ప్యార‌డైజ్ కు ఇది పెద్ద స‌వాలే!

Big Challenge For Nani's The Paradise

 

నేచురల్ స్టార్ నాని `దసరా` వంటి ఊరమాస్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `ది ప్యారడైజ్`. నాని కెరీర్‌లోనే  150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న  పీరియడ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా  100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రాంతీయ స్టార్ లీగ్ నుండి గ్లోబల్ పాన్-ఇండియా లీగ్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్న నానికి ఈ కలల రికార్డు మైలురాయిగా మారనుంది.

అయితే  100 కోట్ల ఓపెనింగ్స్ లక్ష్యాన్ని అందుకోవడం నానికి అంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే `ది ప్యారడైజ్` విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందే ఆగస్టు 14న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ ప్రాజెక్ట్ `విశ్వనాథ్ అండ్ సన్స్` విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే భారీ మార్కెట్ ఉన్న సూర్య సినిమా ప్రభావం తమిళనాడుతో పాటుతెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంది. వారం రోజుల వ్యవధిలోనే మరో పెద్ద సినిమా రావడం వల్ల తమిళ మార్కెట్‌లో నాని చిత్రానికి థియేటర్ల కేటాయింపు ..కలెక్షన్ల పరంగా గట్టి పోటీ ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా `ది ప్యారడైజ్` చిత్రానికి పోటీ త‌ప్ప‌దు. నాని సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందే ఆగస్టు 20న మాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ `ఐయామ్ గేమ్` .. పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టిస్తోన్న `ఖలీఫా` ఒకే రోజు థియేటర్లలోకి వ‌స్తున్నాయి. దీంతో స్థానికంగా  రద్దీ నెలకొననుంది. ఈ రెండు మలయాళ చిత్రాల పోటీ వల్ల కేరళలో ప్యార‌డైజ్ కు థియేటర్ల కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది.  ఈ ప్రాంతీయ క్లాషెస్‌ను దాటుకుని నాని పాన్-ఇండియా రేసులో ఎలా నిలదొక్కు కుంటాడో చూడాలి.

Big Challenge For Nani