సినిమా అంటే వినోదం. ఆ వినోదం కోసం థియేటర్స్‌కి వెళ్ళే ప్రేక్షకులకు కంటికి ఇంపుగా వుండే హీరో, హీరోయిన్లు సినిమాలో వుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఒకప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్లను విపరీతంగా ఆరాధించేవారంటే వారి అందం కావచ్చు, వారి నటన కావచ్చు. నటన ఒక్కటే నటీనటులకు అభిమానుల్ని తెచ్చి పెట్టదు అనేది నిజం. ఇప్పుడు మన సినిమాల్లో హీరోలుగానీ, హీరోయిన్లుగానీ ఎంత అందంగా వుంటున్నారు, ఎంతగా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోలను స్క్రీన్ మీద చూడాలంటే చాలా ధైర్యం కూడగట్టుకోవాల్సిన దుస్థితి తెలుగు ప్రేక్షకులకు ఏర్పడింది. కొంతమంది హీరోలను క్లోజప్‌లో చూపించడానికి దర్శకుడు, కెమెరామెన్ కూడా భయపడే పరిస్థితి వుంది. వాళ్ళని స్క్రీన్‌మీద చూసినపుడు వీడు హీరో ఎలా అయ్యాడ్రా అని ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నా వాళ్ళు మాత్రం సినిమాలు చెయ్యడం మానరు.
ఇక ఆయా హీరోల ఆడియో ఫంక్షన్లు సిటీలోని పెద్ద పెద్ద ఆడిటోరియంలలో నిర్వహించడం, జనాన్ని తండోప తండాలుగా తరలించడం మనం చూస్తున్నాం. ఆ ఫంక్షన్‌కి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి ఒక టాప్ యాంకర్‌ని పెట్టుకుంటారు. ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ హీరో కూడా సిగ్గు పడే స్థాయిలో తన పొగడ్తలతో ముంచెత్తుతుంది యాంకర్. కొన్ని సందర్భాల్లో అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నానని సిగ్గు విడిచి చెప్తుంది. తనకు ఆ హీరో మన్మథుడులా కనిపిస్తున్నాడని సిగ్గు పడుతుంది. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్‌లో రెగ్యులర్‌గా వినిపించే మాటలు ఇవే. నిజానికి అలాంటి హీరోలకు అంత సీన్ వుండదు. డబ్బు తీసుకొని ఫంక్షన్ కండక్ట్ చేస్తున్న పాపానికి ఆ హీరోని మునగ చెట్టు ఎక్కించే వరకు ఆ యాంకర్ నిద్రపోదు. ఈ చోద్యం అంతా చూస్తున్న ఆడిటోరియంలోని ఆడియన్స్‌కి, టి.వి.ల్లో చూసే ప్రేక్షకులకు ఒక్క డౌట్ మాత్రం వస్తుంది. అదేమిటంటే ఈ హీరోల ఇళ్ళల్లో అద్దాలు వుండవా, వారి మొహాన్ని ఎప్పుడూ అద్దంలో చూసుకోరా? అని. ఇవన్నీ పక్కన పెడితే హీరో ఎంత అంద వికారంగా వున్నా ఇలాంటి ఆడియో ఫంక్షన్లను భరిస్తున్నారు, ఆ హీరోల సినిమాలు చూసి సహిస్తున్నారూ అంటే అది తెలుగు ఆడియన్స్ గొప్పతనమే.