దూసుకెళ్తోన్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌..!

Mon 19th Dec 2016 05:31 PM
prakash raju,rao ramesh,pawan kalyan movie katamarayudu,and nanna nenu naa buyfriends movie father charector rao ramesh,new movie dj  దూసుకెళ్తోన్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌..!
దూసుకెళ్తోన్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌..!
Advertisement

ప్రకాష్‌రాజ్‌... ఈయన ఎంతో గొప్పనటుడు అనడంలో సందేహం లేదు. కానీ ఆయన దర్శకనిర్మాతలను పలు ఇబ్బందులు పెడుతాడనే విమర్శ కూడా ఉంది. ఇక ఆయన కేవలం బడా నిర్మాతల చిత్రాలలోనే ఎక్కువగా నటిస్తుంటాడు. దాని కోసం భారీగా రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తూ ఉంటాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా చివరకు నాన్న, తాత్తయ్యల పాత్రలకు కూడా జీవం పోస్తుంటాడు. కానీ ఆయన ఈమధ్య నిర్మాతగా, దర్శకునిగా, తానే ప్రధానపాత్రలు పోషిస్తూ బిజీ అయిపోయాడు. దాంతో ఆయన చిన్న నిర్మాతలకు అందుబాటులో లేడనేది వాస్తవం. 

అయితే ఇప్పటికి ఆయనకు ధీటైన మరో నటుడు తన హవా సాగిస్తూ, చిన్న, పెద్ద తేడా లేకుండా పాత్ర బాగుంటే విలన్‌గానైనా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానైనా చేస్తూ, తన నటనతో ప్రకాష్‌రాజ్‌ స్థానానికి ఎసరు పెడుతున్నాడు. ఆయనే విలక్షణ నటుడు రావు రమేష్‌. అన్నితరహా పాత్రలు చేసి, నిన్నమొన్నటి తరంలో విలక్షణ నటునిగా, మరీ ముఖ్యంగా తన డైలాగ్‌ డిక్షన్‌తో అందరి అభిమానాన్ని చూరగొన్న స్వర్గీయ రావుగోపాలరావు తనయుడయినప్పటికీ... తన తండ్రికి ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి, ఖ్యాతిని ఉపయోగించుకోకుండా తెరంగేట్రం చేసిన ఆర్టిస్ట్‌ రావు రమేష్‌. కేవలం ఇంటిపేరైనా 'రావు'ని మాత్రమే వారసత్వంగా పొందిన ఈయన సినిమా సినిమాకు తన నటనతో జేజేలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. 

నెగటివ్‌ రోల్స్‌తో పాటు తండ్రి పాత్రలు కూడా చేస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయన అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులను, దర్శకనిర్మాతలను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా విడుదలైన 'నాన్న, నేను, నా బోయ్‌ఫ్రెండ్స్‌' చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన ఆయన ఆ పాత్రలో జీవించి, ఆ చిత్రాన్ని ఒంటి చేత్తో నడిపించాడు. కాగా ప్రస్తుతం ఆయన పలు చిత్రాలలో విభిన్నమైన క్యారెక్టర్‌ చేస్తున్నాడు. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంలో రాయలసీమకు చెందిన ఓ నెగటివ్‌ పాత్రను, దిల్‌ రాజు నిర్మాతగా బన్నీ హీరోగా తెరకెక్కుతోన్న 'డిజె' చిత్రంలో కూడా సరికొత్తగా ఉండే నెగటివ్‌ పాత్రలో చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మొత్తానికి కోట తర్వాత ఆ స్థాయి తెలుగు నటునిగా, ఆల్‌రౌండర్‌గా ఆయన తన దూకుడు చూపిస్తూ, సినిమా సినిమాకు నటునిగా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడనే చెప్పాలి. 


Loading..
Loading..
Loading..
advertisement