Advertisement

సినీజోష్ రివ్యూ: అమిగోస్

Fri 10th Feb 2023 01:40 PM
amigos movie,amigos review  సినీజోష్ రివ్యూ: అమిగోస్
Cinejosh Review: Amigos సినీజోష్ రివ్యూ: అమిగోస్
Advertisement

సినీజోష్ రివ్యూ: అమిగోస్  

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, అషిక రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్: గిబ్రాన్  

సినిమాటోగ్రఫీ: S.సౌందర్ రాజన్ 

ఎడిటింగ్: తమ్మి రాజు 

ప్రొడ్యూసర్స్: నవీన్  యెర్నేని, Y రవి శంకర్ 

డైరెక్టర్: రాజేంద్ర రెడ్డి 

రిలీజ్ డేట్: 10-02 -2023

కెరీర్ లో ఎత్తుపల్లాలని చూసిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసాడు. గత ఏడాది కళ్యాణ్ రామ్ బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అంతే ఉత్సాహంతో రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరోసారి ప్రయోగాత్మక కథతో అమిగోస్ చేసాడు. అమిగోస్ విచిత్రమైన టైటిల్‌తో సినీ ప్రేమికులలో విపరీతమైన ఆసక్తిని సృష్టించింది. స్పానిష్ టైటిల్ తో ప్రేక్షకులు అమిగోస్ కి కనెక్ట్ అయ్యేలా కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ ప్రమోట్ చేసారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్, ఆ పాత్రల లుక్స్, టీజర్ మరియు ట్రైలర్ అందరిలో సినిమాపై ఆసక్తిని రేపాయి. సాంగ్స్ లో కళ్యాణ్ రామ్-హీరోయిన్ అషిక రంగనాథ్ కెమిస్ట్రీ ఆకర్షించింది. ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమిగోస్.. ప్రమోషన్స్ తో తెప్పించిన ఇంట్రెస్ట్ ని సినిమాతో కంటిన్యూ చేసారో.. లేదో.. సమీక్షలో తెలుసుకుందాం.

అమిగోస్ స్టోరీ రివ్యూ:

అమిగోస్ సినిమా కథ మొత్తం ముగ్గురు డోపెల్‌గ్యాంగర్ (మనిషిని పోలిన మనుషులు) చుట్టూనే తిరుగుతుంది. 

బిజినెస్ మ్యాన్ సిద్దార్థ్(కళ్యాణ్ రామ్) RJ ఇషిక(అషికా రంగనాథ్) ప్రేమలో పడతాడు. ఇషికాని ప్రేమించిన సిద్దార్థ్ ఆమెని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలోనే సిద్దార్థ్ తన పోలికలతో ఉండే సాఫ్ట్ వెర్ ఇంజినీర్ మంజునాథ్(కళ్యాణ్ రామ్) ఇంకా గ్యాంగ్ స్టర్ మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్(కళ్యాణ్ రామ్) లని గోవాలో కలిసి వారికి దగ్గరవుతాడు. అంత క్లోజ్ గా మూవ్ అవుతున్న మైఖేల్ సిద్దార్థ్ తో ఓ అబద్దం చెబుతాడు. బిపిన్ రాయ్ గా హైదరాబాద్ లో హత్య చేసి.. సిద్దార్థ్ ని ఇరికించే ప్లాన్ లో తనని తాను మైఖేల్ గా సిద్దార్థ్ కి పరిచయం అవుతాడు బిపిన్ రాయ్. మరి బిపిన్ రాయ్ ప్లాన్ లో భాగంగా సిద్దార్థ్ అరెస్ట్ అవుతాడా? సిద్దార్థ్ లవ్ స్టోరీ ఏమైంది? బిపిన్ రాయ్ హత్య చేసింది ఎవరిని? అనేది పూర్తి అమిగోస్ కథ.

అమిగోస్ ఎఫర్ట్స్:

కళ్యాణ్ రామ్ తన క్రియేటివిటీని మరోసారి చూపించాడు. కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేసి అమిగోస్ మూడు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. బిజినెస్ మ్యాన్ గా, గ్యాంగ్ స్టర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మూడు పాత్రల్లో, మూడు రకాల వేరియేషన్స్ తో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. సిద్ధార్థ్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌లో యూత్‌ఫుల్‌గా, జోవియల్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. మంజునాథ్ పాత్రలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమాయకంగా, నిజాయితీగా, పిరికివాడిగా, భావోద్వేగాలకు లోనయ్యే పాత్రలో కనిపించాడు. డైలాగ్ డెలివరీలో వేరియేషన్స్ చూపించాడు. నెగెటివ్ షేడ్స్ లో మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ గా సూపర్బ్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ చెప్పినట్టుగా కథ నడుస్తున్నంతసేపు కళ్యాణ్ రామే స్క్రీన్ మీద కనిపించాడు.

