హంపిలో కన్నడ 'నాగలాదేవి' పుస్తకావిష్కరణ
Kannada book 'Nagaladevi' launched in Hampi
నేను తెలుగులో రచించిన'నాగలాదేవి'నవలను కన్నడంలో డాక్టర్ దేవన్న అనువదించారు . ఈ పుస్తక ఆవిష్కరణ కోసం నేను ఆదివారం సాయంత్రానికి హంపి వెళ్ళాను . నాతో పాటు ఆర్టిస్ట్ డాకోజు శివ ప్రసాద్ గారు వచ్చారు , మమల్ని దేవన్న ఆప్యాయంగా ఆహ్వానించారు . అందరం కలసి సాయంత్రం విద్యారణ్య స్వామి వారి మఠానికి వెళ్ళాము . స్వామి మాతో ఒక గంట సేపు పైగా సమావేశమయ్యారు. స్వామి వారు భగీరథ గారు అని ఆప్యాయంగా పిలవడం సంతోషం కలిగించింది .
సోమవారం ఉదయం విరూపాక్ష దేవాలయంలో 'నాగలాదేవి' పుస్తక ఆవిష్కరణ ఎంతో వైభవంగా జరిగింది . విరుపాక్త దేవాలయానికి నాగలాదేవి కి ఎంతో అనుబంధం ఉంది . అందుకే చారిత్రాత్మకమైన ఈ దేవాలయంలో పుస్తక ఆవిష్కరణ మహోత్సవం జరగాలని అనుకున్నాను . నా సంకల్పాన్ని దేవన్న నిజం చేశారు . ఈ సభకు ఎంతో మంది సాహితీ వేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అందరూ నా పట్ల చూపించిన అభిమానం మర్చిపోలేను.
శివ ప్రసాద్ గారితో 'అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ 'గీతనాన్ని పాడించాను. నాగలాదేవి గురించి కృష్ణదేవరాయలు పడుతున్నట్టు అనిపించిందని ప్రసాద్ గారు అన్నారు. నాకు కూడా ఆ మాటల్లో నిజముందనిపించింది.
నేను మొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడాను . అది కన్నడ పుస్తక సభ కాబట్టి తెలుగులో మాట్లాడితే బాగుండదు , కన్నడ భాష నాకు రాదు . అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడవలసి వచ్చింది.
ఆక్కడున్నంతసేపు నాకు స్వాగతం చిత్రం షూటింగ్ నాటి జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి . ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. పుస్తక సభ ఆద్యతం చక్కగా జరిగింది.
అదేరోజు సాయంత్రం కృష్ణదేవరాయల కుటుంబ వారసులు శ్రీకృష్ణదేవరాయల వారిని అనేగొంది లోని వారి నివాసంలో నేను , దేవన్న , శివ ప్రసాద్ కలుసుకున్నాము . వారితో దాదాపు 45 నిముషాల పారు సమావేశమై విజయ నగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు , నాగలాదేవి, రామారాయల గురించి మాట్లాడుకున్నాము . నేను చెప్పిన విషయాలను శ్రీకృష్ణదేవరాయలు చాలా శ్రద్ధగా విన్నారు.
తరువాత వారి కుమారుడు తిరుమల దేవరాయను నాకు పరిచయం చేశారు . ఆ బాబు రచించిన 'ఇన్ ది ఎంపైర్ అఫ్ ది గాడ్ కింగ్' అనే పుస్తకాన్ని బహుకరించారు.
మళ్ళీ మనం కలుద్ద్దామని శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది.
మంగళవారం రోజు హంపి లోని ముఖ్యమైన ప్రదేశాలు చూసి 2007లో మేము బస చేసిన కర్ణాటక పర్యాటక గెస్ట్ హౌస్ మయూర భువనేశ్వరి లో భోజనం చేసి హైదరాబాద్ బయలుదేరాము.
-భగీరధ
















































