Advertisement

చిరుకు వారిపై ఉన్న నమ్మకమేంటి....?

Sat 12th Nov 2016 07:43 PM
chiranjeevi,paruchuri brothers,khaidi no 150  చిరుకు వారిపై ఉన్న నమ్మకమేంటి....?
చిరుకు వారిపై ఉన్న నమ్మకమేంటి....?
Advertisement

టాలీవుడ్‌లో రచయితలు పరుచూరి బ్రదర్స్‌కు గొప్ప పేరుంది. అది మంచిగా కావచ్చు.. లేదా చెడ్డగా కావచ్చు. అది ఎవరి మనస్తత్వాలను బట్టి వారు నిర్ణయించుకుంటారు. ఇక తెలుగులో సీనియర్‌ స్టార్‌ హీరోలకు పరుచూరి బ్రదర్స్‌ అంటే నమ్మకం ఎక్కువ. దానికి పరుచూరి బ్రదర్స్‌లో ఉన్న లౌక్యం కూడా ఓ కారణం కావచ్చు. ఇండస్ట్రీలోని సీనియర్‌ స్టార్స్‌ అందరి చిత్రాలకు, అందునా ఒక చిత్రానికి పోటీగా మరో చిత్రం విడుదలయ్యే సమయంలో కూడా వారు ప్రతి హీరో ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి ఆయా హీరోల అభిమానులను తమ మాటలతో హిప్నటైజ్‌ చేసేవారు. ఏ హీరో చిత్రంలో ఆ హీరోకు అనుగుణంగా, వారిని ఆకాశానికి ఎత్తుతూ, ఆయా చిత్రాలలో ఇతర హీరోలపై దురభిప్రాయం కలిగించి, హీరోల అభిమానులను రెచ్చగొట్టే విధంగా, వారి మధ్య ద్వేషాలు రగిల్చేలా డైలాగులు రాస్తూ, వాటిలో మచ్చుకు ఒకటి రెండు డైలాగ్స్‌ను ఆడియో వేడుకలో తమ ప్రసంగం సందర్భంగా వినిపించి, అటు హీరోలను, ఇటు దర్శకులను, నిర్మాతలను, అభిమానులను రెచ్చగొట్టి యూనిట్‌ను , ఫ్యాన్స్‌ను కాకా పట్టేవారు. ఈ డైలాగ్‌లు అభిమానుల మద్య ద్వేషాన్ని రగిలించి కొట్టుకునే స్తాయికి డైలాగ్‌లను దిగజార్చారు. ఎక్కడలేని పోలికలు పెడుతూ, వంశాలను, తాతలను, తండ్రులను ఆకాశానికి ఎత్తేలా డైలాగులు రాయడం. వారి పోటీ హీరో చిత్రంలో ఇదే రచయితలు దానికి ఎదురు పంచ్‌లు రాస్తూ పెన్నుతో సాము చేసేవారు. ఇక ఒకే సందర్భంగా ఇద్దరు ముగ్గురు హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలయ్యే పోటీ ఏర్పడినా కూడా ఏ హీరో ఆడియో ఫంక్షన్‌లో ఆ హీరో చిత్రం చరిత్ర సృష్టిస్తుందంటూ పోటీలు పడి ప్రసంగించేవారు. ఇదంతా చాలా కాలం అద్భుతంగా పనిచేసింది. ఈ జంట రచయితలలో ఉన్న మరో వెన్నతో పెట్టిన విద్య ఏమిటంటే... ఓ చిత్రాన్ని ఫ్రీమేక్‌ చేయాలన్నా, అందులోని ఓకే ఒక్క మంచి సీన్‌ను ఆధారంగా చేసుకొని ఓ హీరోకు స్టోరీ అల్లేయాలన్నా... పరభాషల్లో ఫ్లాప్‌ అయిన చిత్రాలను కూడా నేటివిటీ మార్చి బ్లాక్‌బస్టర్‌ కథను రెడీ చేయాలన్నా వీరి తర్వాతే ఎవరైనా, అందుకే ఈ కాపీ రాయుళ్లకు అంత క్రేజ్‌. వాస్తవానికి ఓ పరభాషా చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలు, హీరోలు కూడా గుర్తుపట్టలేనంతగా ఓ చిత్రానికి మార్పులు చేర్పులు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో ఈ జంట కవులు పిహెచ్‌డి పట్టాలు పుచ్చుకున్నారు. కాపీ రాయుళ్లుగా వీరు చేయని 'కథాచౌర్యం' లేదని చెప్పవచ్చు. ఈ విషయంలో వారికి వీరాభిమానులై వారి దారిలో నడిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. ఇక విషయానికి వస్తే చిరంజీవి వినాయక్‌ దర్శకత్వంలో తమిళ 'కత్తి' చిత్రానికి రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటగా సంప్రదించినది ఈ రచయితలనే. దీనికి వినాయక్‌ ఒత్తిడి కూడా ఓ కారణమే. విప్లవాత్మక, సమస్యాత్మక చిత్రాల కథా వస్తువులను ఎంచుకొని వాటిని ఎలాగైనా హిట్‌ చేయడంలో వీరిద్దరు సుప్రసిద్దులు కావడంతో చిరుకు, వినాయక్‌కు వెంటనే వారు గుర్తుకు వచ్చారు.అయితే కాలానుగుణంగా ప్రేక్షకుల్లో వస్తున్న మార్పులు, అభిరుచుల విషయంలో అప్‌డేట్‌గా ఉండే చిరు మరింత ముదురన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో 'కత్తి'ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్న వెంటనే ఆయన పరుచూరి బ్రదర్స్‌ను సంప్రదించాడు. వారు ఒరిజినల్‌ సోల్‌ మిస్‌ కాకుండా అచ్చమైన తెలుగు చిత్రంగా, అందునా కామెడీ కోసమే చిత్రాలు చూసే ప్రేక్షకులను, తన కామెడీ టైమింగ్‌ను చూపించి సినిమాను రక్తి కట్టించడంలో చిరుకు ఉన్న సత్తాను మరోసారి చూపించాలని తలచారు. దాంతో రైతుల సమస్యలు ప్రధానాంశంగా తమిళంలో వచ్చిన'కత్తి'కి మూల కథ మార్పులు, చేర్పులు, తమిళంలో లాగా సినిమా మొత్తం సీరియస్‌గా నడవకుండా, అలాగే కావాలని కామెడీని ఇరికించారనే భావన ప్రేక్షకుల్లో రాకుండా చేసే విషయంలో ఎక్కడెక్కడ ఏమి మార్పులు, చేర్పులు చేయాలనే బాధ్యతను చిరు పరుచూరి బ్రదర్స్‌కు అప్పగించాడు. ఆ తర్వాత మాత్రం వినాయక్‌కు నచ్చిన పరుచూరి ఏకలవ్య శిష్యుడు ఆకుల శివతో ఓ వెర్షన్‌ డైలాగ్స్‌ రాయించాడు. ఇక దర్శకుడు క్రిష్‌తో అఫీషియల్‌గా, తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సాయిమాదవ్‌ బుర్రాతో సినిమాలోని సందేశాత్మక డైలాగులను రాయించాడు. ఇక అసలే కొత్త హాస్య రచయితలు తగ్గిపోతూ, కేవలం కొన్ని చిత్రాలకు ఘోస్ట్‌లుగా ఉంటూ సినిమాలలో హాస్యం పండేలా వండి వారుస్తున్న వారి కోసం అన్వేషణ మొదలుపెటారు, సుకుమార్‌ వద్ద శిష్యరికం చేస్తూ, ఇటీవల 'మాకు మేమే... మీకు మీరే' అనే చిత్రంతో దర్శకునిగా పరిచయమైన హుస్సేన్‌ షా కిరణ్‌కు చిత్రంలోని కామెడీ సన్నివేశాలకు రూపం ఇచ్చే బాధ్యత అప్పగించారు చిరు, వినాయక్‌లు. చిరంజీవి బాడీలాంగ్వేజ్‌కు తగ్గ సిట్యూయేషన్‌ కామెడీ పంచ్‌లతో పాటు చిరు, సునీల్‌, అలీ, బ్రహ్మానందం, మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలను క్రియేట్‌ చేయించి పంచ్‌ డైలాగులను ఆయన చేత రాయిస్తురన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై అఫీఫియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేని కారణంగా చాలా మందిలో సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రంలోని కామెడీ పోర్షన్‌ని తానే హ్యాండిల్‌ చేస్తున్నట్లు తన సన్నిహితులైన కొందరు మీడియా ప్రతినిధులతో హుస్సేన్‌ షా కిరణ్‌ అనడంతో ఈ విషయం ఖరారైంది. తనలాంటి చరిష్మా ఉన్న చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం తమిళ 'కత్తి'కి రీమేక్‌ కావడం, ఎందరో రచయితలు పోటీపడి చిరంజీవి చిత్రానికి తమ వద్ద అద్భుతమైన కథలున్నాయని చెప్పినా, వారిని నమ్మకుండా పరుచూరి బ్రదర్స్‌ సహకారంతో రీమేక్‌ చిత్రం చేయడం చాలా మంది బాషాభిమానులకు ఎంతగానో బాధగా ఉంది. కనీసం ఇప్పటికే తనను తాను ప్రూవ్‌ చేసుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ వంటి వారికి కూడా నో వేకెన్సీ బోర్డ్‌లు పెట్టి భావదారిద్య్రాన్ని ప్రోత్సహిస్తున్న చిరుపై చాలామంది గుర్రుగా ఉన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement