కింగ్ డమ్ రివ్యూ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్
నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ వి.పి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడ్యూసర్: నాగ వంశీ, సాయి సౌజన్య
రైటర్ అండ్ డైరెక్షన్ : గౌతమ్ తిన్ననూరి
రిలీజ్ డేట్: 31-07-2025
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రెండు మూడు చిత్రాలతోనే విపరీతమైన స్టార్ డమ్ ని సంపాదించుకుని క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో పాన్ ఇండియా లక్కుని పరీక్షించుకున్నాడు. ఆ చిత్రం విజయ్ దేవరకొండ ను నిరాశపరిచింది. ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో కలిసి కింగ్ డమ్ అంటూ పాన్ ఇండియా మూవీ చేసాడు. సత్య దేవ్-విజయ్ దేవరకొండ అన్నదమ్ముల కథగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కింగ్ డమ్ జులై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వెంకన్న స్వామి చల్లగా చూస్తే టాప్ లో పోయి కూర్చుంటా అంటూ కాన్ఫిడెన్స్ చూపించిన విజయ్ దేవరకొండ కు కింగ్ డమ్ ఎలాంటి రిజల్ట్ నిచ్చిందో సమీక్షలో చూసేద్దాం.
కింగ్ డమ్ స్టోరీ రివ్యూ:
తెలంగాణలోని అంకాపూర్ లో సూరి ఒక కానిస్టేబుల్. సూరి అన్న శివ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాలుగా అన్న కోసం వెతుకుతూనే ఉంటాడు సూరి. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి కి తన అన్న శివ డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్కడున్నాడో కూడా చెప్తాడు. శివను తీసుకురావాలి అంటే సూరికి ఓ పని అప్పజెబుతాడు సదరు పోలీస్ ఆఫీసర్. మరి సూరి తన అన్న శివ కోసం పోలీస్ ఆఫీసర్ చెప్పిన పనికి ఒప్పుకుంటాడా, అన్న కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన సూరి శివను కలుసుకుంటాడా, ఈ నేపద్యంలో సూరి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి అనేది కింగ్ డమ్ స్టోరీ.
కింగ్ డమ్ ఎఫర్ట్స్:
పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర పడితే ప్రాణం పెట్టేయొచ్చని సూరి పాత్ర ద్వారా విజయ్ దేవరకొండ నిరూపించాడు. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ తన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సాధారణ కానిస్టేబుల్‌గా, స్పై ఏజెంట్‌గా, ముఖ్యంగా కింగ్ డమ్ కి రాజుగా.. ఇలా మల్టీ లేయర్స్ ఉన్న క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ చూపించాడు. అంతేకాదు ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో విజయ్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర సత్య దేవ్ దే. ఈ సినిమాకి సత్యదేవ్ సెకండ్ హీరోనే. అసలు కింగ్ డమ్ కి రాజు అతనే. సత్యదేవ్-విజయ్ దేవరకొండ పోటీ పడి నటించారు. స్పై కేరెక్టర్ లో భాగ్య శ్రీ బోర్సే మధు పాత్రలో క్యూట్ గా కనిపించింది. హీరో-హీరోయిన్ కి రొమాన్స్ పెట్టలేదు, పాటలు లేవు. అయినా భాగ్యశ్రీ కి మంచి పాత్ర దొరికింది. విలన్ కేరెక్టర్ లో మురుగన్‌గా నటించిన కేరళ కుర్రాడు వెంకటేష్ వీపీ.. తనలోని విలక్షణ నటనతో భయపెట్టాడు.
టెక్నీకల్ గా..
తమిళ ఇండస్ట్రీ ని ఉర్రుతలూగిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ BGM సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశం తన BGM తో బాగా ఎలివేట్ చేశాడు. ఆ తర్వాత క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ కి వెళుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. శ్రీలంక లొకేషన్స్, కింగ్ డమ్ సామ్రాజ్యం అన్ని అద్భుతంగా చూపించారు. ఎడిటర్ నవీన్ నూలి కూడా షార్ప్ కట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీల్ వచ్చినా కూడా యాక్షన్ పార్ట్ కవర్ చేసింది. పొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి తన రైటింగ్ పవర్ చూపించాడు. తెలుగు సినిమాకు సరికొత్త ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామా అందించాడు.
కింగ్ డమ్ స్క్రీన్ ప్లే:
గ్యాంగ్ స్టర్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. తను రాసుకున్న కథను కొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపించడానికి కింగ్ డమ్ లాంటి సామ్రాజ్యాన్ని సృష్టించాడు దర్శకుడు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్ దొరకడంతో గౌతమ్ పని ఇంకా ఈజీ అయింది. తాను అనుకున్న సన్నివేశాలు బాగా ఎలివేట్ కావడానికి వీళ్ల నటన బాగా తోడైంది. రాజు ఎవరు అనే ప్రశ్న, నాకెలా తెలుస్తుంది అనే సమాధానంతో ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసారు. సూరి పాత్ర ద్వారా కథని మొదలుపెట్టారు. ఎప్పుడెప్పుడు తన అన్నని కలుస్తాడా అని ఆతృత సూరిలోనే కాకుండా చూసే ప్రేక్షకుల్లో కలిగించడంతో ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. అసలైన కథ ఇంటర్వెల్ కు సెట్ అయ్యింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త స్పీడుగా ఉంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సెకండాఫ్ మాత్రం కాస్త స్లో అయ్యింది. క్లైమాక్స్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. కాస్త కన్ఫ్యూజన్ గానే కింగ్ డమ్ సెకండ్ పార్ట్ కు సరిపోయే లీడ్ ఇచ్చాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాలు, అలాగే స్పై థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళకు కింగ్ డమ్ నచ్చేస్తుంది.
కింగ్ డమ్ ఎనాలసిస్:
అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల మద్యన సంఘర్షణతో ఎన్నో కథలు తెలుగులోనే కాదు ఇండియన్ బక్సాఫీసు వద్దకు వచ్చాయి. అన్నదమ్ముల బంధంలో ఎమోషన్స్ బలంగా పండితే ఆ కథలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. అందులోను బాక్సాఫీసు బోర్ కొడుతున్న సమయంలో కాస్త యావరేజ్ టాక్ వచ్చినా సినిమాలు ఆడేస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ-సత్య దేవ్ ల నటనకు వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కింగ్ డమ్ ని బాక్సాఫీసు దగ్గర రెండు వారాలు ఖచ్చితంగా నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు.
కింగ్ డమ్ పంచ్ లైన్: అన్నద్మముల అనుబంధం
Kingdom Movie Telugu Review