Advertisementt

శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూ

Mon 09th Jun 2025 10:36 AM
sri sri sri raja vaaru  శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూ
Sri Sri Sri Raja Vaaru Review శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూ
Advertisement
Ads by CJ

శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూ 

నటీనటులు: నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, భద్రమ్, సుదర్శన్ తదితరులు

సంగీతం: కైలాష్ మీనన్

సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల

ఎడిటర్: మధు

నిర్మాత: చింతపల్లి రామారావు

రచన-దర్శకత్వం: సతీష్ వేగేశ్న

విడుదల తేదీ: 06, జూన్ 2025

స్టార్ హీరో ఎన్టీఆర్ బావ మరిదిగా సినిమా పరిశ్రమకు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని, గుర్తింపును తెచ్చుకుంటున్న హీరో నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం మాత్రం శ్రీ శ్రీ శ్రీ రాజావారు. ఈ సినిమా విడుదల కావడం ఆలస్యమైనప్పటికీ, ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ సక్సెస్ అవడంతో నార్నే నితిన్ హీరోగా స్ట్రాంగ్‌గా ప్రేక్షకులలోకి వెళ్లిపోయాడు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఆయన నటించిన మొదటి చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకుడు కావడంతో.. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో ఉంటూనే ఉంది. ఎందుకంటే, సతీష్ వేగేశ్న సినిమాలలో వల్గారిటీకి తావుండదు. అందుకే అందరిలో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు ప్రేక్షకులను మెప్పించాడా, లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు కథ:

ఆత్రేయపురం గ్రామంలో సుబ్బరాజు (నరేష్), కృష్ణమూర్తి (రావు రమేష్) మంచి స్నేహితులు. పొలిటికల్‌గానూ ఇద్దరికీ ఆ గ్రామంలో మంచి పేరు ఉంటుంది.  ఈ క్రమంలో ఎమ్‌పిటిసి ఎన్నికలలో సీటు కోసం ఇద్దరూ పోటీ పడతారు. ఈసారి నాకంటే నాకు సీటు వస్తుందని ఇద్దరూ ఆశ పడతారు. కృష్ణమూర్తి కుమార్తె నిత్య (సంపద), సుబ్బరాజు కుమారుడు రాజా (నార్నే నితిన్) చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. వారి ఇష్టం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళుతుంది. కానీ రాజాకి ఉన్న వ్యసనం కారణంగా నిశ్చితార్థం రోజే గొడవలు జరిగి రెండు కుటుంబాలు విడిపోతాయి. ఈ పెళ్లికి, ఎప్‌పిటిసి సీటుకు లింక్ పెడుతూ నిత్య తండ్రి కృష్ణమూర్తి హీరోకి ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ ఏంటి? ఆ ఛాలెంజ్‌లో రాజా గెలిచాడా? అసలు నిశ్చితార్థం రోజు గొడవలు జరగడానికి కారణం ఏమిటి? చివరికి రాజా, నిత్య ఒక్కటయ్యారా? ఫైనల్‌గా ఎమ్‌పిటిసి సీటు ఎవరిని వరించింది? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు ఎఫర్ట్స్ :

ఇప్పటికే మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో నటుడిగా తానేమిటో ప్రూవ్ చేసుకున్న నార్నే నితిన్ కి శ్రీ శ్రీరాజావారు మొదటి సినిమా. మొదటి సినిమాలోనే నార్నె నితిన్ ఎంతో పరిణితిని కనబరిచారు. నిజంగా మొదటి సినిమా హీరో అని అనిపించడు. కొడుకుగా, లవర్‌గా, ఓ వ్యసన పరుడిగా ఇలా అనేక రకాల వేరియేషన్స్ ఉన్న పాత్ర ఆయనకు మొదటి సినిమాలోనే లభించగా.. ఆ పాత్రలన్నింటికీ ఆయన న్యాయం చేశాడు. హీరోయిన్‌గా చేసిన సంపద కూడా క్యూట్‌గా కనిపించింది. నరేష్, రావు రమేష్ తమ అనుభవాన్ని ప్రదర్శించారు. వారిద్దరికీ ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. ముఖ్యంగా రావు రమేష్ ఇలాంటి పాత్రలు చాలానే చేశారు. సుదర్శన్, భద్రమ్, ప్రవీణ్, రచ్చ రవి కొన్ని సీన్లలో నవ్విస్తారు.మిగతా నటులంతా  తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికంగా ఈ సినిమాకు ఏమేం కావాలో అది నిర్మాత సమకూర్చారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా చక్కని పనిని నిర్వర్తించింది. గోదావరి అందాలను కెమెరాలో బంధించి, ఎక్స్‌పోజ్ చేసిన తీరు కళ్లకి ఇంపుగా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండాల్సిన స్థాయిలోనే ఉంది. రణగుణ ధ్వనులతో విసిగించకుండా.. ఏ సీన్‌కి ఎంత కావాలో అంతే స్థాయి ఉంది. ఉన్న రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెర వేయవచ్చు. హీరో వ్యసనానికి సంబంధించిన సీన్లు కొన్ని ప్రేక్షకులకు రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి డైలాగ్ పేలింది. ముఖ్యంగా రావు రమేష్‌, నరేష్‌లతో కొన్ని అద్భుతమైన డైలాగ్స్ చెప్పించారు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులందరూ తమ పనితనం ప్రదర్శించారు. ఇక దర్శకుడు వేగేశ్న తను చెప్పాలనుకున్న, ఇవ్వాలనుకున్న మెసేజ్‌ని ఓ వ్యసనానికి లింక్ పెట్టిన విధానం అంతా బాగుంది కానీ, పదే పదే అదే రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక పురాణంలా అనిపిస్తుంది. అయినా ముగింపులో ఇచ్చిన సందేశంతో సంతృప్తిగా ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వస్తారు.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు విశ్లేషణ:

శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమాలో దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటంటే.. ఎంతటి వ్యసన పరుడైనా సమయం, సందర్భం వస్తే ఆ వ్యసనాన్నిమానుకుంటాడని, ఆ శక్తి ప్రేమకు బలంగా ఉందని చెప్పడమే. ఇలాంటి మెసేజ్‌లు నార్మల్‌గా చెబితే ఎక్కవు. అందుకే దర్శకుడు వ్యసనాన్ని హైలైట్ చేస్తూ సినిమాని నడిపించారు. కొడుకుల కోరికలు తీర్చడం తండ్రి బాధ్యత, కానీ తండ్రి కోరికను తీర్చే అవకాశం కొడుకులకు రావడం ఒక వరం.. గెలుస్తావో, గెలిపిస్తావో నీ ఇష్టం, పిల్లలు కోరుకున్నది చదివిస్తే వారి భవిష్యత్ బాగుంటుంది.. పిల్లలు కోరుకున్న వాళ్లని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ల జీవితం బాగుంటుంది వంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఒక కుటుంబం, విలువలు అన్నింటిని ఎక్కడా తగ్గనీయకుండా హీరో వ్యసనాన్ని మాన్పించిన తీరు సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. చివరిలో నరేష్ చెప్పే డైలాగ్స్.. కన్విన్సెంగ్‌ అనిపించడమే కాకుండా కరెక్ట్ టైమ్‌లో పడాల్సిన డైలాగ్స్ పడ్డాయనిపిస్తుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి తన బలం ఏంటో ఈ సినిమాతో తెలియజేశారు. మంచి మెసేజ్ ఇందులో ఉంది. కచ్చితంగా ఒకసారి చూడాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా వ్యసనాలకు అడిక్ట్ అయిన వాళ్లలో మార్పుని తీసుకువచ్చే శక్తి ప్రేమకు ఉందని చెప్పడమే కాదు.. ఈ సినిమా ద్వారా చూపించిన దర్శకుడు అభినందనీయుడు. సరిగ్గా ప్రమోట్ చేసి, ప్రేక్షకులలోకి తీసుకుపోగల్గితే మాత్రం.. సక్సెస్‌కు, కలెక్షన్లకు తిరుగుండదు. 

రేటింగ్: 2.5/5

Sri Sri Sri Raja Vaaru Review:

Sri Sri Sri Raja Vaaru Telugu Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