డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో శనివారం నాడు కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
*డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. ఆ భగవంతుడి ఆశీస్సులతోనే కన్నప్ప చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరుగుతుంది. ఆడియెన్స్ ప్రేమ, ఆ దేవుడు ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ని ఎన్నో సార్లు చూశాను. కన్నప్ప సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. రథ సారథిగా ముందుకు తీసుకెళ్లారు. ముఖేష్ రిషి కెరీర్ ఆరంభం నుంచీ మా ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ గిరిజన ప్రతినిధుల్ని పిలవడానికి కారణం ఉంది. కులాలు, మతాలు అనేవి లేవు అని చెప్పడానికి అందరినీ పిలిచాం. తిన్నడు బోయ కులానికి చెందినవాడు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ. ఆకెళ్ల ఈ చిత్రానికి అద్భుతమైన మాటలు అందించారు. ఆ శివుడి ఆశీస్సులతో మే 27న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
*విష్ణు మంచు మాట్లాడుతూ* .. కన్నప్ప విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. కన్నప్ప అనేది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు. 2017లో స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కన్నప్పని ఎప్పుడు చేస్తాను.. ఎలా చేస్తాను అన్నది చెప్పలేను.. కానీ ఎప్పుడు చేసినా కూడా మీరే మ్యూజిక్ ఇవ్వాలని స్టీఫెన్ గారికి అప్పుడే చెప్పాను. ఈ కథ కోసం పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. శివ బాలాజీ చేసిన సాయాన్ని బయటకు చెప్పలేను. మోహన్‌లాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్ గారికి థాంక్స్. శరత్ కుమార్ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. తమిళంలో ఈ చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతోందంటే దానికి శరత్ కుమార్ గారే కారణం. న్యూజిలాండ్ షూటింగ్‌కి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం గారు దీవెనలు అందిస్తూ ఉన్నారు. ఆంటోని ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కనిపించని హీరో ఆంటోని. నా కెరీర్లో ఉన్న దర్శకులందరిలోనూ ముఖేష్ గారు ది బెస్ట్. కన్నప్ప ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో బాధలు పడ్డాం. అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీస్తున్నావ్ అని శివ రాజ్ కుమార్ అడిగారు. 50 ఏళ్ల తరువాత మళ్లీ మన కన్నప్ప గురించి ఈ తరానికి చెప్పాలని ఆ శివుడే నాతో ఈ మూవీని తీయించారేమో అని శివన్నతో అన్నాను. స్టీఫెన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. శివా శివా శంకరా పాట నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుంటుంది. ఆ పాటే నన్ను కాపాడింది. స్నేహంలో కృష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు. అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు. స్టార్‌గా కంటే.. ప్రభాస్ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది. కొంత డబ్బు, పేరు వచ్చినా అంతా మారిపోతారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని. ఆయనకు ఎప్పుడూ, ఎల్లప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను. నాకు మోహన్ బాబు గారు దేవుడు. ప్రభు దేవా గారు మాకోసం మూడు పాటల్ని చేశారు. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. శివుని ఆశీస్సులు, ఆడియెన్స్ ప్రేమతో పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను అని అన్నారు.
*మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మెడియం బాబూరావు మాట్లాడుతూ*.. గిరిజనుల ప్రతినిధులుగా మా అందరినీ పిలిచి సన్మానం చేసిన కన్నప్ప టీంకి, మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. నేను వ్యక్తిగతంగా తిన్నడు లాంటి వాడిని. కన్నప్ప చరిత్ర భక్తికి నిర్వచనం. ఇప్పుడు ఇలాంటి చిత్రాలే రావాలి. కన్నప్ప లాంటి సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి అని అన్నారు.
*ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ* .. జన్మభూమిని, కర్మభూమిని మర్చిపోకూడదు. నాకు హైదరాబాద్ కర్మభూమిలాంటిది. మోహన్ బాబు గారు నన్ను నమ్మి ఇక్కడకు తీసుకు వచ్చారు. కన్నప్పను నాకు ఇచ్చినందుకు మోహన్ బాబు గారికి థాంక్స్. విష్ణు రేర్ యాక్టర్. ఒకటి, రెండు టేక్స్‌లోనే అన్ని సీన్లను చేసేశారు. ఆయన నటనస్థాయిని అందరూ చూడబోతోన్నారు. విష్ణు ఓ గొప్ప హీరోనే కాదు.. గొప్ప కొడుకు. అరియానా, వివియానా, అవ్రామ్ ఈ చిత్రంలో నటించారు. ప్రభాస్ పాత్ర గురించి ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ఏ పాత్ర కూడా హాయ్, బై అని చెప్పడానికి రాదు. ప్రభాస్ గారు చాలా హంబుల్, సింపుల్ పర్సన్. కన్నప్పకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా టీం లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. స్టీఫెన్ పాటల కంటే.. ఆర్ఆర్ అందరినీ మరింతగా సర్ ప్రైజ్ చేస్తుంది. జూన్ 27న మా చిత్రం రాబోతోంది అని అన్నారు.
*బ్రహ్మానందం మాట్లాడుతూ* .. కన్నప్ప సినిమాను శివ తత్త్వం వ్యాప్తి చేయడానికి తీశారు. డబ్బు కోసం మోహన్ బాబు గారు ఈ మూవీని తీయలేదు. అందరినీ ఒకేలా చూసే ఆ శివుడి గురించి ప్రపంచానికి చెప్పేందుకు మోహన్ బాబు గారు, విష్ణు బాబు ఈ మూవీని ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ మూవీని ఎవ్వరూ అడ్డుకోకండి. ఇదొక గొప్ప చిత్రం అవుతుంది. కన్నప్ప ఒక చరిత్ర అవుతుంది. ఈ సినిమాను, ఈ పాత్రధారుల్ని ఆ శివుడే ఎంచుకున్నాడు. జూన్ 27న కన్నప్ప రాబోతోంది. భక్తితత్వంలోకి మన అందరినీ తీసుకు పోవాలనే ఆలోచన గొప్పది. ఈ భూమ్మీద కన్నప్ప అనేది గొప్ప చిత్రం అవుతుంది అని అన్నారు.
*శరత్ కుమార్ మాట్లాడుతూ* .. నేను ఎంతో మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. కానీ బ్రహ్మానందం గారు అంతా మాట్లాడేశారు. మోహన్ బాబు నాకు పెద్దన్నయ్యలాంటి వారు. విష్ణు నాకు పుత్రసమానుడు. కన్నప్ప గురించి నేను చెప్పడం కాదు.. జూన్ 27న ఆడియెన్స్ అందరికీ తెలుస్తుంది. ఈ మూవీని తీయమని ఆ శివుడే ఈ మోహన్ బాబు గారికి చెప్పి ఉంటారు. ఆయన అనుగ్రహం వల్లే మేం అంతా ఈ చిత్రానికి వచ్చినట్టు అనిపిస్తుంది. శివాజ్ఞతోనే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది అని అన్నారు.
*మధుబాల మాట్లాడుతూ* .. ఇంత పెద్ద ప్రపంచం, విశ్వంలో మనం చిన్న అణువులాంటి వాళ్లం. ఇంత పెద్ద కన్నప్ప ప్రపంచంలో నేను ఓ అణువులాంటిదాన్ని. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. 90వ దశకంలో నేను మోహన్ బాబు గారితో కలిసి నటించలేకపోయాను. ఇప్పుడు మోహన్ బాబు గారు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారితో నటించడం సంతోషంగా ఉంది అని అన్నారు.
*అర్పిత్ రంకా మాట్లాడుతూ* .. కన్నప్పలో నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. వారితో పని చేయడంతో ఎన్నో గొప్ప విషయాల్ని నేర్చుకున్నారు. మోహన్ లాల్ సర్, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మహాభారతం సీరియల్ ద్వారా ముఖేష్ గారితో నాకు ఎక్కువ పరిచయం ఏర్పడింది. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ నేను కన్నప్ప చిత్రాన్ని చూశాను. ఇందులో ఎంత మంది స్టార్లున్నా కూడా థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు అందరికీ విష్ణు గుర్తుకు వస్తారు. క్లైమాక్స్‌లో ఆయన నటన చూసి నేను కంటతడి పెట్టేసుకున్నాను. జూన్ 27న కన్నప్ప చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
*మైత్రి శశి మాట్లాడుతూ* .. నైజాంలో మొదటగా మేం ప్రభాస్ హీరోగా చేసిన ఆదిపురుష్ రిలీజ్ చేశాం. ఆ తరువాత హను మాన్ వచ్చింది. ఇక ఇప్పుడు కన్నప్పను రిలీజ్ చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. ఆల్రెడీ కొన్ని సీన్లను చూశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
*లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ* .. కన్నప్ప కోసం పాట రాయడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు, విష్ణు గారికి థాంక్స్. క్లైమాక్స్‌లో విష్ణు బాబు మీద రాసిన సమర గీతం అద్భుతంగా వచ్చింది. ఈ అవకాశాన్ని మోహన విష్ణు వర ప్రసాదంగా భావిస్తున్నాను అని అన్నారు.
*బీవీఎస్ రవి మాట్లాడుతూ* .. కన్నప్ప సినిమా కోసం పరుచూరి గారు ఎంతో కష్టపడ్డారు. మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.. విష్ణు నటిస్తున్నారంటే మొదట్లో భయపడ్డాను. ఇంత భారీగా ఖర్చు పెట్టి తీయడం అవసరమా? అని వాళ్ల మీద ఇష్టంతో భయపడ్డాను. న్యూజిలాండ్ నుంచి దిగి వచ్చిన తరువాత బ్రహ్మాజీ ఈ మూవీ గురించి అద్భుతంగా చెప్పారు. నా కోసం మోహన్ బాబు గారు ఈ మూవీని చూపించారు. ఫస్ట్ హాఫ్ చూడంగానే ఒళ్లు జలదరించిది. సినిమా చూసిన తరువాత నా కళ్లన్నీ ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. స్టీఫెన్‌కు సెల్యూట్ చెప్పాల్సిందే. ప్రభాస్ ఎంట్రీ తరువాత సినిమా మరోస్థాయికి వెళ్తుంది. విష్ణు అద్భుతంగా నటించారు. డబ్బింగ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా అనిపిస్తుంది. కన్నప్ప ద్వారా మోహన్ బాబు గారికి పుత్రోత్సాహం, కడుపు నిండిపోతుంది అని అన్నారు.
*తోట ప్రసాద్ మాట్లాడుతూ* .. కన్నప్పకి పని చేయడం ఆ శివుడు కల్పించిన అదృష్టం. విష్ణు గారితో మూడేళ్లుగా ప్రయాణిస్తున్నాను. ఈ కన్నప్ప పాత్రలో విష్ణు బాబు ఐదారేళ్లుగా జీవిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మూవీని చాలా సార్లు చూశాను. క్లైమాక్స్‌లో విష్ణు నటనను చూసి కళ్లు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. మోహన్ బాబు గారితో పని చేయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కన్నప్పలో భక్తి, లీల ఉంటుంది. ఇంత వరకు ఎంతో మంది మహామహులు కన్నప్ప పాత్రను పోషించారు. ఇక రాబోయే తరానికి విష్ణు ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు అని అన్నారు.
*ఆకెళ్ల శివ ప్రసాద్ మాట్లాడుతూ* .. కన్నప్ప సినిమా కోసం మాలాంటి డైలాగ్ రైటర్లను కూడా న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారంటే వారి శ్రద్ద ఎలాంటిదో చెప్పుకోవచ్చు. త్రిదళంలో మోహన్ బాబు గారు, విష్ణు గారు, హీరోయిన్ గారు అయితే.. ఆ త్రిదళానికి ఖాండం ప్రభాస్ గారు. ఒక్కసారి తెరపైకి ఆయన ఎంట్రీ ఇచ్చాక సినిమా స్థాయి పెరుగుతుంది అని అన్నారు.
*రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ* .. కన్నప్ప ఈవెంట్‌ను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇక జూన్ 27న ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థం అవుతోంది. మోహన్ బాబు ఇంటి మనిషిగా ప్రస్తుతం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం నన్ను పిలిచి పాటను ఇచ్చారు. శివా శివా శంకర అని అద్భుతంగా పాటను రాశాను. స్టీఫెన్ దేవస్సీ గారు, మణి శర్మ గారు స్వరపర్చిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మోహన్ బాబు గారు, విష్ణు గారి సంకల్పం వల్లే కన్నప్ప ఇక్కడి వరకు ఇంత గొప్పగా వచ్చింది అని అన్నారు.
*శివ బాలాజీ మాట్లాడుతూ* .. కన్నప్ప గురించి అన్ని చోట్లా మాట్లాడాం. కానీ హైదరాబాద్‌లో మన ఆడియెన్స్ ముందు మాట్లాడుతున్నాను. ట్రైలర్ తరువాత సినిమాకు హై మూమెంట్ వచ్చింది. కన్నప్పకి పని చేయడం ఓ గొప్ప అనుభూతి. ఈ చిత్రంతో మా సినీ కెరీర్ ఇంకో స్థాయికి వెళ్లినట్టు అనిపించింది. విష్ణు ఈ మూవీ కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఆయన గ్రంథాలన్నీ తిరిగేశారు. ఇంత మంది స్టార్లను ఒకే సినిమాలోకి తీసుకు వచ్చారంటే మామూలు విషయం కాదు. బాహుబలిలో ప్రభాస్ ఆ లింగాన్ని తీసుకు వచ్చినట్టుగా.. ఈ కన్నప్ప మూవీని విష్ణు భుజాల మీద మోశారు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఈ రోజు విష్ణు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. విష్ణుకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
*ముఖేష్ రిషి మాట్లాడుతూ* .. కన్నప్ప నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీని తీయడం, చేయడం అంత సులభం కాదు. ఎంతో సంకల్ప బలం ఉంటే కానీ ఈ చిత్రాన్ని తీయలేరు. మోహన్ బాబు గారు, విష్ణు గారి వల్లే ఈ మూవీ ఈ స్థాయికి వచ్చింది. జూన్ 27న రాబోతోన్న కన్నప్పని, అందులో ప్రభాస్‌ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.