హిందీ, బెంగాళీ, మరాఠీ సహా భారతదేశంలోని చాలా భాషల్లో పాటలు పాడారు లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్. ఆయన స్వర ప్రయోగాల గురించి అభిమానుల్లో చాలా చర్చ సాగుతుంది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అతడు తనలోని ఆల్ రౌండర్ నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. కెరీర్ లో ఎనిమిది ఫిలింఫేర్ లు సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని ఆయన అందుకున్నారు.
అయితే గడిచిన కొన్నేళ్లుగా కిషోర్ కుమార్ బయోపిక్ గురించి చర్చ సాగుతోంది. అనురాగ్ బసు లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తారని ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకూ ఇది పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటిస్తారని, అతడికి కుదరకపోతే అమీర్ ఖాన్ ఆసక్తిగా ఉన్నారని ప్రచారమవుతోంది. అయితే ఇంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడానికి సరైన కారణాన్ని అనురాగ్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
కిషోర్ కుమార్ బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నించినా కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమతి లభించలేదని, త్వరలోనే వారి నుంచి అంగీకారం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నానని అనురాగ్ వెల్లడించాడు. రణబీర్ తో బర్ఫీ, జగ్గా జాసూస్ చిత్రాల్ని తెరకెక్కించిన అనురాగ్ అతడికి అత్యంత సన్నిహితుడు. అమీర్ ఖాన్ తోను స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అనురాగ్ ఇటీవలే మెట్రో ఇన్ డినో చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేయగా దానికి ఆడియెన్ నుంచి అద్బుత స్పందన వచ్చింది. ఇందులో ఆదిత్యా రాయ్ కపూర్, సారా అలీఖాన్ సహా పలువురు తారలు నటించారు.