Advertisement

సినీజోష్ రివ్యూ : హిట్ 2

Fri 09th Dec 2022 10:12 AM
hit 2 telugu review,hit 2 movie review  సినీజోష్ రివ్యూ : హిట్ 2
HIT 2 Telugu Review సినీజోష్ రివ్యూ : హిట్ 2
Advertisement

సినీజోష్ రివ్యూ : హిట్ 2

బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా

నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, తనికెళ్ళ భరణి, రావు రమేష్, భానుచందర్, పోసాని కృష్ణ మురళి

ఛాయాగ్రహణం : ఎస్. మణికందన్

కూర్పు : గ్యారీ .BH

సంగీతం : శ్రీలేఖ & సురేష్ బొబ్బిలి

నిర్మాణం : నాని, ప్రశాంతి త్రిపురనేని

దర్శకత్వం : శైలేష్ కొలను

విడుదల తేదీ : 02-12-2022

2 తప్ప వేరే ఏ ఇతర అంకె లేని 2022 సంవత్సరం విచిత్రంగా 2వ భాగం చిత్రాలకు భలే కలిసొచ్చింది..  భారీగా కాసులిచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా సంక్రాంతికి  వచ్చిన బంగార్రాజుతో ఈ సీక్వెల్స్ సందడి ఆరంభం కాగా సమ్మర్ కి వచ్చిన KGF 2తో ఆ సంబరం అంబరాన్ని తాకింది. ఆపై వచ్చిన F3 కూడా కావాల్సిన కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక చిన్న చిత్రంగా విడుదలైన కార్తికేయ-2 ఎంతటి పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మనకే కాదండోయ్.. సరైన హిట్టు సినిమా ఇవ్వలేక బావురుమంటున్న బాలీవుడ్ కూడా ఈ ఏడాది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ పొందగలిగింది భూల్ భూలయా 2, దృశ్యం 2 చిత్రాలతోనే.! ఇక నేడు హిట్ - 2 వంతు వచ్చింది. 

హిట్ ది ఫస్ట్ కేస్ అంటూ రెండేళ్లక్రితం రిలీజ్ అయి రీ సౌండింగ్ హిట్ కొట్టిన సినిమాకి సీక్వెల్ తీసేందుకు సిద్ధపడ్డాడు హీరో నాని. అయితే ఈసారి కూడా తాను నిర్మాతగానే ఉంటూ అడివి శేష్ హీరోగా హిట్ సెకండ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయించాడు. ఫస్ట్ సినిమా హిట్ అయిందని ఆనందపడి ఆగిపోకుండా ఏకంగా హిట్ వర్స్ నే క్రియేట్ చెయ్యాలనే ప్లాన్ తో హిట్ ది సెకండ్ కేస్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు శైలేష్ నిర్మాతగా నానిని, హీరోగా అడివి శేష్ నీ ఒప్పించాడు కానీ మరి అదే రీతిలో ప్రేక్షకులని మెప్పించగలిగాడా లేదా అనేది సమీక్షలో చూద్దాం.!

స్టోరీ : వైజాగ్ కి ఎస్పీగా  వచ్చిన యంగ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ అలియాస్ KD(అడివి శేష్) చాలా కూల్ గా ఉండే పర్సన్. ఎవరైనా క్రిమినల్ పనులు చేస్తే.. వాళ్ళని ఈజీగా పట్టేసుకోవచ్చు, వాళ్ళ బుర్రలు కోడి బుర్రలని చాలా లైట్ తీసుకునే KD ని  ఓ అమ్మాయి హత్య మాత్రం ముప్పుతిప్పలు పెడుతుంది. వైజాగ్ లో పబ్ లో జరిగిన అమ్మాయి హత్య కేసులో దాగున్న నిజాలని బయటపెట్టేందుకు KD ఏం చేసాడు.. క్రిమినల్స్ వి కోడి బుర్రలు అంటూ ఎగతాళి చేసిన KD ఆ అమ్మాయి కేసు సాల్వ్ చెయ్యడానికి ఎలాంటి బుర్ర వాడాడు, అసలు ఆ అమ్మాయి ని అంత కిరాతకంగా చంపేసే అవసరం ఎవరికి ఉంది, KD ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు అనేదే  క్లుప్తంగా  హిట్ ద సెకండ్ కేస్ కథ.

స్క్రీన్ ప్లే : హిట్ 2 వంటి నేర పరిశోధనే ప్రధాన ఇతివృత్తంగా సాగే కథలకు ప్రాణంగా నిలిచేది కథనమే. స్క్రీన్ ప్లే అరెస్టింగ్ గా ఉండాలి. నేరేషన్ లో టెంపో నింపాలి.  ప్రతి ట్విస్టు బ్లాస్ట్ అవ్వాలి.  ఈ  హిట్ 2 లో ఆ లక్షణాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. హీరోయిన్ ట్రాక్ ఒక్కటే.. అసలు కథకు అతకలేదే అనిపించినా కీలకమైన ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే సాగింది. నేరస్తుల్ని చిటికెలో పట్టుకోగలను అనే అతి విశ్వాసం కలిగిన ఆఫీసర్ కి - చిన్న క్లూ కూడా చిక్కకుండా హత్యలు చేసే క్రిమినల్ కీ మధ్య చదరంగంలా జరిగే రణరంగం ఆద్యంతం ఆకట్టుకునేలానే ఉంది. ముఖ్యంగా కథలోని మలుపులు కట్టిపడేస్తాయి. హిట్ 3 కి లీడ్ ఇచ్చిన దృశ్యాలు సర్ ప్రైజ్ ఇస్తాయి. ఈ తరహా కథలకు సాగతీత సరిపడదనే అవగాహనతో కేవలం రెండు గంటల నిడివికే పరిమితమైన చిత్ర బృందం కొన్ని సన్నివేశాల విషయంలో మరికాస్త కేర్ తీసుకుని ఉంటే ఈ హిట్టు మరో మెట్టు పైన ఉండేదేమో.!

ఎఫర్ట్స్ : తనకు టైలర్ మేడ్ రోల్ వంటి KD క్యారెక్టర్ లో అలవోకగా ఒదిగిపోయాడు అడివి శేష్. మొన్నీమధ్యనే మేజర్ గా మెస్మరైజ్ చేసిన శేష్ కి ఈసారి IPS కృష్ణ దేవ్ రూపంలో మరో పవర్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్ రోల్ కుదిరింది. రొమాంటిక్ సీన్స్ లో తనదైన స్క్రీన్ ప్రెజన్స్ చూపిస్తూనే ఇన్వెస్టిగేషన్ పరంగా ఇంటెన్స్ పెర్ ఫార్మెన్స్ తో  ఇంప్రెస్ చేసాడు శేష్. అతని ప్రేయసి ఆర్య పాత్రలో కనిపించిన మీనాక్షి చౌదరి ఆకర్షణీయంగా ఉంది. రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని వంటి నటులు చిన్న పాత్రలే చేసిన తమదైన ముద్ర వేశారు. కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి అధికారులుగా కీలక పాత్రలు పోషించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ హిట్ 2 కి హైలైట్ గా నిలిస్తే, నేపథ్య సంగీతం స్క్రీన్ పై  కనిపించే సీన్స్ లో స్ట్రెంగ్తుని పెంచింది. ఎడిటర్ గ్యారీ ఎటువంటి మొహమాటం లేకుండా ఎంత ఉండాలో అంతే ఉంచాడు. కథకి ఎం కావాలో అదే చూపించాడు. దర్శకుడు శైలేష్ తాను రాసుకున్న కథని పకడ్బందీగానే తెరపైకి తెచ్చాడు కానీ రీజన్ అఫ్ క్రైమ్ అనేది మరికాస్త బలంగా చూపించి ఉంటే మరిన్ని మార్కులు పడేవి. ఇప్పటికైతే పాస్ అయిపోయాడు కానీ హిట్ వర్స్ హీట్ ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వాలి అంటే రైటింగ్ టేబుల్ దగ్గర తనతో తనకే ఫైటింగ్ జరగాలి. ఈ కైండ్ ఆఫ్ కథలని ఇంకాస్త థ్రిల్ తో ఫిల్ చెయ్యాలి.  నిర్మాతగా తాను తీసే సినిమాకి పేరే హిట్ అని పెట్టి హిట్టు మీద హిట్టు కొడుతున్న నాని ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో పర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు. అలాగే ఈ హిట్ యూనివర్స్ లోకి అర్జున్ గా అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చి ఆడియన్సులో హిట్ 3 పై అంచనాలను పెంచేసాడు. 

ఎనాలసిస్ : విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ప్రేక్షక వర్గాన్ని సృష్టించుకున్న అడివి శేష్ హిట్ 2 చిత్రంతోను ఆ క్రెడిబిలిటీని కాపాడుకున్నాడు. నటించడానికైనా, నిర్మించడానికైనా కథ తనకు కరెక్ట్ గా కనెక్ట్ కావాలి అని చెప్పే నాని హిట్ 2 తో మరోమారు తన జడ్జిమెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ శైలేష్ కొలను టేకింగ్ వైజ్ స్పార్క్ చూపించాడు కానీ రైటింగ్ వైజ్ తనదైన మార్క్ కోసం మరికాస్త మనసు పెట్టి కలం పట్టాలి. ఒక్క విలన్ విషయం లోనే వీక్ అనిపించే ఈ చిత్రంలో ఆ లోపాన్ని అణిచిపెట్టే అంశాలు వేరేవి ఉన్నాయి కనుక సెకండ్ కేసు కూడా సక్సెస్ ఫుల్ గా సాల్వ్ అయినట్టే.. ఈసారికి హిట్టు గట్టెక్కేసినట్టే.!

పంచ్ లైన్ : హిట్ 2 - హిట్టు 

రేటింగ్ : 3/5

HIT 2 Telugu Review:

HIT: The 2nd Case Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement