ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదన్నా వుంది అంటే అది 'జై లవ కుశ, స్పైడర్' సినిమాల విడుదల గురించే. ఈ రెండు సినిమాలు దసరా బరిలో ఉండడం, రెండు సినిమాల్లో టాప్ హీరోస్ నటించడం, రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడం.... లాంటి విషయాలతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు రకరకాల వార్తలతో మీడియా నోట్లో నానుతున్నాయి. విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రెండు సినిమాల హడావిడి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. ఇక 'స్పైడర్' సంబరాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి... శనివారం సాయంత్రం 'స్పైడర్' ఆడియో వేడుకని చెన్నైలో భారీ లెవల్లో నిర్వహిస్తున్నారు. అలాగే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా రేపు ఆదివారం అదిరిపోయే లెవల్లో చెయ్యబోతున్నారు.
అయితే 'స్పైడర్' ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే లెవల్లో జరిగినట్టే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ కూడా భారీ లేవల్లోనే జరిగినట్టు వార్తలొస్తున్నాయి. ఇకపోతే 'స్పైడర్' హిందీ రైట్స్ ని అమ్మకుండా ఉంచేశారు. అందుకే 'స్పైడర్' మాత్రం హిందీలో విడుదల కావడంలేదు. ఇక 'జై లవ కుశ' కి మాత్రం హిందీలో మంచి రేటు వచ్చిందంటున్నారు. 'జై లవ కుశ' హిందీ హక్కులను ఏకంగా కళ్యాణ్ రామ్ 11 కోట్లుకు విక్రయించినట్లుగా చెబుతున్నారు. ప్రముఖ జీ సినిమా సంస్థ 'జై లవ కుశ' హిందీ హక్కులని దాదాపు 11 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని సమాచారం. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక బాలీవుడ్లో కూడా 'జై లవ కుశ' బిజినెస్ అదుర్స్ అంటూ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే 'జై లవ కుశ' మూడు టీజర్స్ తో మంచి ఇంప్రెషన్ కొట్టేస్తుంది. మరి థియేట్రికల్ ట్రైలర్ కూడా ఎలా వుండబోతుందో రేపు ఆదివారం సాయంత్రానికల్లా తేలిపోతుంది. ఇకపోతే ఈ రోజు శనివారం సాయంత్రం చెన్నైలో జరిగే 'స్పైడర్' ఆడియో వేడుకలో 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ ని కూడా లాంచ్ చెయ్యబోతున్నారు. 'స్పైడర్' టీజర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్ ఎలా వుండబోతుందో అంటూ ఎదురు చూస్తున్నారు.