దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అనుమతి లేనిదే సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ గురించి ఎవరూ నోరు మెదపటానికి లేదు. గతంలో జక్కన్నతో కలిసి పని చేసిన ప్రభాస్ - రానా, ఎన్టీఆర్- చరణ్ వంటి స్టార్లు తమ సినిమాల గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎస్.ఎస్.ఎం.బి 29 విషయంలో చిత్ర కథానాయిక, గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా కొన్నిటిని దాచేందుకు ఇష్టపడుతున్నట్టు లేదు.
తాజాగా ప్రియాంక చోప్రా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజమౌళి - మహేష్ సినిమాలో నటిస్తున్నానని అధికారికంగా ప్రకటించింది. తాను ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్నానని, ఎస్ఎస్ఎమ్‌బి29లో నటిస్తున్నానని తెలిపింది. ``నేను ఈ సంవత్సరం భారతదేశంలో పనిచేస్తున్నాను.. నిజంగా ఉత్సాహంగా ఉన్నాను`` అని పేర్కొంది.
అయితే SSMB29 గురించి ఇప్పటివరకూ రాజమౌళి ఎలాంటి సమాచారాన్ని లీక్ చేయలేదు. మహేష్ బాబుతో పాటు, దర్శకుడు, ఇతర చిత్రబృందం కూడా ప్రాజెక్ట్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ రూల్ ని ప్రాయాంక చోప్రా బ్రేక్ చేసింది. ప్రస్తుతానికి ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని భావిస్తున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ధృవీకరించారు. 2024 లో చిత్రబృందం కెన్యాలో లొకేషన్ లను సెర్చ్ చేసారు. ఇటీవల ఒరిస్సా అడవుల్లోను సినిమాని చిత్రీకరించారు. మొదట్లో షూటింగ్ 2024 మధ్యలో ప్రారంభం అవుతుందని భావించారు, కానీ ప్రీ-ప్రొడక్షన్‌లో జాప్యం వల్ల ఆలస్యమైంది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసేందుకు రాజమౌళి తన ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి ఏ విషయం అయినా మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి రివీల్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రియాంక చోప్రా ఈ పెద్ద ప్రకటన ఎలా చేసింది? అన్నది ఆశ్చర్యపరుస్తోంది.