Advertisement

ప్రజల మనస్సుల్లో ఉండగా పద్మశ్రీ లెందుకు?

Tue 03rd Jul 2018 06:53 PM
sv rangarao,special artical,100th birthday,journalist bhagiratha  ప్రజల మనస్సుల్లో ఉండగా పద్మశ్రీ లెందుకు?
SV Rangarao 100th Birthday Special ప్రజల మనస్సుల్లో ఉండగా పద్మశ్రీ లెందుకు?
Advertisement

'మనం ఎలా పుట్టామన్నది కాదు ముఖ్యం , ఎలా  చనిపోయామనేది' అని ఒక తెలుగు సినిమాలో యస్వీ  రంగారావు అంటాడు. నిజమే మనుషులు పుడుతుంటారు, మరణిస్తుంటారు. కానీ చనిపోయే నాటికి వారు సాధించిన విజయాలు వారిని చిరస్థాయిగా నిలబెడతాయి. మరణం అనేది మనిషికి అనివార్యం. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు గీతలో చెప్పినట్టు 'జాతస్య మరణం ధృవం'. ఈ మరణాన్ని మహనీయులు మాత్రమే జయిస్తారు. అయితే సినిమా కళాకారులు ఎంతో అదృష్టవంతులు. ముఖ్యంగా మహా నటులు భౌతికంగా మరణించినా తెరపై ఎప్పుడూ మెదులుతూనే వుంటారు. ఈ కోవకి చెందిన నటుడే యస్వీ రంగారావు. ఇలాంటి నటులు ప్రతి తరాన్ని వినోద పరుస్తూనే వుంటారు, ప్రభావితం చేస్తూనే వుంటారు. 

యస్వీ రంగారావు మనకు భౌతికంగా దూరమై 44 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన నటించిన సినిమాలు ఈ తరాన్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటూనే వున్నాయి . ప్రతిభావంతుడైన కళాకారుడు ఎప్పుడు జీవించే ఉంటాడు అందుకు నిదర్శనం రంగారావు. 

జూలై 3న జన్మించిన రంగారావు తల్లితండ్రులు శ్రీమతి లక్ష్మి, కోటేశ్వర రావు. బీఎస్సీ  చదివిన రంగారావు కొంత కాలం ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. చిప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇష్టం. 1946లో తన బంధువు బీవీ రామానందం 'వరుదిని' చిత్రంలో నటించడానికి ఆహ్వానించాడు. అయితే ఆ తరువాత మళ్ళీ వేషాలు వెంటనే రాలేదు. టాటా కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. 1949లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన 'మనదేశం' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం ద్వారానే ఎన్టీరామారావు పరిచయం అయ్యాడు. ఆ తరువాత బి ఏ సుబ్బారావు  'పల్లెటూరి పిల్ల' చిత్రంలో మంచి పాత్ర నిచ్చారు. 1951లో విజయావారి 'పాతాళ భైరవి' సినిమాలో నేపాల మాంత్రికుడిగా రంగారావు నటన ఆయన్ని ఉన్నత శిఖరం మీద కుర్చోపెట్టింది. అక్కడ నుంచి రంగారావు నట జీవితం పరుగు ప్రారంభించింది. బ్రతుకుతెరువు, పెళ్లిచేసి చూడు, దేవదాసు, పరదేశి, బంగారుపాప, రాజు పేద, అనార్కలి, గుణసుందరి, మిస్సమ్మ, చింతామణి, అల్లావుద్దీన్ అద్భుతదీపం, మాయాబజార్, సతీసావిత్రి, తోడికోడళ్లు, అప్పుచేసి పప్పుకూడు, భూకైలాష్, చెంచులక్ష్మి, పెళ్లినాటి ప్రమాణాలు, జయభేరి, నమ్మినబంటు, దీపావళి, కలసివుంటే కలదు సుఖం, సతి సులోచన, ఆత్మ బంధువు, గుండమ్మ కథ, మంచి మనసులు, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, వెలుగు నీడలు, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద, రహస్యం, చదరంగం, భాదవ్యాలు, బందిపోటు దొంగలు, చిన్నారి పాపలు, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, సంపూర్ణ రామాయణం, బాలభారతం, తాత మనవడు, దేవుడు చేసిన మనుషులు, పండంటి కాపురం, యశోదా కృష్ణ  మొదలైన సినిమాలలో నటించాడు. మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా రంగారావు నటించాడు. 

తెలుగు తమిళ భాషల్లో అనేక గొప్ప చిత్రాల్లో చిరస్మరణీయమైన పాత్రల్లో నటించాడు. రంగారావు ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆయనతో సమంగా నటించడానికి హీరోలు చాలా కష్ట పడేవారు. తన నటనతో అందరినీ డామినేట్ చేసేవాడు. బహుశా రంగారావు లాంటి నటుడిని మరొకరిని చూడలేము. ఆయనకు సాటి వేరేవారు రారు. ఆయన హావభావాలు, ఉచ్చారణ, శరీర కదలికలు చాలా విభిన్నంగా వుంటాయి. 56 సంవత్సరాల వయసులో రంగారావు 1974 జులై 18న ఇహలోక యాత్ర ముగించాడు. ఇది ఎవరు ఊహించని పరిణామం. యస్వీ  రంగారావు కారణం జన్ముడు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిరంగా వున్నాడు. 

                                                                                                                   -భగీరథ

SV Rangarao 100th Birthday Special :

Journalist Bhagiratha About SVR Greatness

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement