Advertisement

మాటల్లో కాదు.. చేతల్లో చూపు బాబూ..!

Fri 31st Mar 2017 09:20 PM
chandrababu naidu,10th class question paper leak,andhra pradesh,ys jagan,ysrcp,sakshi journalist  మాటల్లో కాదు.. చేతల్లో చూపు బాబూ..!
మాటల్లో కాదు.. చేతల్లో చూపు బాబూ..!
Advertisement

పదో తరగతి... ప్రతి విద్యార్ధి సోపానానికి ఓ పెద్దమైలు రాయి. దాంట్లో ప్రతి ఒక్కరు విజయం సాధించాలని, ర్యాంకులు సాధించాలని రాత్రింబగళ్లు కష్టపడతారు. తల్లిదండ్రులు ఎన్నో శ్రమలకోర్చి, నిత్యం చదువుతున్న తమ పిల్లలకు సేవలు చేస్తారు. ఇన్ని ఆశలు పెట్టుకునే ప్రతి విద్యార్దికి ఫలానా ప్రశ్నాపత్రం ముందుగానే లీక్‌ అయిందని, తమకంటే అందులోని ప్రశ్నలు ఇతర కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధులకు ముందే తెలిసిపోయాయని, కష్టపడి చదవిన తమకంటే ఆయా కార్పొరేట్‌ సంస్థల్లోని విద్యార్ధులకు ఎక్కువ మార్కులు వస్తాయని, లేదా పరీక్షను మరలా రద్దు చేసి పెడతారేమోననే భయాలు, ఒత్తిడి పెరిగితే వారి భవిష్యత్తు ఏమిటి? 

రాజకీయ నాయకుల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారందరూ చదివేది అవే కార్పొరేట్‌ సంస్థల్లోనే కాబట్టి. ఇక వారికి పెద్దగా ర్యాంకులు రాకపోయిన డొనేషన్లు కట్టి లోకేష్‌లాగా, జగన్‌ లాగా చదివేస్తారు. డిగ్రీలు తెచ్చుకుంటారు. మరోపక్క ఆయా కార్పొరేట్‌ స్కూళ్లలో చదివిన పాపానికి నిజంగా కష్టపడి చదివిన ఓ సంస్థకు చెందిన ఓ విద్యార్ధి మంచి ర్యాంకు తెచ్చుకున్నా కూడా ఆ సంస్థలో చదివినందు వల్ల, ఆ కార్పొరేట్‌ స్కూళ్లలో చదివిన పాపానికి అతని ఫస్ట్‌ర్యాంకును ఇతరులు అనుమానపు చూపులు చూస్తుంటే ఆ విద్యార్ధులు పడే ఆవేదన, ఆ చిన్నారి మనసులు కలుషితమయ్యేవిధానం ఎలా ఉంటుందో నేటి రాజకీయనాయకులకు తెలుసా? 

నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ కాలేజీలలో చదివేది ఒక చదువేనా? కాలేజీలలో సిసి కెమెరాలు పెడితే ఆయా విద్యార్ధులు చదువు పేరుతో పడుతున్న మానసిక ఆవేదన అర్ధమవుతుంది. పదోతరగతి ప్రశ్నాపత్రం ఐదునిమిషాల ముందు లీకైందని, ఐదు నిమిషాల ముందు లీకైతే నష్టమేం లేదని, అది లీక్‌ కాదు.. మాల్‌ప్రాక్టీస్‌ అని టిడిపి నాయకులు, కాదు.. కాదు.. అది ముమ్మాటికీ లీకే.. అవి నారాయణ, గంటా శ్రీనివాసరావుల వల్లే లీకయ్యాయని వైసీపీ నాయకులు అంటారు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు  ఎక్కువగా ఉన్నచోటనే ఆ ప్రశ్నాపత్రం ఎందుకు లీకైందని కొందరు అంటే... కేవలం సాక్షి విలేకరికే ముందుగా ఆ పేపర్‌ ఎలా తెలిసిందని మరికొందరు వాదిస్తారు. 

ఎవ్వరీనీ వదలని, తనను తాను చండశాసనుడినని చంద్రబాబు చెప్పుకుంటాడు. సాక్షి విలేకరిని కూడా విచారిస్తామంటారు. కాదు.. విలేకరులను వేదించ వద్దని కొందరు మీడియా ప్రతినిధులు గొడవ చేస్తారు? ఏం.. సాక్షి విలేకరి ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడిని ఎందుకు విచారించకూడదు? ఎవరి నుంచి, ఎలా తన వద్దకి ఆ పేపర్‌ ముందుగా వచ్చిందని ఆ జర్నలిస్ట్‌ను విచారిస్తే తప్పేంది? బడ్జెట్‌ విషయాలు లీకయ్యాయని స్వర్గీయ ఎన్టీఆర్‌ తన మంత్రి వర్గాన్ని మొత్తం రాజీనామా చేయించాడు. ముద్దుకృష్ణమ్మనాయుడు, బాలయోగిలు విద్యామంత్రులుగా ఉన్నప్పుడు ఇలాగే ప్రశ్నాపత్రాలు లీకయితే ఆ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. చంద్రబాబు.. నీతులు ఎదుటి వారికి చెప్పేందుకే కాదు.. నీకు నువ్వు సర్టిఫికేట్‌ ఇచ్చుకోవద్దు, నిజాయితీగా విచారణ చేయించు. వైసీపీ, జగన్‌ కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానాలి...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement