ప్రస్తుతం కన్నడ దర్శకుడు ‘ప్రశాంత్‌నీల్’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈయనకు ఇది రెండో చిత్రమే. మొదటిది ‘ఉగ్రం’ కాగా రెండో చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్1’తో ఈయన సత్తా దేశవ్యాప్తంగా తెలిసిందే. ముఖ్యంగా ఒక్క హిట్ వస్తే చాలు అతనిపై వాలిపోయే టాలీవుడ్ నిర్మాతలు పలువురు ప్రశాంత్ నీల్ కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ బడా బడా నిర్మాతలైన దిల్‌రాజు, అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్ వంటి వారిని ‘కేజీఎఫ్ చాప్టర్2’ వరకు వెయిట్ చేద్దామని తప్పించుకున్న నీల్ మైత్రితో మాత్రం ఓకే అయిపోయాడు. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్లుగా మనవారి మనస్తత్వం ఉంటుంది.
గతంలో పలువురు పెద్ద పెద్ద తమిళ, కన్నడ దర్శకులే కాదు.. మహేష్‌భట్, రవిచంద్రన్, ప్రతాప్‌పోతన్, మణిరత్నం( గీతాంజలి) మినహా, కెమెరామెన్ శివ, విష్ణువర్ధన్ వంటి దర్శకులు కూడా తెలుగులో పెద్దగా రాణించలేకపోయారు. కనీసం ప్రశాంత్ నీల్‌ది రెండు సినిమాల ముచ్చటగా మిగలకూడదు అనుకుంటే యష్‌తో పాటు సంజయ్‌దత్, రవీనాటాండన్ వంటి వారు నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్2’ వరకైనా ఎదురుచూడటం ముఖ్యం.
రాజమౌళి ఎన్నోచిత్రాలతో ప్రూవ్ చేసుకుని మరి ‘బాహుబలి’తో ఎదిగాడు. ‘ఈగ’ నుంచి ‘బాహుబలి’ వరకు ఆయన ఎక్కడా తొందరపడలేదు. ఇక ప్రశాంత్‌నీల్ మైత్రిమూవీమేకర్స్ సంస్థతో చేయబోయే చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అని ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా ఎన్టీఆర్‌తో నీల్ చిత్రం ఉంటుందా? లేదా? అన్నది ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్ చాప్టర్2’ తర్వాతనే తేలుతుంది.