విజయకాంత్ కెరీర్ 100వ చిత్రం `కెప్టెన్ ప్రభాకరన్` కోలీవుడ్ హిస్టరీలోనే ఒక ప్రత్యేకమైన చిత్రం. ఆర్.కె. సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ తర్వాతే విజయకాంత్‌ను `కెప్టెన్` విజయకాంత్ అని పిలిచారు. ఇప్పుడు 34 సంవత్సరాల తరువాత, ఈ చిత్రాన్ని డిజిటల్‌గా పునరుద్ధరించి ఆగస్టు 22న తమిళనాడు అంతటా తిరిగి విడుదల చేశారు. అభిమానులు థియేటర్లలో దీనిని పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా నిర్మాతలు రీరిలీజ్ ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసారు. విజయకాంత్ పుట్టినరోజు సందర్భంగా దర్శకులు ఆర్.కె. సెల్వమణి, పెరరసు, నటుడు మన్సూర్ అలీఖాన్ చెన్నైలోని ఒక సినిమా థియేటర్‌లో అభిమానులతో కలిసి `కెప్టెన్ ప్రభాకరన్` చిత్రాన్ని ఆస్వాధించారు. థియేటర్ లో రీమాస్టరింగ్ వెర్షన్ ని చూసిన తర్వాత విలేకరులతో సమావేశమైన ఆర్.కె. సెల్వమణి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద గుర్తింపు. విజయకాంత్ సర్ కృషికి దక్కిన విజయం. 70 ఏళ్ల వారు కూడా ఈ సినిమా చూడటానికి వస్తున్నారని తెలిసాక నాకు ఆశ్చర్యం కలిగింది`` అని అన్నారు. నేటి తరం కూడా ఈ సినిమాను వీక్షించేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆర్కే సెల్వమణి చెప్పారు. ఈ జెన్ జెడ్ పిల్లలకు నచ్చడం చాలా పెద్ద విజయం అని అన్నారు.
`కెప్టెన్ ప్రభాకరన్` సీక్వెల్ గురించి కూడా సెల్వమణి వెల్లడించారు. ``కెప్టెన్ ప్రభాకర్ కథలో రెండవ భాగాన్ని రూపొందించాలనే ఆలోచన నాకు ఉంది. కానీ `పుష్ప` విడుదల కావడంతో, నేను దానిని తాత్కాలికంగా పక్కన పెట్టాను. విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ తన తండ్రిలాగే నటిస్తాడు. అతనితో ఈ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. మొదటి భాగం స్ఫూర్తితో దానికి సమానమైన కథను రూపొందించి, త్వరలో `కెప్టెన్ ప్రభాకరన్ 2` తీయాలని ఆలోచిస్తున్నాను`` అని ఆయన అన్నారు. తాజా ప్రకటనతో కెప్టెన్ ప్రభాకర్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.