ఒకప్పుడు దక్షిణాదిన కోలీవుడ్‌లోనే బహుభాషా చిత్రాలు వచ్చేవి. కమల్‌హాసన్, రజనీకాంత్, సూర్య, విక్రమ్ వంటి వారికి అన్నిచోట్లా ఫాలోయింగ్ ఉండటంతో దీనిని తమిళ సినీ ప్రముఖులు బాగా ఉపయోగించుకున్నారు. కానీ ప్రస్తుతం దక్షిణాదిన తమిళంతో పాటు తెలుగు చిత్రాలు కూడా బహుభాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. బహుభాషల్లో సినిమాలను నిర్మించడం వల్ల బడ్జెట్ పరంగా ఎన్నో సానుకూలాంశాలు ఉంటాయి. ఎక్కువ బడ్జెట్‌ని పెట్టడానికి ధైర్యం వస్తుంది. ఇక నిన్న మొన్నటి వరకు మలయాళ, కన్నడ చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌తో, తక్కువ పారితోషికాలతో రూపొందేవి. కానీ నేడు వాటిల్లో కూడా భారీ బడ్జెట్, బహుభాషా చిత్రాలు వస్తూ ఉన్నాయి. ఇక మరో విశేషం ఏమిటంటే.. కొంత మందికి తెలియకుండానే వారికి కొన్ని బిరుదులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు కృష్ణవంశీని చిన్నవంశీ అంటారు. నిన్నటి క్రియేటివ్ దర్శకుడైన వంశీ పేరును కృష్ణవంశీకి వాడటం నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ చిన్న వంశీ అంటే కృష్ణవంశీకి ఇష్టం ఉండదు. అలాగే పెద్ద వంశీ అంటే వంశీకి కూడా ఇష్టం ఉండదు.
ఇక విషయానికి వస్తే గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో కన్నడ మాస్ హీరో యష్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యష్ ‘కేజీఎఫ్’ అనే చిత్రం ద్వారా డిసెంబర్ 21న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం కోలార్ బంగారు గనుల్లో పనిచేసే కార్మికుల నేపధ్యంలో రూపొందింది. కాగా కన్నడస్టార్ కిచ్చా సుదీప్‌ని రాజమౌళి తన ‘ఈగ’ ద్వారా విలన్‌గా పరిచయం చేసినట్లు, యష్‌ని కూడా జక్కన్న, రామ్‌చరణ్ ఎన్టీఆర్ మూవీలో విలన్‌గా తీసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. వాటిని యష్ ఖండించాడు. డిసెంబర్ 21న ‘కేజీఎఫ్’ చిత్రం వరుణ్‌తేజ్ ‘అంతరిక్షం’, శర్వానంద్-సాయిపల్లవి-హనురాఘవపూడిల ‘పడిపడిలేచె మనసు’తో పోటీ పడుతూ వస్తోంది.
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ, ఈ చిత్రం ‘ఛత్రపతి’కి దగ్గరగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇక నా ఫిజిక్‌ని చూసిన వారంతా దక్షిణాదిలో సెకండ్ ప్రభాస్ అని పిలుస్తున్నారు. నాకు సెకండ్ ప్రభాస్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. మొదటి యష్ అనిపించుకోవడమే ఇష్టంగా ఉంటుంది. ఇప్పటికే నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న నేను ‘కేజీఎఫ్’తో మరో అవార్డు సాధించడం ఖాయమంటున్నారు. కానీ నాకు అవార్డులు ముఖ్యం కాదు. ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నాకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు.