Advertisement

మెగాస్టార్ మైల్ స్టోన్ డేస్

Thu 01st Feb 2024 06:01 PM
mega star  మెగాస్టార్ మైల్ స్టోన్ డేస్
Megastar Milestone Days మెగాస్టార్ మైల్ స్టోన్ డేస్
Advertisement

శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి ఇది పుట్టినరోజున వేద పండితులు చెప్పే ఆశీర్వచనం.. అంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమన్నది ఆ ఆశీర్వాద పరమార్ధం. అయితే ఆ నూరేళ్ల కాలాన్ని దినాలుగా మార్చుకుని చూస్తే 25 లీప్ సంవత్సరాలను కలుపుకొని 36వేల 525 రోజులవుతాయి. ఇదీ నిండు ఆయుర్దాయం అంటే. అయితే ఈ అనంతకాల ప్రవాహంలో నిండు నూరేళ్ల జీవన సాఫల్యాన్ని ఆస్వాదించే అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఆ నూరేళ్ల జీవితంలో ఎన్ని వేల రోజులు జయప్రదంగా, శుభప్రదంగా సాగాయి.. జీవితంలో ఎదురైన  ఒక్కో అనుభవం వయసు ఎంత..? జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏమిటి..?  అప్పటికి మన జీవిత చక్రంలో ఎన్ని రోజులు గడిచిపోయాయి.. అనే దిన గణన లో చాలా ఆసక్తికరమైన వివరాలు, విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ స్టార్స్ యొక్క కెరీర్ విశేషాలను ప్రస్తావించేటప్పుడు వాళ్ళ వయసును సంవత్సరాలలో కాకుండా రోజుల్లో రాస్తుంటారు. ఎన్ని రోజుల వయసులో కెరీర్ ప్రారంభమైంది..? ఎన్ని రోజుల్లో ఎన్ని మ్యాచ్ లలో, ఎన్ని రోజుల వయసులో ఎన్ని వేల రన్స్ చేశారు..? అంటూ ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తుంటాయి క్రికెట్ గణాంకాలు.  

అదే క్రమంలో మన సినిమా స్టార్స్ యొక్క దిన గణన చేస్తే ఆ వివరాలు, విశేషాలు అభిమానులను విపరీతంగా అలరిస్తాయి. వాళ్లకు పండగే పండగ. తమ అభిమాన స్టార్ పుట్టి ఎన్ని రోజులైంది..? కెరీర్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది.? కెరీర్ లోని ప్రధాన ఘట్టాలు జరిగి ఎన్ని రోజులు అయింది. ఇలా కెరీర్ లోని మైలు రాళ్ళను నెంబర్ ఆఫ్ డేట్స్ లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే ఆ సెలబ్రిటీ కెరీర్లో చాలా ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఉన్నప్పుడే ఆ  విశేషాలను ఎంజాయ్ చేయగలుగుతాం. తెలుగు చలనచిత్ర రంగంలో అలాంటి మలుపులు, మైలురాళ్లు కలిగి 45 ఏళ్ల మిరుమిట్లు గొలిపే కెరీర్ చవి చూసిన స్టార్ ఎవరు అంటే ఠక్కున మెగాస్టార్ చిరంజీవి అనే సమాధానం రీ సౌండ్ లో వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో చిరంజీవి జీవితంలో ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో.. అది జరిగే నాటికి చిరంజీవి వయసు ఎన్ని రోజులో తెలుసుకోవటాన్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు.

అందుకే మెగాస్టార్ సినీ జీవితంలోని మైల్ స్టోన్ లాంటి  విశేషాలను నెంబర్ ఆఫ్ డేస్ రూపంలో మీ ముందుకు తెస్తున్నాం.

2024 ఫిబ్రవరి1 నాటికి చిరంజీవి జీవితంలోని మైలురాళ్ల వంటి ఘట్టాలు ఏమిటో.. అవి జరిగే నాటికి చిరంజీవి వయసు ఎన్ని రోజులో సరదాగా చూద్దాం.. అయితే ఈ దిన గణన కు 2024 ఫిబ్రవరి1 నుండి కౌంట్ తీసుకుంటున్న కారణం ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. ఆ వివరాలు తెలుసుకోవాలంటే..

వాటిల్లో మొదటి విశేషం. చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 శుక్రవారం రోజున విడుదలైందన్నది అందరికీ తెలిసిందే. ఆ రోజున తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిరంజీవి అనే వర్ధమాన నటుడు తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమై నాలుగున్నర దశాబ్దాల విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించటం అభినందనీయం. సో నటుడుగా ప్రత్యక్షమై తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యే సమయానికి చిరంజీవి వయస్సు 8432 రోజులు.

ఇక కొణిదెలింటి కుర్రాడితో అల్లు వారు వియ్యమంద శుభలేఖలు పంచిపెట్టి సురేఖల చేయి పట్టిన రోజు ఫిబ్రవరి 1980 ఫిబ్రవరి 20 బుధవారం. అంటే పెళ్లి రోజు నాటికి చిరంజీవి వయసు 8948 రోజులు.

వర్ధమాన నటుడిగా పరిచయమై అద్భుత విజయాలతో వర్తమాన నటుడిగా ఎదుగుతున్న క్రమంలోనే చిరంజీవి తొలిసారి తండ్రి అయ్యారు. అది జరిగింది 1982 మార్చి 12- శుక్రవారం రోజున.. ఆడపిల్ల పుట్టింది.. అప్పటికి చిరంజీవి వయసు 9699 రోజులు

చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పటమే కాకుండా తెలుగు సినిమా కమర్షియల్ స్టామినా ఇదీ అని చెప్పిన బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ విడుదలైంది 1983 అక్టోబర్ 28 శుక్రవారం రోజున. ఆరోజుకు చిరంజీవి వయసు 10021 రోజులు.

తన నట వారసుడు, తన లెగసీని సగర్వంగా, సమున్నతంగా శిఖరాగ్రాల మీద ఆవిష్కరిస్తున్న తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు 1985 మార్చి 27 శుక్రవారం. ఆరోజుకు చిరంజీవి వయసు 10810 రోజులు

తన ఇమేజ్ కి, స్టార్ డం కు, సేలబిలిటీకి, స్టామినాకు తగినట్లుగా మెగాస్టార్ అనే టైటిల్ తొలిసారిగా తెరమీద పడిన రోజు ఆగస్టు 1988 ఆగస్టు 4 గురువారం. మరణమృదంగం సినిమాలో.. ఆ రోజుకు చిరంజీవి వయసు 12,036 రోజులు.

భారతదేశ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా కోటికి మించి.. కోటి 25 లక్షల అత్యధిక పారితోషికాన్ని తీసుకున్న స్టార్ గా రికార్డులకు ఎక్కగా 1992 సెప్టెంబర్ 13 ఆదివారం డేట్ లైన్ తో వచ్చిన ద వీక్ మ్యాగజైన్ Bigger than Bachan అనే కవర్ స్టోరీ రాయటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆ రోజుకు చిరంజీవి వయసు 13,537 రోజులు.

మెగాస్టార్ గా తారా పథంలో విహరిస్తూనే తన ఆలోచనలను, ఆశయాలను సేవా మార్గం వైపు మళ్ళించుకున్న సేవా తత్పరుడు చిరంజీవి. కోట్లాది అభిమానులను సేవా ఉద్యమ కార్యకర్తలుగా తీర్చిదిద్ది రక్తదాన నేత్రదాన ఉద్యమాల వైపు నడిపించి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ఆ సేవా పథంలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది 1998 అక్టోబర్ 2 శుక్రవారం రోజున స్థాపించబడిన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్. ఆ రోజుకు చిరంజీవి వయసు 15,747 రోజులు.

జీవితంలో తొలి ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డు ను పున్నమినాగు చిత్రం కోసం 1980 జూలై 6న స్వీకరించిన రోజు చిరంజీవి వయసు 9085 రోజులు కాగా 2006 ఏప్రిల్ 26 మంగళవారం రోజున భారతదేశపు అత్యున్నత మూడవ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకునే రోజుకు చిరంజీవి వయసు 18,507 రోజులు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి అదే సంవత్సరం నవంబర్ లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసి తిరుపతిలో కనీవినీ ఎరుగని స్థాయిలో బహిరంగ సభను నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించిన రోజు 2008 ఆగస్టు 26. ఆరోజుకు మెగాస్టార్ వయసు 19,363 రోజులు

అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు కేంద్ర టూరిజం శాఖ మాత్యులుగా సేవలందించారు చిరంజీవి. తన జీవితంలో 20,860 వ రోజునుండి 21,467 వ రోజు వరకు... అంటే 607 రోజుల పాటు  రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

ఇక భారత దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ప్రకటన వెలువడిన 2024 జనవరి 25 గురువారం నాటికి చిరంజీవి వయసు 24,994 రోజులు.

ఇవీ.. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎదిగి తెలుగు వారి హృదయాలలో సమున్నత స్థానాన్ని సముపార్జించుకున్న మెగాస్టార్ చిరంజీవి 45 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కొన్ని ముఖ్యమైన మైలు రాళ్ళు.

డే అండ్ డేట్స్ తో సహా పొందుపరచబడిన ఈ విలువైన సమాచారంలో మరొక అద్భుతమైన రోజు.. మరపురాని రోజు.. ప్రతి అభిమాని మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిన మేగ్నిఫిషియెంట్, మెమొరబుల్ డే ఫిబ్రవరి 1-2024. నిజానికి ఈరోజు ఎంత గొప్ప milstone day అంటే కోట్లాది హృదయాలలో ఖైదీగా కొలువుతీరిన మెగాస్టార్ భూమిని తాకి నేటితో 25,000 (25వేల) రోజులు పూర్తవుతుంది. సో.. 1955 ఆగష్టు 22 న  జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అనే నామంతరంతో సాగించిన అద్వితీయ ప్రస్థానానికి  25వేల రోజులు పూర్తి అయ్యాయి. అయితే  25వేల రోజుల జీవన యానం చాలామంది చేస్తారు. కానీ ఆ 25 వేల రోజుల్లో ఎన్ని రోజులు.. ఎన్ని గంటలు.. ఎన్ని నిమిషాలు.. ఎన్ని క్షణాలు సద్వినియోగం అయ్యాయి.. సత్ఫలితాలను ఇచ్చాయి అని సమీక్షించుకుంటే జీవితంలో ప్రతి దశను ఫలప్రదం, జయప్రదం చేసుకున్న చిరంజీవి నిజమైన ధన్యజీవి. అందుకే  అంటాను.. అభిమానుల గుండెలలో లైఫ్ టైము జైలు.. ఈ జీవితాంత ఖైదీకిక దొరకదంట బెయిలు.. 

భారతదేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షర లిఖితార్హమైన అధ్యాయంగా నిలిచిన చిరంజీవిని చిరంజీవిగా శతమానం భవతి శతాయుః పురుష ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి అని దీవిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన అనంత కోటి అభిమాన గణం.

-ఇంత ఆసక్తిదాయ మైన సమాచారాన్ని అందజేసిన చిరంజీవి గారి వీరాభిమాని సాయి కృష్ణకు అభినందన పూర్వక కృతజ్ఞతలు.

Megastar Milestone Days:

Milestone events of Mega Star career

Tags:   MEGA STAR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement