Advertisement

జోష్ స్పెషల్ : ఓం విఘ్నేశ్వరాయనమః

Mon 05th Sep 2016 09:00 PM
josh special,vinayaka chavithi,story,special,ganesh chaturthi,lord ganesha  జోష్ స్పెషల్ : ఓం విఘ్నేశ్వరాయనమః
జోష్ స్పెషల్ : ఓం విఘ్నేశ్వరాయనమః
Advertisement

  ఓం విఘ్నేశ్వరాయనమః

 'తొండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్

  మెండుగ మ్రోయు గజ్జెలున్ మెల్లని చూపుల  మందహాసమున్

   కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

 యుండెడి పార్వతీతనయ  యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్'  అంటూ దేశమంతా భక్తిశ్రద్దలతో వినాయకుణ్ణి పూజించుకునే రోజు వినాయక చవితి. ఈరోజు ఎంతో సుభకరమైన స్వామివారి జన్మదినం.  మగళకారకుడైన గణపతి పూజ అనేది  పెద్దపండుగలలో ముఖ్యమైంది. చాలా నియమ నిష్టలతో జన్మదినమైన వినాయక చవితినాడు స్వామి వారి వ్రతం చేసుకుంటారు. స్వామిని పూలూ, పత్రితో పూజించి  ఇష్తమైన ఉండ్రాళ్ళు మొదలైన వాటితో మహానైవేద్యం సమర్పించి చల్లగా చూడమని, తమ కోరికలు నేరవేర్చమని వేడుకుంటారు. విద్యార్థులంతా తమ పుస్తకాలను స్వామిదగ్గర పెట్టి  గుంజిళ్ళు తీస్తారు. చదువు బాగారావాలని మొక్కుకుంటారు.

వినాయకుని జన్మవృత్తాంతం: మహాశివుని భార్య అయిన  పార్వతీదేవి మానస పుత్రుడు వినాయకుడు. ఒకసారి శివుడు ఇంట్లోలేని సమయంలో పార్వతి  ఒక పిండిబొమ్మను చేసి  దానికి తన శక్తితో  ప్రాణంపోసి కుమారుడిని పొందుతుంది. ఆమె స్నానానికి వెళుతూ  ఇంటిముందు అతన్ని  కాపలా  ఉంచుతుంది.  శివుడు వచ్చి  లోనికి ప్రవేశించడానికి సన్నద్ధం  అవుతాడు. కానీ తల్లి ఆజ్ఞకు బద్దుడైన   వినాయకుడు  శివున్ని లోనికి వెళ్ళకుండా  అడ్డగిస్తాడు.  తాను పరమేశ్వరుడిని అని చెప్పినా కూడా  వినాయకుడు లోనికి అనుమతించడు. వెంటనే  కోపోద్రిక్తుడైన పరమశివుడు తన  త్రిశూలంతో  వినాయకుడి శిరస్సు ఖండిస్తాడు. అతడు అమ్మా అని పిలుస్తూ  నేల వాలతాడు  ఆ పిలుపు విన్న పార్వతి బయటకు వచ్చి  చూసేటప్పటికి శిరస్సు లేని  మొండెంతో కనిపిస్తాడు వినాయకుడు.  తట్టుకోలేనిదైన ఆ తల్లి మిక్కిలి దుఃఖిస్తూ  ఉంటుంది. శివుడు పార్వతిదేవిని  ఓదార్చడానికి అతన్ని బ్రతికించాలని నిర్ణయిస్తాడు. కానీ అప్పటికే తల లేదు కనుక గజాసురుడు అనే శివభక్తుడైన ఏనుగు   తలను తీసుకువచ్చి అతికిస్తాడు.  అసలు తల మార్పిడి చికిత్స జరిగిన మొదటి వ్యక్తి వినాయకుడే. ఆనాడే ఈ విజ్ఞానం ఉంది అని మనం తెలుసుకోవచ్చు. మానవ శరీరం, ఏనుగు తలతో ఉన్న వినాయకుడిని చూస్తే సకల శుభాలు కలుగుతాయని శివుడు వరం ఇస్తాడు. అంతేకాక  గణాలకు అధిపతిని చేస్తాడు. దాంతో గణపతి అనే పేరు కూడా వస్తుంది. ఎవరైనా  ఏ పూజకైన సరే తొలుత  గణపతినే పూజించాలి. అలా అయితేనే వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. కనుక ఆదిపూజ  అందుకునే దైవం అయ్యాడు.

ప్రత్యేకరూపం గణపతి: వినాయకుని రూపం ఆకట్టుకునే రూపం  వెడల్పైన చెవులు, పొడవాటి తొండం  ఏకదంతం, బొజ్జ దాని చుట్టూ పాములపట్టి  ఇలా చూడగానే ముచ్చట గొలిపే రూపం. అందుకే పిల్లలకు చాలా ఇష్తమైన రూపం వినాయకుడు. ఇప్పుడు ఇంకా వినాయకుణ్ణి తయారు చేసే సంస్థలు విభిన్న కళాకృతిలో  వినాయకుడి ప్రతిమను తయారు చేసి వినాయకుడికి మంచి గుర్తింపు ఇస్తున్నాయి. ఇంకా సినిమాల ప్రభావం, ఆటల ప్రభావం వలన వినాయకుడి ప్రతిమను బాహుబలిలా, క్రికెట్టు క్రీడాకారుడిగా ఇలా ప్రసిద్ధి వహించిన వ్యక్తులను పోలిన ప్రతిమలా తయారు చేస్తున్నారు. కానీ నిజానికి వినాయకునికి ఇలాంటి రూపాలు ఆపాదించడం పూర్తిగా వ్యాపార సంస్కృతి, మరియు అజ్ఞానమే తప్ప అది సరైన విధానం కాదు.

నవరాత్రుల సందడి: నవరాత్రులపాటు ఒక ఆహ్లాదకరమైన సాముహిక  వాతావరణాన్ని వినాయకుడు కల్పిస్తాడు. అందరూ మండపాల దగ్గర పూజలతో, అటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, భజనలతో, సామూహిక భోజనాలతో చాలా సరదాగా భజనలతో గడుపుతూ ఉంటారు. కనుక పిల్లలకు, పెద్దలకు  వినాయక చవితి ఇచ్చినంత అనందం  నిజంగా మరే పండగ ఇవ్వదు. తొమ్మిది రొజులపాటు వినాయకుడి ప్రతిమను నిలబెట్టి నవరాత్రుల సంభరాలు జరుపుతారు. నిమజ్జనానికి కూడా కోలాహలంగా  తీసుకువెళతారు. 

అసలు స్వతంత్ర్య పోరాటంలో  దేశనాయకులు ఒకచోట కలుసుకొని  రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ నవరాత్రుల సంస్కృతి బాగా వ్యాప్తం అయింది. అప్పటి నుంచి స్వతంత్ర్యం వచ్చినా కూడా ఈ పూజావిధానాలు ప్రజల్లో బాగా ఇమిడి పోవడం ద్వారా ఇప్పటికీ నవరాత్రులు బ్రహ్మండంగా  నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మండపాల  ప్రత్యేకత.

మండపాల అలంకరణలు: దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణపతి మండపాలు నిర్మించడంలో  ఒక్కొక్కరు ఒక్కో రకం ప్రత్యేకతలను కనబరుస్తారు. పట్టుదలతో  విభిన్నంగా  అలంకరించడానికి ఉత్సాహం చూపుతారు. కొన్నిచోట్ల వినాయకుని ప్రతిమ ఎత్తుగా ఉండటం, మరోచోట మండపంలో జలపార్తలు ఏర్పాటు చేయడం మరోచోట వినాయకుడు తోమంతో ఆశీర్వదించేలా ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేక అలంకరణలు మండపాలలో కనిపిస్తాయి.  కానీ మరో విషయం ఏమంటే  ఈ మండపాలు కొన్నిచోట్ల ప్రధాన రహదారులపైకి వచ్చి  స్థలాన్ని ఇబ్బందికరం చేస్తున్నాయి అనేది కూడా వాస్తవమే.

మట్టి వినాయకుడే మంచిది: పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి వినాయకులను తయారు చేసుకొని పూజించాలనే  దృష్టి ఈ మధ్య బాగా పెరిగింది. పూర్వం కాలంలో ఇలాగే ఇండ్లలోనే ఎవరికి వారు  మట్టితో వినాయకుణ్ణి తాయారు చేసుకొని పూజించేవారు.  మట్టితో ఎలుకలు, ఎడ్లు కూడా తాయారు చేసి  దేవుడిముందు ఉంచేవారు. తర్వాత పెద్ద వినాయకుడి ప్రతిమలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో అందమైన రంగులతో తయారు చేసినవి కొనుక్కొని పూజించుకోవడం అలవాటయింది.  ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ దృక్పథం మారుతుంది. ప్రజలంతా ఎక్కువగా మట్టితో తయారు చేసిన ప్రతిమలనే వినియోగిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం.  దీనివల్ల పర్యావరణం కలుషితం కాకుండా ఉటుంది.  మరికొన్ని చోట్ల పేపర్ తో,  థర్మ కోల్ తో తయారు చేస్తారు. అన్ని విఘ్నాలను పోగొట్టి సకల శుభాలను కలిగించే ఘనదైవం  వినాయకుడు. కాబట్టి అతన్ని  సరైన పద్ధతిలో పూజించి తరించాలి.  నిర్విఘ్నం కురుమే దేవం సర్వకాలేషు సర్వధా...!!   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement