1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం టీజర్ లాంచ్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటి ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదల అయిన విక్రమ్ పూల రచించిన 1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాము.
ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ పేర్కొన్నారు.
నేడు జరిగిన కార్యక్రమంలో ఆడియో పుస్తకం టీజర్ ను ఎన్టీఆర్ తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ గారు లాంచ్ చేసారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ మట్లాడుతూ.. 1984 ఆగష్టు లో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగొచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని నాటి కేంద్ర పాలకులు కుట్రపన్ని పదవీత్యుతుణ్ణి చేస్తే.. ప్రజా బలంతో కాంగ్రెసేతర వ్యక్తుల సహకారంతో మహత్తరమైన ప్రజాస్వామ్యపోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చరిత్రను తిరిగిరాసారని అన్నారు.
అటువంటి ఉత్తేజకరమైన సంఘటనల సమాహారమైన విక్రమ్ పూల రచించిన సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపాన్ని డిసెంబర్ 13, 2025 హైదరాబాద్ లోని ఎన్టీఆర్ తనయ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురందరేశ్వరి విడుదల చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత విక్రమ్ పూల, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్ మోహన్ రావు, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు, మండవ సతీష్, బిక్కి కృష్ణ, ఆడియో పుస్తక పర్యవేక్షకులు సినీ నటుడు అశోక్ కుమార్, సంతోష్ కుమార్, కో ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




దీపికా కన్నా ప్రియాంక డిమాండ్స్ ఎక్కువ 
Loading..