Advertisement

నీది ఏ కులం....నాది ఏ కులం...?

Tue 14th Feb 2017 12:34 PM
categories,jayaprakash narayana,kodanda ram,pawan kalyan  నీది ఏ కులం....నాది ఏ కులం...?
నీది ఏ కులం....నాది ఏ కులం...?
Advertisement

గ్లోబలైజేషన్‌, సాంకేతిక విప్లవాల కారణంగా ప్రపంచమే కుగ్రామంగా మారింది. పాతకాలంలో నిరక్షరాస్యత, సరైన విజ్ఞానం లేకపోవడం వల్ల కులాల కంపు మొదలైందని ఇంతవరకు చాలా మంది మేథావులు భావిస్తూ వస్తున్నారు. కానీ వారి లెక్కలు తప్పని నేటితరాన్ని చూస్తే అర్ధమవుతోంది. ఇప్పుడు విజ్ఞానవంతులుగా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఇంకా ఎక్కువ కులపిచ్చి ఉండటం చూస్తే ఆవేదన కలగకమానదు. సోషల్‌మీడియాకు కూడా కులాల రంగు పులుముతూ, ఎవరి కులం వారు వారినే సపోర్ట్‌ చేస్తున్నారు. ఎవరి కులం అంటే వారికి అభిమానం, గౌరవం ఉండవచ్చు. కానీ పక్కకులం వారిపై ద్వేషం మాత్రం మంచిది కాదు. నాటితరంలో కులాల పోరును అపేందుకు ఎందరో శ్రమించారు. 

కానీ ఇప్పుడున్న మేథావులను కూడా కులం రంగుతో చూస్తున్నారు. జయప్రకాష్‌ నారాయణ్‌ అంటే కమ్మ అని, కోదండరాం అంటే రెడ్డి అని, పవన్‌కళ్యాణ్‌ అంటే కాపు అని ఇలా చూడటం బాధాకరం. మరి ఆ విషయంలో తమకు కులం రంగు అద్దడంపై ఆ మేథావులు పడుతున్న బాధను మనం అర్ధం చేసుకోలేకపోతున్నాం. కులరహిత సమాజాన్ని తయారు చేయడానికి... సమాజాన్నీ  ఎదిరించి, స్వంత కులం వారి నుంచి ఎదురైన అవమానాలను, బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ప్రాణాలు, ఆస్తులు, పేరు చివరన ఉన్న కులం తోకలను కూడా వదిలేశారు. శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి , ఆరుద్ర.. ఇలా ఎందరో విప్లవభావాలతో పాటలు, కవితలు వంటివి రాశారు. ఇక స్వర్గీయ మహానుభావుడు... ప్రముఖ పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తిని ఓ విలేఖరి అలాంటి అద్భుతమైన పాటలు, కవితలు మీరెందురు రాయలేకపోయారు? అని ప్రశ్నిస్తే... ఆయన ఓ నవ్వు నవ్వి.. ఎవరు చెప్పారు? నేను అలాంటి పాటలు రాయలేదని? అని ఎదురు ప్రశ్నించి, తాను విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సప్తపది' చిత్రంలోని రాసిన ఓ పాటను వినిపించారు. 

'ఏ కులమూ నీదంటే.. గో'కులము' నవ్వింది... మాధవుడు, మానవుడు నాకులేలెమ్మంది...'అనే గీతాన్ని ఆలపించారు. ఇక్కడ ఆయన చెప్పిన ఆ పాటలోని సారాంశం ఏమిటంటే.. ఏ కులమూ నీదని అడిగితే 'గోకులము' నవ్వింది... అని ఆయన రాశారు. 'గోకులం' అంటే కృష్ణుని ఊరు మాత్రమే కాదు... 'గో' అంటే ఆవు (పశువు) కులం నవ్వింది. అంటే కులం అడిగితే పశుకులం కూడా నవ్వి, మాధవుడు (దేవుడు) , మానవుడు (మనిషి) కూడా నా కులమే అనిచెప్పింది.. అని అర్ధంగా వివరించారు. మరి ఆయన చెప్పిన మాట వాస్తవం కాదా? మన కులాల గోలను చూసి పశువుల కంటే హీనంగా, కులాలను హైజాక్‌ చేసే కొందరు కులనాయకుల చేతిలో మనం కీలుబొమ్మలం కావడం బాధాకరం కాదా? కనీసం మనం ఆపాటి విషయాన్ని కూడా గ్రహించలేమా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement