నితేష్ తివారీ `రామాయణం`లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ రణబీర్‌పై ఒక సెక్షన్ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. బీఫ్ (గొడ్డు మాంసం) తినేవాడు శ్రీరాముడా? అంటూ కొందరు నెటిజనులు సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు. చాలామంది లాజిక్కులు వెతుకుతున్నారు. రణబీర్ తాను గొడ్డు మాంసం తింటానని అంగీకరించిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ని షేర్ చేస్తూ పలువురు నెటిజనులు అతడిని తూలనాడుతున్నారు. ఆవు మాంసం తినేవాడు శ్రీరాముడు ఎలా అవుతాడు? అని నిలదీస్తున్నారు.
అయితే నెటిజనుల కామెంట్లను తూర్పారబడుతూ, ఇప్పుడు ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద హీరో రణబీర్ కపూర్ కి మద్ధతుగా నిలిచారు. రే*పిస్టులు బాబాలు అయితే లేనిది, రే*పిస్టులు రాజకీయాలు చేస్తే లేనిది, ఇప్పుడు గొడ్డు మాంసం తినేవాడు రాముడి పాత్రను పోషిస్తే తప్పయిందా? అని నిలదీసే ప్రయత్నం చేసారు చిన్మయి. కేవలం ఒకరిని ఒకే కోణంలో చూడకూడదు. ఎప్పుడో కాలం చెల్లిన పాత ఇంటర్వ్యూలను పట్టుకుని ఇలా రణబీర్ కపూర్ ని విమర్శించడం సరికాదని చిన్మయి నెటిజనులను తప్పు పట్టారు. ఇంతకుముందు నితీష్ తివారీ `రామాయణం` ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఈ టీజర్ లో శ్రీరాముడిగా రణబీర్ కనిపించాడు.
ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ అనవసరమైన వివాదాల్లోకి లాగడం ఆశ్చర్యపరుస్తోంది. అతడిని నెటిజనులు వివాదాల్లోకి లాగుతున్నారు. కొందరు అతడికి మద్ధతుగా నిలుస్తున్నా, చాలా మంది వ్యతిరేకులు తయారవతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే సోషల్ మీడియాల్లో రణబీర్ కపూర్ ని టార్గెట్ చేస్తున్న వ్యక్తుల అనైతికతను చిన్మయి ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శల కంటే నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలను కోరింది.``దేవుని పేరును ఉపయోగించే బాబాజీ రే*పిస్ట్ కావచ్చు .. అతడు భక్త భారతంలో ఓట్లు పొందడానికి పెరోల్ పొందుతూనే ఉండొచ్చు.. అయితే ఎవరైనా ఏం తింటున్నారో అది మీకు పెద్ద సమస్యనా?`` అని రాశారు.
అయితే చిన్మయిని అటకాయించిన నెటిజనుల్లో ఒకరు ఇలా రాసారు. గొడ్డు మాంసం తినేవాడు ఇప్పుడు భగవాన్ రామ్ పాత్రను పోషిస్తాడు! ఈ బాలీవుడ్ కి ఏమైంది? అని నిలదీసాడు. అయితే సోషల్ మీడియాల్లో ఎంత వ్యతిరేకత నెలకొన్నా కానీ రామాయణం ఇతిహాస కథను చెప్పాలనే ప్రయత్నం ప్రజల్లో ఉత్సాహం పెంచుతోంది. రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. మొదటి భాగం సీత అపహరణతో ముగుస్తుంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ చిత్రంలో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీడియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. రవి దూబే లక్ష్మణుడిగా, లారా దత్తా కైకేయి పాత్రలో, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రావణుడి తల్లి కైకాసిగా శోభన కనిపించనున్నారు. భారతదేశంలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఇది ఒకటి. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి 1600 కోట్ల మేర బడ్జెట్ ఖర్చువుతోందని ఇప్పటికే కథనాలొచ్చాయి.