ఆశికా రంగనాథ్‌ పాత్ర పెరఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో ఆమె తెరపై అందంగా కనిపించింది. ఎన్నో రాత్రులొస్తాయనే సాంగ్ లో గ్లామర్ గా కనిపించింది. బ్రహ్మాజీ, జయప్రకాష్‌లు తదితరులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ రివ్యూ:

అమిగోస్ లాంటి కథలకి మ్యూజిక్, అలాగే నేపధ్య సంగీతం చాలా ముఖ్యం. ఇక్కడ గిబ్రాన్ అమిగోస్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని చెప్పలేం కానీ.. ఎన్నో రాత్రిలొస్తాయి కానీ.. సాంగ్ రీమిక్స్ బావుంది. మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపధ్య సంగీతం బావుంది. సౌందర్ రాజన్ తన కెమెరా తో గోవా అందాలను, సాంగ్స్ ని అందంగా చిత్రీకరించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కత్తెరకి పని చెప్పాల్సిన చోట అలా వదిలేసాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది.. అమిగోస్ కి తమ బెస్ట్ ఇచ్చారు వారు. 

అమిగోస్ స్క్రీన్ ప్లే రివ్యూ: 

రాజేంద్ర రెడ్డి ఎంచుకున్న అమిగోస్ కథ, ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆయనకున్న మక్కువను చూపించింది. మనిషిని పోలిన మనుషులు ఉంటారనే కాన్సెప్ట్‌తో కొత్తగా, వెరైటీగా ట్రై చేసారు. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగానే ఉన్నా.. మూడు క్యారెక్టర్లను నడిపించిన విధానం జస్ట్ ఫర్వాలేదనిపిస్తుంది. సినిమా సిద్దూ ఇంట్రడక్షన్‌తో చాలా రొటీన్ ఫార్మాట్‌లో మొదలవుతుంది. ఇషికా- సిద్దూ లవ్ ట్రాక్ కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగడంతో ఓ సాదాసీదా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగేలా చేసారు. మైఖేల్ క్యారెక్టర్‌తో కల్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసాడు. ఆ కేరెక్టర్ లో బలం లేకపోవడం, పాత్రలో వేరియేషన్ లేకపోవడం వల్ల ఎంగేజ్‌మెంట్ మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా అమిగోస్ క్లైమాక్స్ మరీ రొటీన్‌గా ముగియడంతో జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది.

అమిగోస్ ఎనాలసిస్:

కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేస్తాడు, ప్రేక్షకులు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకనవసరం అన్నట్టుగా కళ్యాణ్ రామ్ కథలు ఉంటాయి. కానీ కళ్యాణ్ రామ్ ఎంచుకునే కథ ఎలా ఉన్నా.. చాలా కష్టపడతాడు. అందుకు తగ్గ ప్రతిఫలం మాత్రం చాలా రేర్ గా కళ్యాణ్ రామ్ కి లభిస్తుంది. దర్శకుడు రాజేంద్ర రెడ్డి పాయింట్ సరికొత్తగా అనిపించినా.. కథ, కథనాలు కోసం ఎత్తుకొన్న ఎత్తుగడ కరెక్ట్‌గా లేదనే చెప్పాలి. కథ పాతదైనా సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మూడు పాత్రలను బలంగా రాసుకోలేకపోవడం ఒక మైనస్‌గా చెప్పుకోవాలి. కథలో ఫ్రెష్ నెస్ లేకపోవడం, సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటికీ కల్యాణ్ రామ్‌ మాత్రం మూడు పాత్రలతో సినిమాని భుజాల మీద మోశాడు. ప్రతి పాత్రలో అతని కష్టం కనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ తనవంతు ప్రయత్నం చేసినా.. కథ, కథనం తేలిపోవడంతో అమిగోస్ సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది.

పంచ్ లైన్: కళ్యాణ్ రామ్ కష్టం వృధా.!

రేటింగ్: 2.25/5

Cinejosh Review: Amigos:

Amigos Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement