కంపోజ్ చేయలేదు. సెకండ్ చాప్టర్ కోసం ఈ పాటను సిద్దం చేశాం. అయితే కేజీఎఫ్‌లో యశ్ సుత్తి పట్టుకొని చేసే యాక్షన్ సీన్‌కు ఈ పాట సరిగ్గా సెట్ అవుతుందనే పెట్టాం. అది కూడా పూర్తిగా పెట్టలేదు.. కేజీఎఫ్-2లో పూర్తి సాంగ్‌ను వినబోతున్నారు’ అని నీల్ స్పష్టం చేశాడు.
కాగా.. ‘ధీర ధీర’ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలవడమే కాదు ఇదో ట్రెండ్ సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్లి లేదు. సినిమా రిలీజ్ టైమ్‌లో ఏ ఫోన్‌లో చూసినా ఇదే కాలర్ ట్యూన్, రింగ్ టోన్ కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాను ఓ రేంజ్ తీసుకెళ్లడంలో ఈ సాంగ్ కీ రోల్ పోషిందని చెప్పుకోవచ్చు. అయితే చాప్టర్-01లో సగం పాటకే ఆ రేంజ్ ఉందంటే.. ఇక చాప్టర్-02లో సాంగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. ఊహించనక్కర్లేదు కూడా. ఇదిలా ఉంటే.. చాప్టర్-2లో యష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కేజీఎఫ్-02 ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.