Advertisementt

వీరిద్దరిలో విజయం ఎవరిదీ...?

Mon 27th Feb 2017 12:21 PM
vijay antony,yaman movie,sai dharam tej,winner movie  వీరిద్దరిలో విజయం ఎవరిదీ...?
వీరిద్దరిలో విజయం ఎవరిదీ...?
Advertisement
Ads by CJ

తాజాగా మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన 'విన్నర్‌', విజయ్‌ ఆంటోని చేసిన 'యమన్‌' చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ఈ చిత్రాలపై వచ్చిన రివ్యూలలో దాదాపు అందరూ 'విన్నర్‌' కంటే 'యమన్‌' కే ఎక్కువ రేటింగ్‌ ఇచ్చారు. ఇక 'తిక్క' వంటి డిజాస్టర్‌ తర్వాత సాయి కమర్షియల్‌ డైరెక్టర్‌ అయిన గోపీచంద్‌ మలినేనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, భారీగా చిత్రాన్ని నిర్మించగలిగిన నిర్మాతలకు పగ్గాలు అప్పగించాడు. ఇక రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, అనసూయ, 30ఇయర్స్‌ పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ వంటి వారితో పాటు తమన్‌కు చోటిచ్చి, సేఫ్‌ గేమ్‌ ఆడాలని భావించాడు. పెద్ద పెద్ద సీనియర్‌స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు మెగాహీరోలైన రామ్‌చరణ్‌, బన్నీ, వరుణ్‌తేజ్‌లతో పాటు జూనియర్‌ నుంచి అందరూ కొత్త కథలవైపు, విభిన్న చిత్రాల వైపు అడుగులు వేస్తుంటే సాయి మాత్రం రొటీన్‌కే రొటీన్‌ పుట్టించే కథను ఎంచుకున్నాడు. 

తండ్రి, కొడుకు సెంటిమెంట్‌, ఐదు పాటలు, ఆరు కామెడీ సీన్స్‌, యాక్షన్‌ వంటి పాత చింతకాయ పచ్చడి వంటి కథను నమ్ముకున్నాడు. ఈ చిత్రం కాన్సెప్ట్‌ చాలా పాతది. కేవలం బ్యాక్‌డ్రాప్‌గా గుర్రపు రేసులను తీసుకోవడం, రిచ్‌ మేకింగ్‌, సాయి రేసర్‌గా చేయడం కోసం కష్టపడిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ చిత్రానికి మాత్రం డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా వీకెండ్‌ కలెక్షన్లు ఫర్వాలేదనిపిస్తున్నాయి. ఇక విజయ్‌ ఆంటోని విషయానికి వస్తే విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్న ఆయన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. ఫుల్‌ బైండెడ్‌ స్క్రిప్ట్‌లను ఇచ్చినా, డైరెక్టర్‌తో పాటు రచయితలు ఎంతో ఇమేజినేషన్‌తో చిత్రాల కథలను వివరిస్తున్నా కూడా మన హీరోలలో ఎక్కువ మంది వాటిని విజువలైజ్‌ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. 

కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్‌, అందచందాలు, క్రేజ్‌ లేకపోయిన, కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన విజయ్‌ ఆంటోని 'నకిలీ, డాక్టర్‌ సలీం, బిచ్చగాడు, భేతాళుడు, యమన్‌' వంటి కథలను ఎంచుకోవడం చూస్తే ఆయన కృషిని, పట్టుదలను మెచ్చుకోవాల్సిందే. 'యమన్‌' చిత్రం 'బిచ్చగాడి'లా అన్ని వర్గాలను ఆకట్టుకునే కథ కాదు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం చూస్తుంటే 'ప్రస్ధానం' వంటి చిత్రాలు గుర్తుకు వచ్చినా తప్పులేదు. ఇక కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పెద్దగా ఆడుతుండకపోవచ్చు. కానీ తమిళనాడు రాజకీయాలు వేడిగా ఉన్న ఈ సమయంలో 'యమన్‌' విడుదల కావడం సమయోచితం. 

కానీ విజయ్‌ఆంటోనితోపాటు పలువురు తమిళ హీరోలు తమకు తెలుగులో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకొని, ఒకేసారి తమ చిత్రాలను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఆ సమయంలో ఆయా హీరోలు కేవలం తమిళ ఫ్లేవర్‌కు, తమిళనటులను ఎంచుకోవడమే కాదు.. రెండు భాషల్లో గుర్తింపు ఉన్న నటీనటులను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా లైకా, మిర్యాల రవీందర్‌రెడ్డి వంటివారు నిర్మించిన 'యమన్‌' చిత్రానికి నటీనటుల కోసం మరింత బడ్జెట్‌ పెట్టి ఉంటే ఈ చిత్రం ఫలితం తెలుగులో కూడా పెద్ద రేంజ్‌లో ఉండేది అనేది వాస్తవం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