సినీజోష్ రివ్యూ : కోబ్రా
బేనర్ : ఎన్ వి ఆర్ సినిమా
నటీనటులు : విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, మృణాళిని, కె.ఎస్.రవికుమార్ తదితరులు
సంగీతం : ఎ.ఆర్.రహమాన్
సినిమాటోగ్రఫీ : హరీష్ కణ్ణన్
సమర్పణ : లలిత్ కుమార్
దర్శకత్వం : ఎస్.అజయ్ జ్ఞానముత్తు
విడుదల తేదీ : 31-08-2022
నటుడిగా వేలెత్తి చూపలేని విక్రమ్ కథల ఎంపికలో మాత్రం తాను కన్ ఫ్యూజ్ అవుతూ ఆడియన్సుని కన్విన్స్ చేయలేకపోతున్నాడు. అందుకే అపరిచితుడు తర్వాత అపరిమితమైన క్రేజ్ వచ్చినప్పటికీ నిలుపుకోలేకపోగా.. నేటికీ సరైన విజయం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఓ పక్క పొన్నియన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక చిత్రం చేసినప్పటికీ అది మణిరత్నం మూవీగానే చలామణీ అవుతోంది. పైగా అందులో ఇతర భారీ తారాగణము ఉంది. ఇక విక్రమ్ చూపించాల్సిన తన బెస్ట్.. సోలోగా పాస్ అవ్వాల్సిన టెస్ట్ కోబ్రా. ఎంతో కాలంగా నిర్మాణంలో ఉంటూ వచ్చిన కోబ్రాకు ఎట్టకేలకు నేడు మోక్షం దక్కింది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో పది విభిన్న గెటప్పుల్లో విక్రమ్ కనిపించడం, ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ఎక్సట్రార్డినరీ అనిపించడం, ఏ.ఆర్.రహమాన్ వంటి కొండ అండగా ఉండడం, లక్కీ హీరోయిన్ KGF ఫేమ్ శ్రీనిధిశెట్టితో సహా ముగ్గురు హీరోయిన్లు తెరపై మురిపించనుండడం కోబ్రాపై కాస్త మంచి అంచనాలని ఏర్పరిచింది. అందులోనూ అనుభవజ్ఞుడైన నిర్మాత ఎన్.వి.ప్రసాద్ కోబ్రాను తెలుగులోకి తెచ్చేందుకు సిద్ధపడడం మరికాస్త నమ్మకాన్ని కలిగించింది. సరే మరి.. ఫైనల్ గా పండగ పూట పనిగట్టుకుని థియేటర్స్ లో ఎంటర్ అయిన ప్రేక్షకులను కోబ్రా కాటేసిందో.. థ్రిల్ చేసిందో క్లుప్తంగా చెప్పేసుకుందాం.
బేసిక్ పాయింట్ : మ్యాథ్స్ టీచర్ అయిన ఓ వ్యక్తి తనకెదురైన ప్రతి సమస్యనీ మేథమెటికల్ గానే ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో కథని అల్లుకోవడం ఖచ్చితంగా మెచ్చదగిన అంశమే కానీ కథా విస్తరణే కంగాళీ అయిపోయింది. అసలు స్టోరీ కాన్సెప్ట్ లోని మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏంటో తెరపైకి తేవడానికే చా..లా టైమ్ తీసుకున్న దర్శకుడు ఇక దాన్ని కంక్లూడ్ చేయడానికి అయితే నానా అవస్థలూ పడ్డాడు. దాంతో ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు ఓకే అనిపించుకునే కోబ్రా ఆపై మాత్రం అందరికీ అర్ధం కాని ఆల్జీబ్రాలా మారిపోయి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసింది.
ప్లస్ పాయింట్ : ఈ చిత్రానికి ఉన్న ఏకైక బలం విక్రమే. తన విలక్షణతను మరోమారు చాటుకుంటూ చాల సెటిల్డ్ గా నటించిన విక్రమ్ పలు గెటప్పుల్లో పదునైన తన నటనా పటిమను ప్రదర్శించాడు. రహమాన్ మ్యూజిక్ లో పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోరే బెటర్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ రెండూ కోబ్రాకి కో బ్రదర్స్ లా నిలిచాయి. క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ నటుడిగా తొలిసారి మెరిశాడు.
మైనస్ పాయింట్ : మూడు గంటల మూడు నిముషాల నిడివి అనేదే అతి పెద్ద మైనస్ గా మారి ప్రేక్షకులను కాటేసే కాలసర్పంలా మార్చేసింది కోబ్రాని. నిదానంగా సాగిన ప్రథమార్ధం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ద్వితీయార్ధం రెండూ వీక్షకులకు సహన పరీక్షే.! కిక్కే లేని లవ్ ట్రాకుని - అక్కర్లేని సెంటిమెంటుని ఇరికించకుండా ఉండుంటే ఈ కోబ్రా కాస్తయినా బాగుండేదేమో.. కొందరైనా భరించేవారేమో.!
ఫైనల్ పాయింట్ : విక్రమ్ చేసిన హార్డ్ వర్క్ వేస్ట్ అయినట్టేనని చెప్పాలి. అంతమంది అద్భుత సాంకేతిక నిపుణుల ఎఫర్ట్ పనికిరాకుండా పోయినందుకు చింతించాలి. రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా రిజల్ట్ చూసి ఈ విక్రమ్ సినిమాని ఎంతో నమ్మకంతో కొనుక్కొచ్చిన మన నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మరీ కోబ్రా కాటుని ఎలా తట్టుకుంటారో చూడాలి.!
పంచ్ లైన్ : కాటేసిన కోబ్రా
సినీజోష్ రేటింగ్ : 1.5 /5