Advertisement

సినీజోష్ రివ్యూ : జిన్నా

Fri 21st Oct 2022 07:39 PM
ginna movie,ginna review,ginna telugu review  సినీజోష్ రివ్యూ : జిన్నా
Cinejosh Review: Ginna సినీజోష్ రివ్యూ : జిన్నా
Advertisement

సినీజోష్ రివ్యూ : జిన్నా

బేనర్ : అవా ఎంటర్ టైన్ మెంట్స్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

నటీనటులు : మంచు విష్ణు, సన్నీలియోని, పాయల్ రాజపుత్, నరేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు

మూల కథ : జి.నాగేశ్వరరెడ్డి

స్టోరీ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్

సినిమాటోగ్రఫీ : చోటా కె.నాయుడు

సంగీతం : అనూప్ రూబెన్స్

నిర్మాత : డా.మంచు మోహన్ బాబు

దర్శకత్వం : ఈషాన్ సూర్య

విడుదల తేదీ :  21-10-2022

హీరోగా తనకు వరుస అపజయాలు ఎదురవుతున్నప్పటికీ మా అధ్యక్షుడిగా విజయం సాధించడం, ట్రోలర్స్ పై విరుచుకుపడడం వంటి టాపిక్స్ తో ఎప్పుడూ న్యూస్ లోనే ఉంటారు విష్ణు మంచు. ఎంత కష్టపడినా, ఎంత ఖర్చు పెడుతున్నా మిస్ జడ్జిమెంట్ కారణంగా మిస్ ఫైర్ అయ్యే సినిమాలే చేస్తున్న మంచు విష్ణు ఈసారి పంథా మార్చారు - పర్ ఫెక్ట్ ప్లానింగుతో కదిలారు. తనకు ఢీ రాసిన కోన వెంకట్ ని కలిశారు - తనతో దేనికైనా రెడీ చేసిన నాగేశ్వర్ రెడ్డిని పిలిచారు. ఛోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్, ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ వంటి సమర్థులైన సాంకేతిక నిపుణుల సహకారం కోరుతూ, నవ దర్శకుడు సూర్యకి అవకాశమిస్తూ జిన్నా చిత్రానికి శ్రీకారం చుట్టారు. అందాల భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లతో జతకడుతూ, ఆయా పాత్రలకు నప్పే నటీనటులనే ఏరి కోరి ఎంచుకుంటూ విష్ణు ఎన్నో జాగ్రత్తలతో చేసిన జిన్నా ఈమధ్య కాలంలో అతను చేసిన బెటర్ ఫిలింగా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ వీక్ రిలీజెస్ విషయంలో కాస్త కాంపిటీషన్ ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటూ దీపావళి బరిలోకి దిగి విష్ణు నేడు విడుదల చేసిన జిన్నాలో ఎన్నదగిన అంశాలేమిటో, ఈ చిత్రమైనా విష్ణు ఆశించే విజయాన్ని అందించగలదో లేదో విశ్లేషణలోకి వెళితే...

స్టోరీ : తన ఫ్రెండ్సుతో కలిసి ఓ టెంట్ హౌస్ నడిపే జిన్నా (మంచు విష్ణు) అవసరాల నిమిత్తం తప్పనిసరై అప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపు స్వాతి (పాయల్ రాజ్ పుత్)కి మనసిచ్చి ఆమెతో లవ్ జర్నీ చేస్తోన్న జిన్నా ఎలాగైనా అప్పులోళ్ల బాధను వదిలించుకోవాలనే ప్రయత్నాల్లో ఉండగా.. అప్పుడు దిగుతుంది రేణుక (సన్నీలియోన్). ఆస్తిపరురాలైన రేణుకకు దగ్గరై అప్పుల పీడ విరగడ చేసుకోవాలని జిన్నా భావిస్తే అసలు ఆ అమ్మాయి రేణుక కాదనీ, రూబీ అనీ తెలుస్తుంది. ఇంతకీ ఈ రేణుక ఎవరు - ఆ రూబీ ఎవరు, స్వాతి ఏమైంది - తన ప్రాబ్లెమ్ తీర్చుకోవడానికి జిన్నా ఎన్నెన్ని చేయాల్సి వచ్చింది అన్నదే మిగిలిన కథ. స్టోరీ లైన్ వైజ్ ఇంతే అనిపించినా ఇందులోనే కాసింత ప్రేమకథనీ, మరి కాసింత కామెడీని రంగరించి అనూహ్యమైన హారర్ ఎలిమెంటునీ యాడ్ చేసి ఆడియన్సుని థ్రిల్ చేసే ప్రయత్నం జరిగింది. అదేంటో స్క్రీన్ ప్లే చాప్టర్ లో చూద్దాం.

