ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఆయనకు అనుకూలంగా కొందరు, ప్రతి కూలంగా కొందరు స్పందిస్తున్నారు. ఇక మోదీని విమర్శించడంలో కన్నడ నటుడు ప్రకాష్‌రాజ్ తరహాలోనే మండ్యా నియోజకవర్గ మాజీ ఎంపీ, సినీ నటి రమ్య తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ చిన్న అవకాశం వచ్చినా మోదీని ఘాటుగా విమర్శించే ఈమె తాజాగా ఘాటు వ్యాఖ్యలే చేసింది. 'పేటీఎం' అంటే పే టు మోదీ అంటూ ఆమె కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇటీవల ప్రకాష్‌రాజు కూడా 'ఏటీఎం' అంటే ఎవ్వరి ఓటు ఫర్ మోదీ అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా రమ్య మాట్లాడుతూ, మోదికి డబ్బు చెల్లించండి.. పే టు మోదీ అంటూ ట్యాగ్‌లైన్ జత చేసింది. పేటీఎం పేరుతో మీ డబ్బుమోదీ జేబులోకి వెళ్తున్నట్లే. మీకు సంబంధించిన డేటా ఈ యాప్ ద్వారా బిజెపికి తరలిపోతోందని ఆమె ఘాటు విమర్శలు చేసింది. దీనిపై మోదీ, బిజెపి మద్దతుదారులు రమ్యపై మండిపడుతున్నారు. రాహుల్‌గాంధీ కోసం నౌకరి, చాకిరి చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ విమర్శించగా, మన డేటా వాటికన్‌కి తరలి పోవడం కంటే బిజెపి చేతుల్లోకి వెళ్లడమే బెటర్ అని మరో నెటిజన్ సెటైర్ విసిరాడు.
ఇక వచ్చే ఎన్నికల్లో మోదీ మరలా ప్రధానమంత్రి అవుతాడా? బిజెపి మరలా గెలుస్తుందా? కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? లేదా? అనే విషయమై పలు సర్వేల రిపోర్ట్‌లు పలు విధాలుగా ఉన్నాయి. ఓ సర్వే బిజెపి ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని తెలిపితే, తాజాగా మరో సర్వే కాబోయే తదుపరి ప్రధానమంత్రి కూడా మోదీనే అంటూ రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి సరిపోడని అతి ఎక్కువశాతం ప్రజలు అభిప్రయాపడుతున్నట్లే వార్తలు రావడంతో అంతటా సందిగ్దత నెలకొంది. మరి మోదీ పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఏమిటో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేవరకు తెలియదనే చెప్పాలి.