ప్రముఖ కథానాయిక సెలీనా జైట్లీ సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ దుబాయ్ లో అరెస్ట్ అయి ఏడాది కాలంగా బంధిఖానాగా జైలులో మగ్గుతున్నారు. ఈ సమయంలో తన సోదరుడిని విడిపించుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న సెలీనా జైట్లీ భారత ప్రభుత్వాన్ని పదే పదే తన సోదరుడిని కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
అతడు మేజర్ గా దేశానికి సేవలందించారు. దేశ సైన్యంలో ధైర్యవంతుడిగా `శౌర్య` పురస్కారం అందుకున్నారు. విదేశంలో చిక్కుకున్నప్పుడు అతడి సంక్షేమం గురించి కానీ, అతడిని విడిపించి తేవడానికి అవసరమయ్యే విజ్ఞానం గురించి కానీ తనతో సమాచారాన్ని కూడా షేర్ చేయలేదని భారత ప్రభుత్వంపై తన కోపాన్ని ప్రదర్శించింది సెలీనా జైట్లీ. తన సోదరుడిని విడిపించుకోవడానికి న్యాయస్థానాల్లో అలుపెరగని పోరాటం సాగిస్తున్నానని చెప్పిన సెలీనా తాజాగా ఒక సుదీర్ఘ నోట్ రాసారు. ``నీ కోసం ఏడ్వని రాత్రి లేదు. ప్రతి రోజూ నీకోసం పోరాటం సాగిస్తూనే ఉన్నాను. నీకోసం రాయిలా నిలబడతాను.. నువ్వు ఇంటికి వస్తావని ఎదురు చూస్తున్నాను!`` అంటూ తన సోదరుడిపై ప్రేమను కురిపించారు సెలీనా. తాజాగా దిల్లీ కోర్టులో విక్రాంత్ నిర్భంధం విషయంలో చట్టపరమైన సహకారం అందించేందుకు తీర్పు వెలువరించడంపై హర్షం వ్యక్తం చేసింది.
కఠిన చట్టాలు అమల్లో ఉండే దుబాయ్ లాంటి చోట చిక్కుకుపోయిన తన సోదరుడి గురించి నటి సెలీనా ఆవేదన చెందుతున్న వైనం అందరి హృదయాలను కలచివేస్తోంది. నిజమైన సోదరి ప్రేమ, రక్త సంబంధం ఎంత గొప్పగా ఉంటాయో ఇది నిరూపిస్తోంది. గత వారం ఢిల్లీ హైకోర్టు మాజీ సైనిక అధికారికి న్యాయ సహాయం అందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. 14 నెలల పోరాటం అనంతరం చీకటి నుంచి బయటపడుతున్నామనే ఆనందం వ్యక్తం చేసారు సెలీనా. నేను నమ్మే ఏకైక సంస్థ నా భారత ప్రభుత్వం అంటూ సెలీనా ఉద్వేగానికి లోనయ్యారు. సెలీనా జైట్లీ తెలుగులో `సూర్యం` అనే చిత్రంలో మంచు విష్ణు సరసన నటించారు.





శివ రీమేక్‌లో చైతన్య-అఖిల్

Loading..