స్క్రీన్ ప్లే : సీనియర్ డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి ఇచ్చిన మూల కథకు తనవైన తళుకులు అద్దుతూ జిన్నా స్క్రిప్ట్ సిద్ధం చేసిన కోన వెంకట్ యంగ్ డైరెక్టర్ సూర్యతో కలిసి వీలైనంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అల్లుకున్నారు. అందుకే సినిమా టేక్ అఫ్ సోసోగానే అనిపించినా ఆపై మాత్రం చకచకా సాగింది. చమక్కులు చూపింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండాఫ్ లో వచ్చే మేజర్ ట్విస్ట్ జిన్నా మూవీ స్క్రీన్ ప్లే కి హైలైట్స్ గా చెప్పాలి. జిన్నాలోని ఎన్నో కోణాల్లో తనకు తెలిసిన స్క్రిప్ట్ గ్రామర్ నీ - స్క్రీన్ ప్లే గ్రాఫ్ నీ మెయిన్ టైన్ చేసిన కోన వెంకట్ యువ దర్శకుడు సూర్యకి మంచి మార్గాన్ని ఏర్పరిచారు.. ఎంతగానో తోడ్పడ్డారు. అలాగని సినిమాలో లాగ్ లేదా అంటే అదీ ఉంది. బోర్ ఉండదా అంటే ఇదీ ఉంది. రొటీన్ సీన్స్ చాలానే ఉన్నప్పటికీ మరీ విసిగించకుండా వేగంగా, వినోదభరితంగా వెళ్లిన కథనమే జిన్నాకు మెయిన్ వెపన్ అయింది.  

ఎఫర్ట్స్ : చాలాకాలం తర్వాత ఆన్ స్క్రీన్ చాలా కంఫర్టబుల్ గా కనిపించారు మంచు విష్ణు. జిన్నా క్యారెక్టర్ ను కంప్లీట్ గా తన ఓన్ చేసుకుని పూర్తిగా ఆ పాత్రలాగే ప్రవర్తించిన విష్ణు ఢీ రేంజ్ లో కామెడీ టైమింగ్ కనబరిచారు. ఢీ షో రేంజ్ డ్యాన్సులు ప్రదర్శించారు. మొత్తంగా చూసుకుంటే ట్రోలర్స్ కూడా మంచు వారబ్బాయికి మంచి మార్కులే వేసేలా ఉన్న జిన్నా చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఓ హ్యాపీ ప్రాజెక్ట్ అయింది విష్ణుకి. అలాగే సన్నీలియోని గ్లామరస్ యాంగిల్ మాత్రమే తెలిసిన వాళ్లకి ఆమెలోని అభినయ కోణాన్ని కూడా కొద్దిగా పరిచయం చేసాడు జిన్నా. ఆఫ్ కోర్స్.. అందాల విందులో లోటేం ఉండదు. అలాగే పాయల్ రాజ్ పుత్ పాత్రకు తగ్గట్టు కనిపించింది. నరేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్ వంటి తారాగణం అంతా వినోదాన్ని పంచడంలో విష్ణుకి అండగా నిలిచారు. టెక్నీషియన్స్ లో కోన వెంకట్ అనుభవం జిన్నాలోని అన్ని అంశాల్లోనూ కనిపించింది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా జిన్నాకి బడా మద్దతుగా మారారు. అనూప్ సంగీతం సినిమాకి సరిపడే పాటల్ని ఇచ్చింది. విష్ణు కుమార్తెలు అరియనా-వివియానా లని ఓ చక్కటి పాటతో సింగెర్స్ గా పరిచయం చేసింది. అలాగే కీలకమైన సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేసింది. ఇతర సాంకేతిక నిపుణులు అందరు కూడా సరైన సహకారమే అందించారు.

ఎనాలసిస్ : దీపావళి పండగ సీజన్ లో పక్కాగా వినోదం పంచేందుకు మాత్రమే రావడం మంచు విష్ణు జిన్నా చిత్రానికి మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. మెసేజులనీ, ఎక్స్ పెరిమెంట్లనీ ఎక్సట్రాలకి పోకుండా ఆడియన్ కి వీలైనంత ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడమే లక్ష్యం అంటూ... కొంత కాంపిటీషన్ ఉన్నా కొండంత కాన్ఫిడెన్సుతో రంగంలోకి దిగిన జిన్నా సంచలనాలు సృష్టించకపోయినా సాఫీగా బ్రేక్ ఈవెన్ వైపు సాగుతుంది అనేది ట్రేడ్ టాక్. ఫైనల్ గా చూసుకుంటే, ఎంత ఎఫర్ట్ పెట్టినా వరుసగా వచ్చి పడుతోన్న  డిజాస్టర్లతో డిజప్పాయింట్ అయి ఉన్న మంచు విష్ణుకి మంచి రిలీఫ్ జిన్నా అని భావించొచ్చు. ఇదే కాన్ఫిడెన్స్ తో, ఇంతే క్లారిటీతో విష్ణు ఇకపై తన కంఫర్ట్ జోన్ లోనే కంటిన్యూ అవుతారనీ ఆశించొచ్చు.

పంచ్  లైన్ : జిన్నా.. విష్ణు ట్రాకులోకి వచ్చాడన్నా.!

సినీజోష్ రేటింగ్ : 2.75/5

Cinejosh Review: Ginna:

Ginna Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement