ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముగ్గురు భారీ నిర్మాతలైన దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిలు నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి నెలాఖరుకి గానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ గుమ్మడి కాయ కొట్టడం ఖాయం. ఇక మహేష్ తన తదుపరి 26వ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ బేనర్‌లో చేయనున్నాడు. ‘శ్రీమంతుడు’ తర్వాత ఇదే బేనర్‌లో మహేష్ నటించే చిత్రానికి ‘1’ (నేనొక్కడినే) దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.
యాక్షన్ థ్రిల్లర్‌గా సుక్కు-మహేష్-14 రీల్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘1’ నేనొక్కడినే చిత్రం కమర్షియల్‌గా పెద్ద డిజాస్టర్‌గా నిలిచినా విమర్శకుల ప్రశంసలు, మేథావుల చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక సుక్కు చిత్రాలు సామాన్యులకు అర్ధంకావు అనే అపవాదుని ఆయన ‘రంగస్థలం’తో తుడిపేశాడు. అందుకోసం మహేష్‌తో కూడా అందరినీ మెప్పించే కథతోనే చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడు. కాస్త పీరియాడికల్ మూవీగా తెలంగాణ రజాకర్ల బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీని అనుకున్నా, అది అన్ని వర్గాల వారికి అర్ధం కాదనే ఉద్దేశ్యంతో ఓ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను తయారు చేశాడట. ఇందులో ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, కడప వంటి పలు చోట్ల సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
ఇలాంటి స్టోరీతో చిత్రం వచ్చి చాలా కాలమే అయినందున నేటి తరానికి ఇది కొత్తగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరోవైపు ఫుల్‌స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. దీనిని వచ్చే సంక్రాంతి బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ సారి సుక్కు మహేష్‌కి ‘1’ (నేనొక్కడినే) డిజాస్టర్‌కి బదులుగా భారీ బ్లాక్‌బస్టర్ ఇస్తాడో లేదో వేచిచూడాలి...!