Advertisementt

టాలీవుడ్‌పై CNB (Vs) రేవంత్‌

Thu 28th Aug 2025 09:19 AM
chandra babu naidu vs revanth reddy  టాలీవుడ్‌పై CNB (Vs) రేవంత్‌
CBN VS Revanth Reddy on Tollywood industry టాలీవుడ్‌పై CNB (Vs) రేవంత్‌
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌పై రేవంత్ రెడ్డి విజ‌న్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి టాలీవుడ్ ఎటూ త‌ర‌లి వెళ్లిపోకుండా ఆపి ఉంచాల‌నే తెలంగాణ‌ సీఎం విజ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ్లామ‌ర్ రంగం లేని లోటు అక్క‌డ ప్రభుత్వాన్ని ప్ర‌తిసారీ క‌దుపుతూనే ఉంది. టాలీవుడ్ లేని ఏపీ ప్ర‌స్తుతం నిర్జీవంగా గ్లామ‌ర్ లేకుండా పోయింది అనే అప‌వాదును ఎదుర్కొంటోంది.

 

చాలా కోణాల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ లో కొలువు దీరి ఉన్న కూట‌మి ప్ర‌భుత్వం ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటోంది. ఓవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని పూర్తి చేస్తూనే, ఏపీకి గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌ను తేవాల‌నే ఒత్తిడి చాలా కాలంగా ఎదుర‌వుతూనే ఉంది. ఒక కొత్త ప‌రిశ్ర‌మ‌ను బీచ్ సొగ‌సుల విశాఖ‌లో ఏర్పాటు చేస్తారా?  లేక రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేస్తారా? అన్న‌ది ప్ర‌స్తుతానికి అస్ప‌ష్ఠంగా ఉంది. కానీ కొత్త ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ది చేయాల‌నే త‌ప‌న‌, చిత్త శుద్ధి ఇన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వాల‌కు ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. ఏపీలో కొత్త టాలీవుడ్ ఏర్పాటు అనేది కేవ‌లం ఒక మిష మాత్ర‌మే. కొత్త‌ టాలీవుడ్ నిర్మాణం గురించి బాహాటంగా ప్ర‌క‌ట‌న‌లు రిలీజ్ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్ని గాల్లో తేలేట్టు చేయ‌డం రొటీన్ గా మారింది. రాజ‌కీయ నాయ‌కులు ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు దానిని సాధించేందుకు ప్రాక్టిక‌ల్ గా ఏం చేస్తారు? అన్న‌ది ఎప్ప‌టికీ అయోమ‌యంగానే ఉంది.

 

ఇలాంటి స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఒక రెండు కొత్త ప‌రిణామాలు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఏపీలో కొత్త టాలీవుడ్ ఏర్పాటు కోసం విస్త్ర‌తంగా సినీపెద్ద‌ల‌తో మంత‌నాలు సాగించేందుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌చ్చాయి. గ్లామ‌ర్ కోల్పోయి అంద విహీనంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి గ్లామ‌ర్ అద్దాల‌నే త‌ప‌న సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లో స్ప‌ష్ఠంగా ఉంది. దీనికోసం ఏపీ ఎఫ్.డి.సి (ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్) గ్రౌండ్ వ‌ర్క్ ని పూర్తి చేస్తోంది. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అక్క‌డ ఏం జ‌రుగుతున్నా ప్ర‌తిదీ గోప్యంగానే ఉంచ‌డం చ‌ర్చ‌గా మారింది. ఓవైపు అమ‌రావ‌తి రాజధానిని మెట్రోతో పాటు, ఈ రెండు మూడేళ్ల‌లోనే వేగంగా నిర్మించ‌డం పూర్తి చేస్తే, త‌దుప‌రి ద‌శ‌లో కొత్త టాలీవుడ్ ఏర్పాటు స‌హా ఐటి రంగం, పారిశ్రామిక రంగాల‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వంలో ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

స‌రిగ్గా ఏపీలో కొత్త టాలీవుడ్ ఏర్పాటు గురించి చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలోనే ఇటీవ‌ల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లో టాలీవుడ్ అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌ని ప్ర‌టించారు. తెలుగు చిత్ర‌సీమ అంత‌ర్జాతీయ మార్కెట్ ని అందిపుచ్చుకుంటోంది. ఇలాంటి స‌మ‌యంలో స్కిల్ యూనివ‌ర్శిటీలో సినీప‌రిశ్ర‌మ కోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తామ‌ని, కొత్త నైపుణ్య అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ఉంచ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని, హాలీవుడ్ సినిమాల చిత్రీక‌ర‌ణ కూడా హైద‌రాబాద్ లో జ‌రుగుతున్నాయ‌ని, ఇక్క‌డ మంచి వాతావ‌ర‌ణం క‌ల్పిస్తామ‌ని కూడా రేవంత్ ప్ర‌క‌టించారు. తెలుగు సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో భేటీలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించింది. అయితే స్కిల్ యూనివ‌ర్శిటీలో తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ఉద్ధ‌రించాలంటే పూణే ఫిలింఇనిస్టిట్యూట్ త‌ర‌హాలో ఒక ఇనిస్టిట్యూట్ ని ప్ర‌భుత్వ‌మే ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది గ్లోబ‌ల్ స్థాయి గుర్తింపుతో ముందుకు సాగాలి. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేదు. ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు ఒక కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు అనే స‌వాల్ ఉండ‌గా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు హాలీవుడ్ రేంజులో టాలీవుడ్‌ని నిల‌బెట్ట‌డం ఎలా? అనే స‌వాల్ అలానే ఉంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు తెలుగు సినిమా అభివృద్ధి కోసం మునుముందు ప్రాక్టిక‌ల్ గా ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది వేచి చూడాలి.

CBN VS Revanth Reddy on Tollywood industry:

Chandra Babu Naidu vs Revanth Reddy on Tollywood

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