వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆ సానుభూతి జగన్‌కి బాగా కలిసొచ్చింది. రాత్రికి రాత్రి ఆయన పెద్ద నాయకుడై పోయాడు. వైఎస్ చేసిన కొన్ని మంచి పనుల వల్ల జగన్ అవినీతి చేశాడని ఆరోపణలు వస్తున్నా కూడా ప్రజలు ఆయన్ను బాగానే ఆదరించారు. కానీ జగన్ మాత్రం తన తండ్రిలా వ్యవహరించలేకపోతున్నాడు. రాజశేఖర్‌రెడ్డిలోని ప్లస్ పాయింట్స్ వదిలేసి మైనస్ పాయింట్స్ వైపు ఆసక్తి చూపుతున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్దల సలహాలను ఆచరించినా, ఆచరించకపోయినా వారు చెప్పేది బాగా ఆలకించేవారు. వారికి గౌరవం ఇచ్చేవాడు. ఎవరిలో ఏ ప్రతిభ ఉంటే దానిని క్యాష్ చేసుకునే వాడు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను రామోజీపై అస్త్రంగా వాడుకున్నాడు. కెవిపిని ఎంతో చేరదీశాడు. బొత్స నుంచి కొండా సురేఖ దంపతుల వరకు అందరినీ బాగా ఉపయోగించుకున్నాడు. అదే ఆయన విజయరహస్యం అయింది.
కానీ జగన్ మాత్రం సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదు. తనను నమ్మి వచ్చిన మైసూరారెడ్డి నుంచి తనకు మద్దతునిచ్చిన సబ్బం హరి దాకా ఎందరినో దూరం చేసుకున్నాడు. ఆదినారాయణరెడ్డి, జ్యోతుల నెహ్రూ నుంచి ఎందరినో కోల్పోయాడు. ఇది అనుభవరాహిత్యమని సరిపెట్టుకోలేం. ఇవే మైనస్ పాయింట్స్. భవిష్యత్తులో ఆయనకు తీవ్ర నష్టాన్ని కలుగజేయనున్నాయి. భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి.. ఇలా అందరి పట్ల ఆయన తీరు ఆక్షేపణీయం. తన పార్టీలోని కేడర్‌ను ఆయన తన బానిసలుగా చూస్తారని, ఎవ్వరికీ అసలు గౌరవ మర్యాదలు ఇవ్వడని ఇప్పటికే స్పష్టమైపోయింది.
పార్టీని వీడిన ఒకరిద్దరు ఈ విషయం చెప్పి ఉంటే పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోకపోయేవారు. కానీ అందరూ ఇదే మనోగతాన్ని వెలిబుచ్చడం బాధాకరం. ఇక జగన్ ఎక్కువగా బాగా మాట్లాడగలిగిన ఫైర్‌బ్రాండ్‌లనే నమ్ముతున్నాడు, కానీ తెరవెనుక వ్యూహాలు రచించేవారిని పోగొట్టుకుంటున్నాడు. ఎంతసేపటికి రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు వంటి వారికే పెద్దపీట వేస్తున్నాడు. ఇది రాబోయే రోజుల్లో ఆయనకు ఆత్మహత్యా సదృశ్యం కానుంది.




Loading..