Advertisement

సినీజోష్ రివ్యూ: రంగ రంగ వైభవంగా

Fri 02nd Sep 2022 01:43 PM
ranga ranga vaibhavanga review  సినీజోష్ రివ్యూ: రంగ రంగ వైభవంగా
Cinejosh Review: Ranga Ranga Vaibhavanga సినీజోష్ రివ్యూ: రంగ రంగ వైభవంగా
Advertisement

సినీజోష్ రివ్యూ: రంగ రంగ వైభవంగా 

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, ప్రభు, నవీన్ చంద్ర, అలీ, సుబ్బరాజు, నరేష్, తులసి, ప్రగతి తదితరులు  

మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రాఫర్: శ్యామ్ దత్ 

నిర్మాత: B.V.N.S ప్రసాద్

కథ-దర్శకత్వం: గిరీశాయ  

రిలీజ్ డేట్: 02-09-2022 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజులు సందర్భంగా వాళ్ళు ఎప్పుడో చేసేసి అందరూ ఆల్రెడీ చూసేసి ఉన్న సినిమాలని స్పెషల్ షోస్ వేసుకుని వాటికి రికార్డ్ కలెక్షన్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫాన్స్. అదే సమయంలో రవితేజ, రామ్, నితిన్, నాగ చైతన్య వంటి హీరోల కొత్త సినిమాల్లో పాత వాసనలు తగలగానే తిప్పి కొట్టి పంపేస్తున్నారు. ఇప్పుడదే కోవలో చేరింది అంగలేసుకుంటూ వచ్చిన రంగ రంగ వైభవంగా.

మెగా కాంపౌండ్ నుంచి ఉప్పెనలా వచ్చి పడ్డ మరో యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే కొంత ప్రయోగాత్మకంగా చేసిన మలి చిత్రం కొండ పొలం అతనికి నిరాశని మిగిల్చింది. దానితో మూడో సినిమాకి తనకి సేఫ్ జోన్ అనుకుని ఒక లవ్ బుల్ ఎంటర్టైనర్ ని అందించే ప్రయత్నం చేసాడు వైష్ణవ్ తేజ్. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి అసోసియేట్ అయిన గిరీశాయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి పాజిటివ్ వైబ్స్ నే క్రియేట్ చేస్తూ వచ్చింది. ఫైనల్ గా స్క్రీన్ పైకి వచ్చాక ఆడియన్స్ కి బోర్ కొట్టించిందా? చీర్స్ చెప్పించిందా? లెట్స్ సీ.

బేసిక్ పాయింట్ : చిన్నప్పుడు స్నేహితులు మధ్యలో శత్రువులు పెద్దయ్యాక ప్రేమికులు. టక్కున చెప్పాలంటే ఇదే స్టోరీ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ తో ఎన్ని సినిమాలొచ్చాయో టపీమని చెప్పాలంటే చాలా కష్టం. హిట్లు కొన్ని, ప్లాప్ లు ఎన్నో. కానీ కథాంశం మాత్రం ఇదే. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు చూసి చూసి విసిగెత్తిపోయున్న ఇదే పాయింట్ ని చాలా వినూత్నంగా భావించి రంగ రంగ వైభవంగా తెరపైకి తేవడం జరిగింది. థియేటర్ కి వెళ్లి సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడికి అంతా తెలిసినట్టే జరుగుతూ ఉండడం, అదంతా ఆల్రెడీ చూసేసినట్టే అనిపించడం అల్టిమేట్ గా ఈ సినిమా కలిగించే అనుభూతి. తెరపై తెలిసిన తతంగమే జరుగుతూ ఉంటే.. కొందరి కళ్ళు మొబైల్స్ వైపు తిరుగుతున్నాయి.. ఇంకొందరి కళ్ళు ఎగ్జిట్ డోర్ వెతుకుతున్నాయి. టోటల్ గా టైటిల్ లో ఉన్న వైభవం కానీ, టీజర్ లో ఉన్న వైవిద్యం కానీ మచ్చుకైనా లేకుండా మనముందుకొచ్చిన చిత్రమిది.

ప్లస్ పాయింట్ : ఇంత బోరింగ్ సినిమాలో రోరింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది దేవి మ్యూజిక్. ఇదే హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెనకి తన మ్యూజిక్ తో బ్యాక్ బోన్ లా నిలబడ్డ దేవి మరోసారి అంతే సపోర్ట్ అందించాడు. కానీ ఈమారు కథ, కథనం, దర్శకుడు సహకరించలేదు. సినిమా కోసం థియేటర్ కి ఒక్కసారి కూడా రాని ప్రేక్షకుడు ఇకపై యూట్యూబ్ లో ఇవే పాటలని మళ్లీ మళ్ళీ చూడొచ్చు ఆ రేంజ్ లో ఉంది దేవి మ్యూజిక్ తో చేసిన మ్యాజిక్. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిని కలర్ ఫుల్ గా స్క్రీన్ పై చూపించింది. హీరోయిన్ కేతిక శర్మ మూడో సినిమాకి తనలో వచ్చిన ఇంప్రూవ్ మెంట్ చూపించింది. ఆకర్షణీయంగా కనిపించింది. ఆ పాత్రకు తగ్గట్టుగా అభినయించింది. మెగాస్టార్ తో తప్ప ఇతర మెగా హీరోస్ అందరితోనూ సినిమాలు చేసి ఉన్న  సీనియర్ ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ వైష్ణవ్ తేజ్ సినిమా విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ ప్రొడెక్ట్ అందించారు.

మైనస్ పాయింట్ : మొహమాటానికి కావొచ్చు, మెహర్భానీకి కావొచ్చు.. ప్రతి సినిమా విశ్లేషణలోనూ తొలి పొగడ్తలు హీరో పేరునే వింటాం. రాస్తాం. చూస్తాం. చదువుతాం. కానీ ఈ సినిమాకి సంబంధించి మాత్రం మొదటి విమర్శని మోసేది వైష్ణవ్ తేజ్. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చాలా ఈజీగా హీరో పెరఫార్మెన్స్ ఇన్ మెచ్యూర్డ్ గా వుంది అంటున్నాడు అంటే వైష్ణవ్ అది గుర్తించాలి. క్రిటిక్స్ అందరూ కూడా తన అభినయం పట్ల ఒకే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే వైష్ణవ్ అందులో నిజాన్ని అర్ధం చేసుకోవాలి. సాటిలేని స్టార్స్ గా మావయ్యల అండ ఉన్నా తనుగా తాను సమర్థుడని చాటుకునే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఓవరాల్ గా ఉప్పెన, కొండ పొలం చిత్రాల్లోని కేరెక్టరైజేషన్స్ వల్ల నటుడిగా పర్లేదనిపించుకుని పాస్ మార్క్ లు వేయించుకున్న వైష్ణవ్ కాన్ టెంపరరీ యూత్ కి కనెక్ట్ అయ్యే కేరెక్టర్స్ చెయ్యాలంటే మాత్రం ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తెలుసుకోవాల్సిందే.. నేర్చుకోవాల్సిందే.! ఇక ఇతర మైనస్ పాయింట్స్ విషయాల్లోకి వెళితే కథ, కథనం, దర్శకత్వం.. ఇలా అన్నీ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మూస కథని మోసుకొచ్చి రంగ రంగ వైభవంగా ఖర్చు పెట్టించి మరీ ప్రేక్షకుల నెత్తికెత్తాలని చూసిన దర్శకుడినే తప్పుపట్టాలి. అర్జున్ రెడ్డి ని తమిళ్ లో రీమేక్ చేసి తప్పులో కాలేసిన గిరీశాయ ఈసారి ఈకథతో తనతో పాటు అందరూ పప్పులో కాలేసేటట్టు చేసాడు. 

ఫైనల్ పాయింట్ : మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అందించాలనే ఉద్దేశ్యంతో మొదలై ఆడియన్స్ కి ఏం నచ్చుతుందో అంచనాలు వేస్తూ, ఆల్రెడీ వర్కౌట్ అయ్యి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పోగు చేస్తూ మార్పులతో, చేర్పులతో, కూర్పులతో మొత్తానికి ఓ మెతక కథగా తయారై ముతక సినిమాలా మారింది రంగ రంగ వైభవంగా. ఇటీవలే ఓ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు సినిమాలో సరైన కంటెంట్ కనబడకపోతే.. రెండో రోజుకే సినిమా నిలబడదు అనే అంశాన్ని శిఖరమే చెప్పినా శిశిరాలకు అర్ధం కావడం లేదు. బహుశా ఈ రిజల్ట్ తో రియలైజ్ అవుతారేమో!    

పంచ్ లైన్ : రంగ రంగ వైభవంగా - మరీ వెరీ రొటీన్ గా.! 

సినీజోష్ రేటింగ్ : 2/5

Cinejosh Review: Ranga Ranga Vaibhavanga :

 Ranga Ranga Vaibhavanga Telugu Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement