ఇప్పుడు ఎక్కడ చూసినా బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో లో పాల్గొనే పార్టిసిపేట్స్ మీదే అందరి ఫోకస్ వుంది. ఆ షో బాగా క్లిక్ అవ్వాలంటే కేవలం ఎన్టీఆర్ కున్న క్రేజ్ మాత్రమే సరిపోదు. అందులో పాల్గొనే వారి మీద కూడా షో భవితవ్యం ఆధారపడి ఉంటుందని.... ఆల్రెడీ మనకు తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ద్వారా అర్ధమైపోయింది. కేవలం హోస్ట్ కున్న క్రేజ్ ఒక్కటే సరిపోదు అందులో పాల్గొనే పార్టిసిపేట్స్ కి కూడా కాస్తో కూస్తో క్రేజ్ ఉండాలని ఆ షో నిరూపించింది.
అయినా ఒక స్టార్ హీరో బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు అంటే ఆ షో మొదటి ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ షోలో ఆ స్టార్ హీరో ఎలాంటి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటాడు, అతని బడి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అసలు ప్రేక్షకులను ఆ స్టార్ ఎలా ఎంటర్టైన్ చెయ్యగలడు అనే వాటి మీద క్యూరియాసిటీ తో ఉంటారు కాబట్టి ఆ షో మొదటి ఎపిసోడ్ కి అంత హైప్ వచ్చేస్తుందన్నమాట. ఇకపోతే ఎన్టీఆర్ స్టార్ మాలో కనబడేది కేవలం వారానికి రెండు రోజులే. ఆ సమయంలో ఆ షో కి మంచి క్రేజ్ ఉంటుంది. కానీ మిగతా రోజులు ఆ షోలో ఎవరైతే పాల్గొంటారో ఆ పార్టిసిపేట్స్ మీద ఆ షో భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
అయితే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ అనే సరికి బిగ్ బాస్ షో కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ షో టీవీలో టెలికాస్ట్ చేసి పార్టిసిపేట్స్ పేర్లు బయటికి వచ్చేసరికి ఆ షో బడాయి ఏంటో ఇట్టే తెలిసిపోయింది. మొదటి ఎపిసోడ్ కే ప్లాప్ మాట మూటగట్టుకుంది. అంటే కమల్ క్రేజ్ కూడా ఆ షో ని కాపాడలేకపోయిందనేగా దీనర్ధం. ఇక కమల్ హోస్ట్ గా వచ్చిన ఆ షో టీవీలో ప్రసారం అయినపుడు ఆ షోకి వచ్చిన రేటింగ్లో అది ఐదో ప్లేసులో నిలబడగలిగింది. ముందు రెండు ప్లేస్ లలో తమిళ సీరియల్స్ హవా కొనసాగించగా మలి రెండు ప్లేస్ లు సినిమాలు ఆక్రమించేశాయి. సో తమిళంలో అంత బిగ్ స్టార్ హోస్ట్ చేసినప్పటికీ ఆ షో టీవిలో కొచ్చేసరికి పరువు పోగొట్టుకుంది. కారణం అందులో పాల్గొంటున్న పార్టిసిపేట్స్ అంటున్నారు.
అయితే తమిళ్ లో జరుగుతున్న ఆ షో చూశాక ఇప్పుడు ఇక్కడ స్టార్ మా ఛానల్ కి కూడా కొంచెం దడ స్టార్ట్ అయ్యిందట. ఎన్టీఆర్ క్రేజ్ తో మంచి బజ్ వచ్చిన ఈ షో టీవీలో ప్రసారం అయ్యాక ఎలా ఉంటుందో అనే పితలాటకంలో ఉన్నారట షో నిర్వాహకులు. మరి ఇక్కడ తెలుగులో ఈ షో సక్సెస్ అవ్వడానికి టాలీవుడ్ పార్టిసిపేట్స్ ఎంత హెల్ప్ అవుతారో అతి త్వరలోనే తెలిసిపోనుంది.