Advertisement

ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ‘ఎఫ్ఎన్ఏఈఎమ్’

Tue 26th Mar 2019 07:46 PM
film newscasters association,film journalists,health security,trivikram srinivas,health cards distribution,allam narayana,sai dharam tej  ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ‘ఎఫ్ఎన్ఏఈఎమ్’
Film Newscasters Association of Electronic Media - Health Cards Distribution Event ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ‘ఎఫ్ఎన్ఏఈఎమ్’
Advertisement

‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ (ఎఫ్ఎన్ఏఈఎమ్‌) సభ్యులకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో హెల్త్ కార్డులను, అసోసియేషన్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ డైరీని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యుల ఐడీ కార్డులను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టర్మ్ పాలసీని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), యాక్సిడెంటల్ పాలసీని సాయిధరమ్ తేజ్, మెడికల్ పాలసీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ప్రసాదం రఘు నూతన కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారు. 

ఇక నుంచి ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌...’ సభ్యులతో పాటు వారి కుటుంబంలో ముగ్గురికి ఆదిత్య బిర్లా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ. 3 లక్షల మెడికల్ కవరేజ్, సభ్యులకు ఆదిత్య బిర్లా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ. 25 లక్షల యాక్సిడెంటల్ కవరేజ్, ఎస్‌బిఐ టర్మ్ పాలసీ కింద రూ. 15 లక్షల కవరేజ్ లభిస్తాయి. 

ఈ సందర్భంగా ప్రసాదం రఘు మాట్లాడుతూ.. ‘‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్.. దీన్ని 2004లో ప్రారంభించాం. ఎంతోమందికి నిజంగా అవసరమైనప్పుడు సహాయం చేశాం. ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. ఇటీవల మనవాళ్లకు కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఇబ్బందులు, సమస్యలు వచ్చాయి. అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయగలిగినా... చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇండస్ట్రీ వాళ్లు ఎప్పుడూ మనకు మద్దతుగా ఉంటూ వచ్చారు. ఈటీవీ సత్యనారాయణగారి చికిత్సకు బోల్డంత ఖర్చు అయితే సహాయం అందించారు. ఇలా జరుగుతున్న తరుణంలో అందరం కలిసి ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకుని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. అందర్నీ కలుపుకుని ముందుకు వెల్దామనే ఉద్దేశంతో అసోసియేషన్ కి కొత్త ప్యానల్ ని ఎన్నుకున్నాం. నూతన కార్యవర్గానికి అందరూ అభినందనలు తెలియజేయాలని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ ఉపయోగపడాలని కోరుకుంటున్నా. ఇందులో జాయిన్ అవ్వాలనుకునేవాళ్ళు ఉంటే... వారందరూ సభ్యత్వం తీసుకోండి. ఎక్కువమందికి అసోసియేషన్ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. హెల్త్ కార్డుల గురించి అనుకున్నప్పుడు.. ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను, హారిక అండ్ హాసిని అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు)గారిని కలిశాం. మేం హెల్త్ కార్డుల గురించి చేస్తున్న కృషి తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తనవంతుగా ఆర్ధిక సహాయం అందించాడు. ఈ సంగతి డిస్కస్ చేయడానికి ‘దిల్’ రాజుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు... ‘ఈ సంవత్సరం హెల్త్ కార్డులకు ఎంత అయితే అంత నేను ఇస్తాను. ఈ సంవత్సరానికి నేనే భరిస్తాను’ అని ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ ఏడాది జర్నలిస్టుల హెల్త్ కార్డులకు అయిన రూ. 18 లక్షలను రాజుగారు ఇచ్చారు’’ అన్నారు.

ఎతికా కంపెనీ సీఈఓ సుశీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి రోజూ 15 నుంచి 20 వరకూ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. ప్రతి క్లెయిమ్ వెనుక ఒక కథ ఉంటుంది. ఒక ఎమోషన్ ఉంటుంది. బాధలో ఉన్నవారితో మేము డీల్ చేయవలసి వస్తుంది. మన కుటుంబంలో ఎవరికైనా బాలేకపోతే... వాళ్ల ఆరోగ్యానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. దురదృష్టవశాత్తూ... మన దేశంలో చేతిలో డబ్బులు, హెల్త్ ఇన్సూరెన్స్ లేనివాళ్లు బంధువులు లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ అటువంటి ఇబ్బందులను తొలగిస్తుంది. ఇన్సూరెన్స్ ఉంటే డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలనే ఆలోచనలు మానేసి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద దృష్టి పెడతాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇస్తాయి. డయాబెటీస్, బీపీ వంటివి ఉంటే ఇవ్వవు. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తీసుకున్న పాలసీలో, మొదటి రోజు నుంచి అంతకు ముందు ఉన్న అనారోగ్యాలకూ మెడికల్ కవరేజ్ వస్తుంది’’ అన్నారు. 

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఒక సదుద్దేశంతో నన్ను సంప్రదించారు. నేను చాలా సంతోషంగా ఈ లక్ష్యసాధనలో ఓ భాగం అయ్యాను. ప్రతి సినిమాకూ మీడియా ప్రతినిధులు మద్దతు ఇస్తూ, ఆశీర్వదిస్తున్నారు. నటుడిగా ఈ లక్ష్యానికి నావంతు మద్దతు ఇవ్వాలని అనుకున్నా’’ అన్నారు.

సురేంద్ర కుమార్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘మన మీడియా సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా... వాళ్లకు ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో 2004లో ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ స్థాపించడం జరిగింది. అప్పుడు రఘు అధ్యక్షుడిగా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అసోసియేషన్‌ని కంటిన్యూ చేయలేకపోయాము. మళ్లీ కొన్ని సమస్యలు రావడంతో అందరం కలిసికట్టుగా ఈ అసోసియేషన్ కార్యక్రమాలు ప్రారంభించాం. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అనివార్య కారణాలు, ఘటనల వల్ల అసోసియేషన్ సభ్యులు ఆఫీసులకు వెళ్లలేకపోతే... వారికి కొన్ని వారాల పాటు జీతం అందజేయాలని నిర్ణయించాం. అసోసియేషన్ సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఇందులో కొత్తవారు కూడా జాయిన్ అవొచ్చు. ఎవరూ జాయిన్ కాకూడదనే నిబంధనలు ఏమీ లేవు. మొదటి విడతగా 150 మందిని జాయిన్ చేసుకున్నాం. రెండో విడతలో ఇంకా అర్హులైన వారు ఎంతమంది ఉన్నారో... అందర్నీ అసోసియేషన్‌లోకి తీసుకుంటాం. దయచేసి ఎవరూ ఏమీ అనుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అన్నారు.

‘దిల్’ రాజు మాట్లాడుతూ.. ‘‘ఒక సదుద్దేశంతో ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమం ఇది. రఘు, ఇతర అసోసియేషన్ సభ్యులు వచ్చి నన్ను కలిశారు. ‘చేసేది మంచి పని అయినప్పుడు నేనే ముందుంటాను. గో హెడ్’ అని చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇక్కడ ఉన్న మీడియా వాళ్లు అందరూ చాలా క్లోజ్. వారంలో ఒక్కసారైనా ఏదో ఒక ఈవెంట్‌లో కలుస్తుంటాం. అటువంటి నా మిత్రుల కోసం మంచి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని, మంచి పనిని ఎంకరేజ్ చేయాలని ముందుకొచ్చాను. మా నిర్మాతలు, హీరో తేజ్ కూడా ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇదే మొదలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు రావాలి. మనమంతా ఒక కుటుంబం’’ అన్నారు.   

ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న 99 శాతం మంది జర్నలిస్టులు నాకు పేరుతో పరిచయం ఉన్నవాళ్లే. చాలా సంవత్సరాలుగా, ‘స్వయంవరం’ నుంచి నా ప్రయాణంలో తెలిసినవారే. బేసిగ్గా.. సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు గానీ, విడుదల చేసేటప్పుడు గానీ చాలా క్రమశిక్షణ పాటిస్తాం. తెరవెనుక పనిచేసే కొందరి జీవితాలకు సంబంధించి మరింత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్టుల్లో, మీడియాలో, మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తుల జీవితాలకు సంబంధించి చాలా ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. మనుషుల ప్రాణాలకు మనం ఎందుకంత విలువ ఇవ్వం? అని ఆలోచిస్తుంటా. దానికి సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ చాలా పెద్ద బాధ్యత తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందు బ్యాక్ ఎండ్‌లో ఎంత పని చేసి ఉంటారో నేను ఆలోచించగలను. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే పని మనమంతా చేస్తున్నాం. మేం సినిమాలు తీయడం గానీ, వాటికి సంబంధించి వార్తలు రాయడం గానీ.. ప్రతిదీ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచేదే. సినిమా చూసి రివ్యూ రాయాలన్నా... వార్తలు రాయాలన్నా... మీడియా ప్రతినిధులు ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే... జీవితం పట్ల భరోసా ఉన్నప్పుడు. అటువంటి భరోసా ఇచ్చే ఈ కార్యక్రమం మరింత ఉదృతంగా జరగాలి. ‘దిల్’ రాజుగారు చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎంత భరోసా ఉంటుందో... ఫిల్మ్ జర్నలిస్ట్‌కి అంతే భరోసా ఉండాలి. ఆ బాధ్యత తీసుకునేలా అందరం ప్రవర్తించాలి. దానికి మేం ఏం చేయగలిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెబుతున్నా. ఆర్థికంగా అయినా... మరో రకంగా అయినా.. ముందుంటానని లక్ష్మీనారాయణ, రఘు, రాంబాబు తదితరులకు చెబుతున్నా. ఈ రోజు ఒక గొప్ప పనికి పునాది పడింది. ఈ అసోసియేషన్ ఒక స్ట్రక్చర్‌ని తయారు చేస్తుంది. ఇది ఇంకా బలంగా... దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల్లోకి బలంగా వెళ్లాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ‘‘ఫిల్మ్ జర్నలిస్టుల జీవితాల్లో ఇదొక మంచి రోజు. జర్నలిస్టుల జీవితాలు అభద్రమైనవి. చాలా పెద్ద ఎత్తున జీవితాలు ఏమీ ఉండవు. కానీ, చాలా గౌరవప్రదమైన వృత్తి. జర్నలిస్టులు అంటే నలుగురికి తెలిసినవాళ్ళు. నలుగురు గౌరవించేవాళ్ళు. జర్నలిస్టుల్లో ఫిల్మ్ జర్నలిస్టులు వేరు. అందరూ కలిసి మెలిసి ఉంటారని నేను భావిస్తున్నా. వీరికి ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జర్నలిస్టుల పక్షపాతిగా వ్యవహరిస్తోంది. అయితే... కొన్ని పరిమితులు ఉన్నాయి. మీడియా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తోంది. వెబ్ జర్నలిజానికి పెద్దగా గుర్తింపు, అక్రిడేషన్ లేవు. వారికి ఈ పథకం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎటువంటి పరిమితులు లేకుండా ఈ అసోసియేషన్ ఇచ్చిన భరోసా చాలా పెద్దది. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. తరవాత జర్నలిస్టుల జీవితాలు బాగు పరచడానికి మరిన్ని పథకాలు ప్రవేశ పెట్టాలని కోరుకుంటున్నా. ఇంతకు ముందు కొంతమందితో మాట్లాడినప్పుడు... సినిమా జర్నలిస్టుల్లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఒకటి, ఈ అసోసియేషన్ ఒకటి ఉన్నాయి. రెండింటిలో సభ్యులతో పాటు ప్రింట్ మీడియాలో వాళ్ళు కూడా చేరితే సంపూర్ణంగా అందరికీ భద్రత లభిస్తుందని నేను భావిస్తున్నా’’ అన్నారు.

