హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగుమహా సభల సందర్భంగా దేశ ఉప రాష్ట్రపతి, తెలుగువాడైన వెంకయ్యనాయడు ఎంతో ఆవేదనతో, ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, నేను ఢిల్లీలో ఉంటున్నప్పటికీ ఢిల్లీలోని తెలుగు వారందరినీ ఒకచోట చేర్చి వారితో కలిసి ముచ్చటిస్తూ ఉంటాను. దాంతో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. తెలుగువారి కార్యక్రమాలు, సాహిత్య వేడుకల వంటివి ఏమి జరిగినా హాజరవుతుంటాను. నెలకి ఒకసారైనా నేను పెరిగిన తెలంగాణకి, నేను పుట్టిన ఏపీకి రాకపోతే నాకు ఎంతో బాధగా ఉంటుంది. ఈ నేలపై నడవకపోతే ఎంతో దిగాలుగా ఉంటాను. అందుకే ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా నెలకొకసారైనా తెలుగు రాష్ట్రాలకు వస్తూ ఉంటాను.
ఇక తెలుగు మన మాతృభాష. దానిని మృత భాషగా మార్చవద్దు. నేను మనసులో ఆవేదనతో చెబుతున్నాను. ఇప్పుడు నాకు 68 ఏళ్లు. మన మనవళ్లు, మనవరాళ్లు పెద్దయ్యే రోజులకి తెలుగు పరిస్థితి ఏమిటి? అనేది ఆలోచిస్తేనే బాధగా ఉంటుంది. ఒక్క తెలుగుకే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని భాషల పరిస్థితి అలాగే ఉంది. మాతృభాషలో బోధన జరిగి, మాతృభాషలో పరిపాలన సాగితే తెలుగు భాష, సంస్కృతులు నిలబడతాయి. మాతృభాషని విస్మరిస్తే అది మన అస్థిత్వానికే పెనుముప్పుగా మారుతుంది.
మన భాష, మన యాస అంతరించిపోవడం ఏమాత్రం మంచిది కాదు. భాష ద్వారా నాగరికత వస్తుంది. సామాజిక పరిణామంలో భాష ఇరుసు వంటిది. భాష, యాసని మర్చిపోతే మన కన్నతల్లిని మర్చిపోయినట్లేనని ఆవేదన చెందుతూ ప్రసంగించారు.