చనిపోయిన వాళ్లంతా పుణ్యాత్ములు.. బతికున్నోళ్లు చనిపోయినవారి తీపి గుర్తులు అన్నాడో కవి. ఇక కనిపెంచిన తల్లిదండ్రులను బతికుండగా, ముసలి వయసులో కూడా పట్టించుకోని కొందరు.. వాళ్లు చనిపోయిన తర్వాత మాత్రం పెళ్లిళ్ల కంటే గ్రాండ్‌గా కర్మలు, కతంత్రువులు, జయంతిలు, వర్ధంతులను మాత్రం ఘనంగా జరిపిస్తూ తమ గొప్పదనాన్ని అందరికీ చాటుతుంటారు. ఇదేతంతు.. దర్శకరత్న దాసరి విషయంలో జరుగుతోంది.
వాస్తవానికి చిరంజీవికి దాసరికి మొదట్లో సత్సంబంధాలుండేవి. దాసరి తన 100వ చిత్రం 'లంకేశ్వరుడు'లో పట్టుబట్టి మరీ చిరంజీవి ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొందరి మూలంగా వారి మధ్య విబేధాలు వచ్చాయి. ఇక అక్కడి నుంచి చిరు, దాసరి ఉప్పులో నిప్పు. మెగాభిమానులు కూడా అలాగే ఫీలయ్యేవారు. దాసరి కూడా పలు వేదికల్లో ఇన్‌డైరెక్ట్‌గా మెగాఫ్యామిలీ హీరోలపై కోపం ప్రదర్శించారని అంటుంటారు. అంటే 'లంకేశ్వరుడు' తర్వాత చిరుకి దాసరికి వచ్చిన విబేధాలు నేటితరం మెగాఫ్యామిలీ హీరోలైన చరణ్‌కు, బన్నీకి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఎవరైనా చెబితే వినడమే తప్ప వారికి స్వయంగా ఆ విషయాలు ప్రత్యక్షంగా తెలియదనే చెప్పాలి. కేవలం దాసరి మనకి వ్యతిరేకి అనే ధోరణిలోనే వారు ఉండేవారని పలు సంఘటనలను ఉదాహరణగా చెబుతూ పలువురు సినీ పెద్దలు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అల్లు వారి ఫంక్షన్‌కి ముఖ్యఅతిధిగా దాసరి హాజరై తనకు అల్లు కుటుంబంపై మంచి ప్రేమ ఉందని చెప్పారు.
ఇక ముద్రగడ ఉద్యమం పుణ్యమా అని కొందరి జోక్యంతో దాసరి, చిరుల మద్య విభేదాలు కూడా సమసిపోయాయి. పవన్.. దాసరికి ఓ సినిమా చేస్తాననడంతో పూర్తిగా మెగాఫ్యామిలీతో దాసరి వైరం ముగిసింది. తాజాగా 'కాదలి' సినిమా వేడుకలో దాసరి మరణానికి సంతాపం తెలుపుతూ, ఆయనను పొగిడి అందరిచేత మౌనం పాటింపచేసాడు చరణ్. తాజాగా సౌత్ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో బెస్ట్ క్రిటిక్స్ అవార్డు తీసుకున్న బన్నీ కూడా దాసరి గురించి పొగిడి ఆయన కోసం అందరూ మౌనం పాటించేలా చేశాడు. దీంతో చాలా మంది బతికుండగా తిట్టి, ఇప్పుడు గౌరవమిచ్చి ఏం లాభం అంటుంటే.. చనిపోయిన తర్వాత కూడా తమ అభిమానాన్ని చాటుకుని దాసరికి మెగాఫ్యామిలీ హీరోలు ఇస్తున్నగౌరవం పెద్దదని మెగాభిమానులు అంటున్నారు.
కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. దాసరి తన కుమారుడు అరుణ్‌కుమార్‌ని హీరోని కాదు కదా..! బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా కూడా చేయలేకపోయాడు. కానీ ఒడ్డుపొడవు, మంచి అందం, అంతఃపురం వంటి చిత్రాలలో సమ్‌థింగ్ తనలో టాలెంట్ ఉందని అరుణ్ నిరూపించుకున్నాడు. మరి తమ సినిమాలలో మంచి అవకాశాలిచ్చేలా చూసి అరుణ్‌ని కూడా బిజీ చేస్తే దాసరి ఆత్మ శాంతిస్తుంది...!