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘అసోసియేషన్‌ని ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచన ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రూపాంతరం చెందింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా... ఒకరికి ఒకరం ఉన్నామని చెప్పుకోవడం కోసం ఏర్పాటైంది. ఎవరి వ్యక్తిగత ఇమేజ్ వాళ్లకు ఉంది. అయితే... అందరం ఒక అసోసియేషన్ లా ఏర్పడి ఒక్కతాటిపై ఉన్నామని, ఎవరికి ఏం జరిగినా అందరూ ఉండాలనే ఆలోచనతో కొత్త కమిటీ పని చేస్తుంది. అందులో మొదటిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. కొందరికి యాక్సిడెంట్ అయితే వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు సహాయం చేయడం తప్ప... ఆ 15 రోజులు లేదా నెల ఆ కుటుంబం ఎలా గడుస్తుందని గతంలో చాలామంది ఆలోచించారు. చాలా ప్రయత్నాలు చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి ఆ ప్రయత్నాలు రూపాంతరం చెందలేదు. ఇప్పుడు అలా కాకుండా అందరం కలిసి ఉండాలని, కలిసి ముందుకు వెళ్లాలనే ఆలోచనతో... అదే ముఖ్యమైన అజెండాగా పని చేస్తాం. మాకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. అసోసియేషన్ ముందుకు వెళ్లడంలో భాగంగా కొంతమందిని సభ్యులుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కాకుండా ఇంకా కొందరు ఉన్నారు. వాళ్లకు త్వరలో సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది. గడచిన పాతికేళ్లలో ఇటువంటి కార్యక్రమం తొలిసారి జరుగుతుందని గర్వంగా చెప్పగలను. ఇందులో సభ్యులు కానివారికి చెప్పేది ఒక్కటే... వాళ్లూ ఇందులో సభ్యులే. వాళ్లకు ఏమైనా జరిగితే ఈ అసోసియేషన్ వాళ్లతో ఉంటుంది. అందులో భాగంగా చాలా ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగాం, గ్రూప్ అసోసియేషన్ అంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎతికా వాళ్లు మనకు ఈ అవకాశం ఇచ్చారు. సభ్యులు కానివారు ఎవరికైనా ప్రమాదం జరిగితే... వాళ్లను అప్పటికప్పుడు సభ్యులుగా చేర్చుకుని, వాళ్లకు ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశాన్ని వాళ్లు మనకు కల్పించారు. ఈ హెల్త్ కార్డులు ఎవరికీ ఉపయోగపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే? ఏదైనా ప్రమాదం జరిగితే మన జేబులో మూడు లక్షలు, ఐదు లక్షలు ఉన్నాయని ఒక భరోసా కల్పించడానికి మాత్రమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం రాకూడదని మా ముఖ్య ఉద్దేశం. అల్లం నారాయణగారు చెప్పినట్టు ఇదొక అసోసియేషన్. ఇంకొకటి ఇంకో అసోసియేషన్. మేం వేర్వేరు అని కాకుండా... ఫిల్మ్ జర్నలిస్టులు అంటే అందరం ఒక్కటే. అందరూ ఒకే తాటిపై ఉంటారు అనే దిశగా మా చర్యలు ఇకముందు ఉంటాయని సభాముఖంగా హామీ ఇస్తున్నా. అందరం మళ్లీ త్వరలో కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు.    

‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ ఆఫీస్ బేరర్స్ వివరాలు:

ప్రెసిడెంట్: వి. లక్ష్మీనారాయణ 

వైస్ ప్రెసిడెంట్: వై.జె. రాంబాబు, ఎం. చంద్రశేఖర్

జనరల్ సెక్రటరీ: నాయుడు సురేంద్రకుమార్

జాయింట్ సెక్రటరీ: జి.వి. రమణ, జి. శ్రీనివాస్ కుమార్

ట్రెజరర్: జి. జలపతి 

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:

పి. రఘు, వై. రవిచంద్ర, కె. అప్పారావు (ఫణి), వి. శ్రీనివాసరావు (ఏలూరు శీను), జె. అమర్ వంశీ బాబు, వంశీ కాక, వి. సూర్యనారాయణ మూర్తి, జి. శ్రీనివాస్.

Film Newscasters Association of Electronic Media - Health Cards Distribution Event:

Film Newscasters Association for health security of film journalists

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement