Advertisement

సినీజోష్ రివ్యూ : మాచర్ల నియోజక వర్గం

Fri 12th Aug 2022 12:56 PM
macherla niyojaka vargam movie,macherla niyojaka vargam review,macherla niyojaka vargam movie review,macherla niyojaka vargam telugu review  సినీజోష్ రివ్యూ : మాచర్ల నియోజక వర్గం
Cinejosh Review: Macherla Niyojaka Vargam సినీజోష్ రివ్యూ : మాచర్ల నియోజక వర్గం
Advertisement

సినీజోష్ రివ్యూ : మాచర్ల నియోజక వర్గం

బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్

నటీ నటులు : నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం : మహతి స్వరసాగర్

ఛాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ

కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు

సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ

నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి

రచన, దర్శకత్వం : ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి

విడుదల తేదీ : 12 - 08 - 2022

థియేటర్సులో విడుదలై డిజాస్టర్స్ అయిన చెక్, రంగ్ దే చిత్రాలతో పాటు నేరుగా ఓటీటీలోనే వచ్చినా ఓ మోస్తరు స్పందన కూడా పొందలేకపోయిన మ్యాస్ట్రోతో హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూశాడు నితిన్. ఎక్స్ పెరిమెంట్ అనుకున్న చెక్, ఎంతగానో నమ్ముకున్న రంగ్ దే, ఏరికోరి ఎంచుకున్న రీమేక్ మ్యాస్ట్రో... మూడూ మొట్టికాయలే వేయడంతో గట్టిగా డిస్టర్బ్ అయిన నితిన్ ఈసారి మాస్ మసాలాలు దట్టించి ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాని పట్టుకొచ్చాడు. అదే మాచర్ల నియోజకవర్గం. ఇందులో టీనేజ్ అందాల ఉప్పెన కృతి శెట్టి నితిన్ సరసన నటించగా.. సరైన సెంటిమెంట్ అనుకున్నారో ఏమో, సరైనోడు చిత్రంలో కీలక పాత్ర చేసిన కేథరిన్ నీ, ఐటెం సాంగ్ చేసిన అంజలినీ సరిగ్గా అవే పాత్రల కోసం ఈ చిత్రానికి తెచ్చుకున్నారు. అలాగే రాజేంద్రప్రసాద్, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ వంటి సపోర్టింగ్ క్యాస్ట్ నీ చక్కగానే సెట్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తోన్న ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ చిత్రంపై హైప్ తీసుకురాలేకపోగా.. తన వ్యక్తిగత వివాదంతో మాచర్లపై ఓ వర్గం జనం కాలు దువ్వేలా, కక్ష కట్టేలా చేసారని చెప్పాలి. గతవారం విడుదలైన రెండు సినిమాలూ మంచి మౌత్ టాక్ తో ఇప్పటికీ మార్కెట్ లో స్ట్రాంగ్ గానే ఉన్న దశలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాచర్ల నియోజకవర్గం వాటికి ధీటుగా నిలబడగలదా.. నితిన్ ఎంతగానో ఎదురుచూస్తోన్న విజయాన్ని అందించగలదా.. అసలు ప్రస్తుత ప్రేక్షకులను ఒప్పించి మెప్పించగలిగే అంశాలు ఇందులో ఉన్నాయా అనేది సమీక్షలో చూద్దాం. 

కథ:

ఓ ప్రాంతాన్ని శాసించే ప్రతి నాయకుడు - దానికి ఎదురు నిలిచే కథానాయకుడు. కమర్షియల్ సినిమా కథ అనగానే కాన్వెంట్ కి వెళ్లే పిల్లాడు కూడా పిప్పరమెంట్ చప్పరిస్తూ చెప్పేసే పరమ రొటీన్ పాయింట్ ఇది. ఎన్నో సినిమాలు ఎడిట్ చేసిన ఎస్ ఆర్ శేఖర్ ఇదే పాయింట్ ఎందుకెత్తుకున్నాడో.. ఇండస్ట్రీలో 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నితిన్ దీన్ని ఎలా ఒప్పుకున్నాడో వాళ్ళకే తెలియాలి. ఇక విషయంలోకి వస్తే.. మాచర్ల నియోజకవర్గాన్ని తన కొడుకు వీరప్పతో కలిసి శాసిస్తూ ఉంటాడు రాజప్ప(సముద్రఖని). గత 30 ఏళ్లుగా అక్కడ ఎన్నికలనేవే జరగని, జరగనివ్వని స్థితిలో ఆ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి(నితిన్) అక్కడున్న పరిస్థితుల్ని ఎలా మార్చాడు, రాజప్ప నియంతృత్వాన్ని ఎలా నిరోధించగలిగాడు అన్నది క్లుప్తంగా కథ. ఇక ఈ క్లుప్తమైన కథలో స్వాతి(కృతి శెట్టి) అండ్ నిధి(కేథరిన్)ల నిర్లిప్తమయిన పాత్రలేమిటో ఓపికుంటే మీరు తెరపైనే చూడండి. కలెక్టర్ కి - పొలిటీషియన్ కి మధ్య జరిగే ఘర్షణ కనుక మీరిందులో హీరోగారి ఐఏఎస్ తెలివితేటలని, విలన్ గారి వీరత్వాన్ని ఆశిస్తారేమో. అలాంటివేమీ ఎక్స్ పెక్ట్ చెయ్యకుండా తీసుకున్న రెమ్యునరేషన్ కి తగ్గట్టు గ్లామర్ చూపించే హీరోయిన్స్ ని, నవ్వించడానికి నితిన్, వెన్నెల కిషోర్ తదితరులు పడ్డ తంటాలని, ముగ్గురు ఫైట్ మాస్టర్ లు పోటీపడి మరీ ఫైట్స్ లో కంపోజ్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలని మాత్రమే మనకి ఆఫర్ చేస్తుంది మాచర్ల.

తెరపై:

లుక్స్ వైజ్ నితిన్ బావున్నాడు. పెరఫార్మెన్స్ వైజ్ నితిన్ బాగా చేసాడు. డాన్స్ లో ఫైట్స్ లో ఎనర్జీ చూపించాడు. ఎలివేషన్ సీన్స్ ని చక్కగా ఎంజాయ్ చేసాడు. కానీ తాను ఆశిస్తున్న విజయాన్ని అందించే కథను ఎంచుకోవడంలో మాత్రం కంప్లీట్ గా తప్పటడుగు వేసాడు. చెంతనే సొంత బ్యానర్ ఉంది కనుక డిఫరెంట్ సబ్జక్ట్స్ ని చూజ్ చేసుకుంటే తను తప్పకుండా హిట్టు కొట్టొచ్చు. చేంజ్ అయిన ఆడియన్స్ టేస్ట్ ని అతను అర్ధం చేసుకోగలిగితే హీరోగా తన కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టొచ్చు. కృతి శెట్టి మరోసారి తన నటన కంటే గ్లామర్ కే ఎక్కువ మార్కులు వేయించుకుంది. నిధి పాత్రలో కనిపించిన కేథరిన్ తన కెరీర్ నే కాదు ఫిజిక్ ని కూడా కరెక్ట్ గా మెయిన్ టైన్ చెయ్యలేకపోతుందా అన్నట్టుంది ఆమె అప్పీరియన్స్. ఐటెం సాంగ్ లో అంజలి కాస్త భారీగానే కనిపించినా.. ఆ పాట రాను రానంటూనే చిన్నదో వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ కి రీమిక్స్ కనుక కాస్త ఊపుతోనే సాగింది. రాజప్ప-వీరప్పలుగా ద్విపాత్రాభినయం చేసేసిన సముద్రఖని పెద్ద వేరియేషన్ ఏమి చూపించకుండా తన సహజ శైలిలో పని కానిచ్చేశాడు. హీరో పేరెంట్స్ గా మురళి శర్మ-ఇంద్రజ, హీరోయిన్ ఫాదర్ గా రాజేంద్ర ప్రసాద్, పొలిటీషియన్ గా శుభలేఖ సుధాకర్, కామెడీ పుట్టించే బాధ్యత భుజాన వేసుకున్న పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తమదైన తీరుతో తమకి తోచిన రీతిలో నటించేసారు.

తెర వెనుక:

మహతి స్వర సాగర్ అందించిన సంగీతంలో రెండే పాటలు క్యాచీగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే ఉందనిపించినా.. ఎక్కువైపోయిన ఎలివేషన్ సీన్లలో హోరు బాగా పెరిగిపోయింది. మాటల్లోనూ మాములు అరుపులే తప్ప మెరుపులేం లేవు. ఫైట్ మాస్టర్ లకైతే ముగ్గురికీ చేతినిండా పని పడింది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ తన చేతి పనితనాన్ని మరోసారి చూపించారు. దర్శకుడే స్వతహాగా ఎడిటర్ అయినప్పటికీ కూర్పులో నేర్పరి అయిన కోటగిరి వెంకటేశ్వర రావు ని ఎంచుకున్నందుకు అభినందించొచ్చు. అయితే ఆయన తన అనుభవాన్ని చూపించగలిగే అవకాశాన్ని మాత్రం ఇచ్చినట్టులేడు దర్శకుడు. నితిన్ కి ఖచ్చితంగా ఓ హిట్ ఇచ్చి తీరాల్సిన రెస్పాన్సిబిలిటీతో మేకింగ్ వైజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాత సుధాకర్ రెడ్డి మాచర్ల స్టోరీని జడ్జ్ చెయ్యడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. దర్శకుడు రాజశేఖర్ మరీ మూస కథని రాసుకుని మొదటి తప్పు చేస్తే.. ఆ పసలేని నస కథని ఓకే చేసి నితిన్ రెండో తప్పు చేసాడు. ఆపై శేఖర్ కే డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చెయ్యడం నుంచీ మాచర్ల ప్రయాణం పూర్తిగా తప్పుల తడకలా.. నిప్పులపై నడకలా సాగింది. ఇక దర్శకుడిగా రాజశేఖర్ చూపించిన నవ్యత కానీ ప్రత్యేకత కానీ ఏవీ లేవు. నితిన్ వరుస పరాజయాల సంఖ్యకు మరో అంకె జోడించాడంతే.!

విశ్లేషణ :

హీరో ఎంట్రీకి ఎలివేషను ఇచ్చేసి ఆపై నాలుగు లవ్ సీన్లు, నాలుగు కామెడీ సీన్లు వేసేసి మధ్యలో ఓ రెండు ఫైట్లు, రెండు పాటలు ఇరికించేస్తే ప్రథమార్ధం వరకూ పనైపోద్దిలే - ఉన్న కాస్త కథా వస్తువనేదాన్ని సెకండాఫ్ లో చూపిస్తే సరిపోద్దిలే అనే ధోరణిని మాచర్ల నియోజకవర్గంలో ఆద్యంతం చూపించాడు దర్శకుడు రాజశేఖర్. ఎడిటింగ్ రూమ్ లో ఎన్నో సినిమాలు చూసిన, చేసిన అనుభవమే తప్ప.. డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఓ కొత్త తరహా కథని రాయగలిగే నైపుణ్యం తనలో లేదేమో అనిపించేలా మాచర్ల కథను మనందరం చూసేసి ఉన్న సన్నివేశాలతోనే నింపుకుంటూ వచ్చాడు. కనీసం వాటి పిక్చరైజేషన్ లోను, ప్రెజెంటేషన్ లోను కూడా ఏమాత్రం ఫ్రెష్ నెస్ కోసం ట్రై చెయ్యకపోవడం శేఖర్ స్పెషాలిటీ అనుకోవాలేమో. బహుశా తన నేరేషన్ తో నితిన్ ని ఇంప్రెస్ చేసేసి ఈ డైరెక్షన్ ఛాన్స్ దక్కించుకున్నాడేమో కానీ ఆడియన్సుని ఆకట్టుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు దర్శకుడు రాజశేఖర్. ఇక అంతకు అంతా విసుగనిపించే విషయాలే తప్ప విశ్లేషించేంత మ్యాటరేం లేదు మాచర్లలో.!

( అన్నట్టు.. ఇటీవలే వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికీ - నేడు వచ్చిన మాచర్ల నియాజకవర్గానికీ దర్శకుల వ్యక్తిగత విషయాలు, వివాదాస్పద వ్యాఖ్యలే చేటు చేయడం గమనార్హం. ఇంతకీ ఈ పోలిక ఎందుకంటే రెండు సినిమాల్లోనూ హీరోలు కలెక్టర్లే.. రెండిటికీ విలన్లు డైరెక్టర్లే )

సినీజోష్ రేటింగ్ : 1.75/5

పంచ్ లైన్ : మాచర్ల నియోజక వర్గం - మనీ & టైమ్ వ్యర్థం

 

 

 

Cinejosh Review: Macherla Niyojaka Vargam :

 Macherla Niyojaka Vargam Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement