కొందరికి కొందరి గొంతు బాగా కలిసి రావడమే కాదు... ఆయా సినిమాలకు ఆ పాటలే హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు లోకనాయకుడు కమల్‌హాసన్‌కి తెలుగులో డబ్బింగ్ చెప్పాలంటే ఎస్పీబాలసుబ్రహ్మణ్యం అయితేనే న్యాయం చేస్తాడు. అదే రజనీకాంత్ అంటే ఆయన పాత్రకు మనో అయితే ప్రాణం పోస్తాడు. ఇక రజనీకి బాలు డబ్బింగ్ చెప్పిన చిత్రాలు, కమల్‌కి మనో చెప్పిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక రజనీకి సాయికుమార్ వాయిస్ కూడా 'భాషా'లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిన విషయమే. ఇక విషయానికి వస్తే 'నేనాటోవాణ్ణి.. ఆటో వాణ్ణి..., నాపేరు నరసింహ.. ఇంటి పేరు నరసింహ, దేవుడ దేవుడా తిరుమల దేవుడా' వంటి చిత్రాలన్నీ రజనీకాంత్ చిత్రాలలోని టైటిల్ సాంగ్స్. ఇవ్వన్నీ ఎవర్‌గ్రీన్ హిట్స్. వీటికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటంటే..ఈ పాటలన్నింటినీ పాడింది గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం.
ఇక ఇటీవల రజనీ చిత్రాలలో బాలు గొంతు కాకుండా ఎవరెవ్వరి గొంతులో వినిపిస్తున్నాయి. టైటిల్ ట్రాక్స్‌ని కూడా రజనీతో పాటు ఆయా చిత్రాల దర్శకులు ఇతరులతో పాడిస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత మరలా రజనీ-ఎస్పీబాలు కాంబినేషన్ మరోసారి మ్యాజిక్‌ని రిపీట్ చేయనుంది. ప్రస్తుతం రజనీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడు. హిల్‌స్టేషన్, మంచుకొండల వంటి చోట షూటింగ్ జరపాల్సి ఉండటంతో వాటిని ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని టైటిల్‌సాంగ్‌ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత ఆల్‌రెడీ పాడించేశారట. ఇది నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు రజనీ నిర్ణయం అని కూడా తెలుస్తోంది.
రజనీ ఇంట్రో సాంగ్‌లు పాడని ఇటీవల వచ్చిన రజనీ చిత్రాలన్నీ బాగా నిరాశపరుస్తున్నాయి. మరి ఈ సూపర్‌హిట్ కాంబినేషన్ అయినా వర్కౌట్ అయి రజనీకి మంచి హిట్‌ని అందిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇక '2.ఓ'లో కూడా బాలు ఓ పాటను పాడినట్లు సమాచారం. ఇక కార్తీక్ సుబ్బరాజ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.