పవన్ నిన్న మొన్నటివరకు టిడిపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడు. దానికి కారణం తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లడమే ముఖ్యమని చెప్పాడు. జగన్‌ను ఉద్దేశించి దోపిడీదారుడే నాయకుడైతే సమాజానికి ఎంతో ప్రమాదమని అన్నాడు. ఇక వైసీపీ నాయకులు, ముఖ్యంగా రోజా వంటి వారు ఈ విషయంలో పవన్‌పై మండిపడి వపన్‌ని టిడిపి తొత్తు అన్నారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ముఖ్యంగా నారాలోకేష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశాదు. కానీ ఆయన అదే సమయంలో జగన్‌ని కూడా నేరుగా విమర్శించి ఉంటే, మోదీని కూడా పేరుపెట్టి దుయ్యబట్టి ఉంటే బాగుండేది. అలా చేసివుంటే ఆయన ప్రసంగానికి సమతుల్యత వచ్చి న్యూట్రల్ అనిపించేవాడు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కోదండరాం విషయంలో ఇష్టం వచ్చినట్లు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పవన్ కేవలం టిడిపిని, చంద్రబాబు, లోకేష్‌లనే కాకుండా వైసీపీ, జగన్, కేసీఆర్, కేటీఆర్.. ఇలా అందరి దుష్పరిపాలనను ఎండగట్టి ఉండే బాగుండేదని, ఈ ప్రసంగం చూస్తే కేవలం నారా లోకేష్ ఒక్కడే అవినీతిపరుడు అనేలా ఆయన ప్రసంగం వన్‌సైడ్‌గా సాగిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత సమయంలో పవన్ టిడిపి, బిజెపి, టీఆర్‌ఎస్, వైసీపీ నుంచి చివరకు కాంగ్రెస్‌కి కూడా దూరం పాటిస్తూ సొంతగా ఎదగడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక పవన్ ఎప్పుడైతే నారా లోకేష్ అవినీతిని బయటపెట్టాడో... మరి మీ అన్నయ్య సంగతేంటి? ఆయన ప్రజల విశ్వాసాన్ని తాకట్టు పెట్టి సోనియా కాళ్ల ముందు తన పీఆర్పీని పెట్టలేదా? ముందు అందరినీ ప్రశ్నించే ముందు నువ్వు మీ అన్నయ్యను కూడా ఎందుకు ప్రశ్నించవు? అనే వాదన కూడా మొదలైంది.
ఇక తాజాగా పవన్ మరోసారి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డాడు. విజయవాడలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడారు. ముఖ్యమంత్రిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆయన చాలా ఆలస్యంగా మేల్కొన్నాడు. పరిస్థితులు చేయిదాటిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నాడు. ప్రస్తుత విషమ పరీక్షలను ఎదుర్కోవడం మినహా ఆయన చేయగలిగింది ఏమీలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక కొందరు పవన్ వ్యతిరేకులు మాత్రం పవన్ చిన్నగా తన అన్నయ్య పార్టీ కాంగ్రెస్‌కి దగ్గరవుతున్నాడా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.