Advertisement

ఆ రాతలు నాపై దాడి చేసినట్లే! : VN ఆదిత్య

Wed 22nd Jun 2016 09:52 PM
vn aditya,director vn aditya letter,vn aditya letter on media,vn aditya movies  ఆ రాతలు నాపై దాడి చేసినట్లే! : VN ఆదిత్య
ఆ రాతలు నాపై దాడి చేసినట్లే! : VN ఆదిత్య
Advertisement

మీడియా అన్నా. మీడియా ప్రతినిధులన్నా నాకు గౌరవం. మా బంధువులు, ఆత్మీయులు ఎంతోమంది మీడియాలో ఉన్నందువల్ల, నేను సినీ దర్శకుడు కావడం వల్ల ఎంతోమంది మీడియా ప్రతినిధులు నాకు మిత్రులయ్యారు. నా స్థాయిలో నేను మీడియావారు ఎప్పుడు కోరినా సహాయం చేయడానికి ముందుండేవాడిని. కాని, అలాంటి మీడియాలో కొందరు చీడపురుగులు ఇప్పుడు పనిగట్టుకుని నా మీద అవాకులూ, చెవాకులూ రాస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను.

కెరీర్ లో విజయాలు, వైఫల్యాలకు ఎవ్వరూ అతీతం కాదు. నా కెరీర్ లోనూ వెలుగు చీకట్లున్నాయి. ఈ మధ్యకాలంలో నేను సినిమా చేయడం లేదు. అవకాశమో, అవసరమో లేక కాదు. అందుకు నేను ప్రయత్నించకపోవడం వల్లనే ఈ గ్యాప్. ఇది నేను నా అంతగా నేను కోరుకున్న గ్యాప్. అలాగని, నేను ఇండస్ట్రీకి దూరంగా లేను. అమెరికాలో తెలుగు సినిమాల నిర్మాణానికి కొందరు మిత్రులతో కలిసి నేను చేస్తున్న ప్రయత్నాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులందరికీ దాదాపు తెలుసు. నా ప్రయత్నం తాలూకు ఫలాలు త్వరలోనే తెలుగు సినీపరిశ్రమకు అందుతాయి. ఒక సరైన వేదిక ద్వారా, సమర్థులైన వ్యక్తుల ద్వారా మీడియాకి వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అమెరికాలో గత కొద్ది నెలలుగా నేను చేస్తున్న కృషి – సినిమా తీయడం కన్నా గొప్పది. దేశం కాని దేశంలో తెలుగు సినిమా నిర్మాణానికి అవసరమైన సదుపాయాల కల్పనకు నా వంతు సహకారం నేను అందిస్తున్నాను. ఇందుకోసమే నేను కొద్దినెలలుగా అమెరికాలో ఉంటున్నాను.

అయితే, కొందరు మీడియాలో చీడపురుగులు – నా మీద ‘కవర్’ స్టోరీలు రాస్తున్నారు. నేను అవకాశాలు లేక అమెరికా పారిపోయాననీ, భార్యాబిడ్డల్ని వదిలేశాననీ...

బాధ్యత గల పాత్రికేయ వృత్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిజమైన జర్నలిస్టులతో నాకున్న అనుబంధం నా సినీప్రయాణం మొదలుకానప్పటి నుంచి ఉంది. ఒక వార్త రాసేముందు – అందులోనూ ఒక అభియోగం మోపే ముందు – సదరు వ్యక్తి వివరణ కోరాలన్నది పాత్రికేయ నీతి. ఆ మర్యాద తెలియని ‘కవర్’ స్టోరీ రిపోర్టర్లు కొందరు ఇష్టానుసారం అభియోగాలు రాశారు. అందులో ‘నిజాలు’ చూసి నేను నివ్వెరపోయాను. నా కుటుంబం కలత చెందింది.

నేను పారిపోయానని రాశారు. తప్పు. నేను ప్రోపర్ వీసా మీద అమెరికా వచ్చాను.

నేను భార్యాబిడ్డల్ని వదిలేశానని రాశారు. తప్పు. నేను నా వాళ్లందరితోనూ రోజూ, ఉదయాస్తమానాల్లో టచ్ లో ఉన్నాను.

నేను అవకాశాల్లేక స్ట్రగుల్ అవుతున్నానని రాశారు. తప్పు. నేను ఇక్కడ సినీపరిశ్రమకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాను. వాటి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

కానీ ‘కవర్’ స్టోరీల రాతగాళ్ల వల్ల నాకు ఒరిగేదీ, పోయేదీ ఏదీ లేదు. వాళ్ల ఏడుపు చూసి నవ్వుకుంటాను. కానీ, అలాంటి చెత్త రాతలు చదివి బంధుమిత్రులు, ఆత్మీయులు కలత చెందినప్పుడు... అనిపిస్తుంది. ఇలాంటి రాతగాళ్లకు ఇలాంటి చెత్తరాతలు రాసేప్పుడు తమ కుటుంబాలు గుర్తు రావా అని. అలాగని, వివరణ ఇవ్వకుండా వదిలేస్తే.. ఈ అబద్ధపు ప్రచారాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని ఈ వివరణ ఇస్తున్నాను.

ఈ రాతలు పూర్తిగా నా వ్యక్తిగతం మీద దాడిగా నేను భావిస్తున్నాను. ఇందుకు బాధ్యులైన అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇలాంటి చెత్త వార్తల్ని రాసే చీడపురుగులున్నా, వాటిని పబ్లిష్ చేసే ముందు మీడియా యాజమాన్యాలు కొంత విజ్ఞత చూపించాలని మాత్రమే కోరుతున్నాను.

భవదీయుడు

వి. ఎన్. ఆదిత్య

సినీ దర్శకుడు – నిర్మాత – రచయిత

సియాటెల్, అమెరికా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement