బయోపిక్ లు: తారల తెర (నిజ) జీవితాలు

Fri 10th Feb 2017 01:18 PM
sr ntr bio pic,krishna bio pic,anr bio pic,mahanati savitri,kantharao,silk smitha,balakrishna,politics  బయోపిక్ లు:  తారల తెర (నిజ) జీవితాలు
బయోపిక్ లు: తారల తెర (నిజ) జీవితాలు

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ఆయన వారసుడు బాలకృష్ణ ప్రకటించడం ఆహ్వానించదగిందే. అయితే దీనికి రాజకీయ రంగు పులుముకుంది. నిజానికి వివాదం లేపింది మీడియా. లక్ష్మీపార్వతిని కెలికింది. దాంతో ఆమె విమర్శలు చేసింది. ఒక మహానటుడి జీవితాన్ని తెరకెక్కిస్తుంటే ఆహ్వానించాల్సిన మీడియా రచ్చ చేసింది. బాలకృష్ణ కేవలం ప్రకటన చేశారు. ఆయన తీస్తారో లేదో స్పష్టంగా తెలియదు. కేవలం నట జీవితాన్ని,ఆ తర్వాత రాజకీయ జీవితాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తారనే దానిపై కసరత్తు జరగలేదు. ఇందులో విలన్ ఎవరూ? హీరో ఎవరనేది అప్రస్తుతం.

హిందీలో అనేక బయోపిక్ లు వస్తున్నాయి. ఇటీవలే నటుడు సంజయ్ దత్ జీవితంపై బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  సంజయ్ దత్ వ్యక్తిగత జీవితం వివాదస్పదమైంది. ఆయన జైలుకు కూడా వెళ్ళివచ్చారు. కాబట్టి సినిమాటిక్ గా చూపించడానికి ఈ అంశాలుచాలు. అందుకే తెరరూపం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నాట్య తార సిల్క్ స్మిత బయోపిక్ ను దక్షిణాది వాళ్ళు తీయలేకపోయారు. కానీ హిందీలో 'డర్డీ పిక్చర్' పేరుతో వచ్చి విజయం సాధించింది. మహానటి సావిత్రి జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నయి. 

తమిళనాడు సినీ, రాజకీయ నేతలు ఎమ్టీఆర్, కరుణానిధి, జయలలిత  పాత్రల ప్రేరణతో మణిరత్నం 'ఇద్దరు' సినిమా తీశారు. 

టాలీవుడ్ లో మనకు కూడా అనేక మంది నటులు ఉన్నారు.  గతంలో 'శివరంజనీ' పేరుతో దాసరి నారాయణరావు ఒక సినిమా చేశారు. అది ప్రత్యేకించి ఒక నటి గురించి కానప్పటికీ, సహజంగా కొందరు తారలకు ఎదురైన అనుభవాలను తీసి విజయం సాధించారు. కె.విశ్వనాథ్ 'సీతామాలక్ష్మీ' పేరుతో తీసిన సినిమా కూడా ఒక నటి జీవితానికి సంబంధించిందే. కృష్ణ నటించిన 'డాక్టర్ -  సినీ యాక్టర్' సినిమాలో ఒక సామాన్యుడు హీరోగా మారడం, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను చూపించారు.  ఇంకా రాంగోపాల్ వర్మ 'రంగీల' కూడా సినిమా నేపథ్యంలో తీసిందే. పూరి జగన్నాథ్ 'నేనింతే ' సినిమాలో టాలీవుడ్ పరిస్థితులను ఆవిష్కరించారు. ఇది కూడా కొందరి సినీ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇవేమీ బయోపిక్ లు కాదు. 

కానీ తెలుగులో కూడా బయోపిక్ లు తీయగలిగే నటుల జీవితాలున్నాయి. స్టార్ గా ఎదిగి చితికిపోయిన నాగయ్య, కాంతారావు జీవితాలు ఇందుకు ఉదాహారణ. ఇక అతి సామాన్యుడు నటసమ్రాట్ గా ఎలా ఎదిగాడనేది అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఉదాహారణ. కేవలం సినిమా నటుల ప్రేరణతో హీరో అయిన కృష్ణ జీవితం కూడా బయోపిక్ చేయవచ్చు. పైగా ఆయన వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరిగింది.సహాయ నటుడి పాత్రల నుండి హీరోగా ఎదిగిన శోభన్ బాబు క్రమశిక్షణ కలిగిన జీవితం. ఈతరం వారికి కస్తూరి శివరావు తెలియకపోవచ్చు. కమేడియన్ గా రాయిస్ కార్లో తిరిగి, స్వయం కృపరాదం వల్ల సైకిల్ స్థాయికి చేరుకుని అనాధగా మరణించాడు. అలాగే వ్యసనాలకు బానిసై కెరీర్ పాడు చేసుకున్న రాజబాబు జీవితం. నమ్మిన వారే మోసం చేయడంతో దీనావస్థకు చేరుకుని దిక్కులేనిదానిలా తుదిశ్వాస విడిచిన మహానటి నటి సావిత్రి జీవితంకూడా సినిమాగా తీయగలిగిందే. 

సినీతారల బయోపిక్ తీయాలంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబసంబంధికులు అడ్డుపడతారు.  తారలకు కూడా వ్యక్తి గత జీవితం ఉంటుంది కాబట్టి అందులోని వివాదస్పద అంశాలు బయటకు వస్తాయి.