మురుగదాస్ తమిళ దర్శకుడే అయినా ఆయనకు తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా వీరాబిమానులు ఉన్నారు. శంకర్ తరహాలోనే ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ, కమర్షియల్ టచ్ ఇస్తుంటాడు అతను. అందుకే ఆయనతో కలిసి ఓ చిత్రం చేయాలని హీరోలందరూ ఉవ్విళ్లూరుతుంటారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ భాషల్లో మహేష్ బాబు హీరోగా 'స్పైడర్'ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా మహేష్ స్ట్రెయిట్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు.
కాగా ఇదే చిత్రాన్ని హిందీలోకి కూడా అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు ఈ చిత్రం తర్వాత మురుగదాస్ మరలా కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. 'తుపాకి, కత్తి' తర్వాత ఇది హ్యాట్రిక్ మూవీగా రూపొందనుంది. 'కత్తి' చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం రజినీ,శంకర్, అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న లైకా చిత్రం అధినేతలే మురుగదాస్- విజయ్‌ల చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా మరో వార్త తెలుగునాట సంచలనంగా మారింది. మురుగదాస్ గతంలో చిరంజీవి హీరోగా 'స్టాలిన్' చిత్రాన్ని తెరకెక్కించాడు. మరోవైపు మురుగదాస్ 'సెవెన్త్ సెన్స్' ఆడియో వేడుకలో రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి, మీతో పనిచేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ ఆయన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. వాస్తవానికి ఇప్పుడు చరణ్ 'ధృవ', తాజాగా 'రంగస్థలం 1985' వంటి విభిన్న చిత్రంలు చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ అధినేతలు విజయ్‌తో మురుగదాస్ చిత్రం తర్వాత రామ్ చరణ్, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
నిజానికి రామ్ చరణ్ మణిరత్నంతో అలాంటి చిత్రం చేయాలని భావించాడు. కానీ మణి 'చెలియా' దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ నేపద్యంలో మణితో కాకుండా మురుగదాస్‌లో వెళ్లాలని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక మెగా ఫ్యామిలీకి మురుగదాస్‌తో మంచి రిలేషన్ ఉంది. 'కత్తి'కి రీమేక్‌గా రూపొందిన చిరు 150 చిత్రం 'ఖైదీనెంబర్150'కి కథ, స్క్రీన్‌ప్లేను మురుగదాసే అందించడం విశేషం.