Advertisement

సినీజోష్ రివ్యూ : సీతారామం

Fri 05th Aug 2022 05:35 PM
sita ramam review,sita ramam movie,sita ramam movie review,sita ramam telugu review,dulqer sita ramam review,rashmika sita ramam review  సినీజోష్ రివ్యూ  : సీతారామం
Cinejosh Review: Sitaramam సినీజోష్ రివ్యూ : సీతారామం
Advertisement

సినీజోష్ రివ్యూ  : సీతారామం

బ్యానర్: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్

నటీనటులు : దుల్కర్‌ సల్మాన్‌,మృణాల్‌ ఠాగూర్‌, సుమంత్‌, రష్మిక, గౌతమ్‌ మీనన్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు 

సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌

సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ

ఎడిటర్‌:కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాత: అశ్వినీదత్‌

దర్శకత్వం: హను రాఘవపూడి

రిలీజ్ డేట్: 05-08-2022 

ప్రతిభావంతుడనే ప్రశంసలే తప్ప కమర్షియల్ హిట్ అనేది మాత్రం అందని ద్రాక్షే అవుతూ వస్తోంది దర్శకుడు హను రాఘవపూడికి. అందుకు గల కారణాలను తనకు తానే గ్రహించి, గుర్తించి తనకున్న సెకండాఫ్ సిండ్రోమ్ ని వదిలించుకున్నానంటూ ప్రకటించి మరీ చేసిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిచ్చిందనేది పరిశీలిస్తే..

ప్రేమకోసం యుద్ధం చేసినవారున్నారు. యుద్దాన్నీ ప్రేమగా చేసిన వారున్నారు. ఆ రెండిటినీ కలుపుతూ ఉత్తమ ప్రేమ కథా చిత్రంగా తెరపైన లిఖించిన భావోద్వేగభరిత ఉత్తరమే సీతారామం.

సరైన పాత్ర దొరికితే దున్నేస్తానని నిరూపించుకున్న దుల్కర్ సాల్మన్ ని ఈ కథకి రాముడిగా ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ సాధించేసిన సీతారామం టీమ్ సీతగా మృణాల్ ఠాకూర్ నీ, ఇతర ప్రధాన పాత్రల్లో రష్మిక, సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ తదితరులని ఎలా పోట్రెయిట్ చేసారో.. సీతారాముల ప్రేమ కథని ఏ మేరకు విజువల్ పొయెట్రీగా మలిచారో వివరాలు తెలుసుకుందాం విశ్లేషణలో..!

కథ:

ఉన్న ఆస్తి దక్కాలంటే ఓ ఉత్తరాన్ని గమ్య స్థానానికి చేర్చాల్సిన పని పడుతుంది పొగరున్న పిల్ల ఆఫ్రీన్ (రష్మిక)కి. తాతయ్య కోరిక మేరకు అయిష్టంగానే అందుకై కదిలిన ఆఫ్రీన్ రామ్ రాసిన ఆ లేఖను సీతకు చేర్చే క్రమంలో అసలు కథగా, అందమైన కావ్యంగా ఆరంభవుతుంది సీతారాముల ప్రేమగాథ. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అయిన రామ్ జీవితంలోకి సీత ఎలా ప్రవేశించింది.. ఎంతగా ప్రభావితం చేసింది.. ఉత్తరాలతో మొదలైన వారి బంధం ఆపై ఎంతటి హృద్యంగా మారింది అనేది ఇక చెప్పేది కాదు. తెరపై చూసి తీరాల్సిందే. ముఖ్యంగా ముగింపు దృశ్యాల్లోని అనుభూతిని ఎవరికి వారు ఆస్వాదించాల్సిందే.. ఆ అనుభూతిని ఎద నిండా నింపుకోవాల్సిందే.!

కథనం : 

ఉత్తరాల నేపథ్యంతో భావుకతని నింపుకుంటూ సాగే కథ కనుక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కి వెళ్లక తప్పని హను రాఘవపూడి ఆ ప్రయాణానికై పడ్డ తపననీ, తంటాలనీ తప్పక అభినందించి తీరాలి. అసలు కథగా కనిపించే రామ్-సీతల ప్రేమ గాధను ఎంతటి కవితాత్మకంగా మలిచారో.. కొసరు కథగా అనిపించే ఆఫ్రీన్ జర్నీని కూడా అంతే అర్ధవంతంగా చూపించడం.. అద్భుతమైన ముగింపుని ఇవ్వడం ప్రశంసనీయం. సెకండాఫ్ సిండ్రోమ్ ని పోగొట్టుకున్నాను అన్న హను ఫస్ట్ హాఫ్ లోనే తడబడుతున్నారేమిటా అనిపించేలా నిదానంగా మొదలైన సీతారామం కథనం ఒక్కసారి ట్రాక్ ఎక్కాక మాత్రం మలుపులే తప్ప కుదుపులనేవి లేకుండా చకచకా సాగింది.. కళ్ళు చెమర్చేలా చేసింది. ప్రతి పాత్రకీ అనుభవజ్ఞులే అందుబాటులోకి రావడం.. సాంకేతిక నిపుణులంతా నిష్ణాతులే కావడం కూడా హనుకి అదనపు బలంగా మారింది. మొత్తంగా చూసుకుంటే ఆరంభ దృశ్యాల్లో ఆచి తూచి అడుగులు వేయడమే తప్ప ఆద్యంతం నవ్యమైన నడకతో కదిలిన కథనం సీతారామం.

తెరపై:

ఓకె బంగారం సినిమాతోనే బంగారంలాంటి నటుడు అనిపించుకున్న దుల్కర్ సల్మాన్ ఆపై మహానటి తో మన్ననలు పొందాడు. కనులు కనులును దోచాయంటే అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. అందుకే అతని సినిమాలంటే అమితాశక్తిని చూపిస్తున్న ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా సీతారామం కథని యాక్సెప్ట్ చేసిన దుల్కర్ రామ్ కేరెక్టర్ లో తనదైన మ్యాజికల్ పెరఫార్మెన్స్ ని మరోసారి ప్రదర్శించాడు. కళ్ళతోనే భావాలు పలికించగల అతి తక్కువమంది నటుల్లో దుల్కర్ ఒకడని రామ్ కేరెక్టర్ స్క్రీన్ పై స్పష్టంగా చూపించింది. అలాగే తెలుగు తెరకు కొత్తగా పరిచయమవుతున్నా.. ఎలాంటి జంకు బెరుకు లేకుండా సీత పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేస్తూ తన అభినయ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ పాత్రకు చెప్పించిన డబ్బింగ్ మొదట్లో ఇబ్బంది అనిపించినా ఆ కేరెక్టర్ లోని స్ట్రెంత్ ఆ చిన్నపాటి లోపాన్ని కవర్ చేసేసింది. ఇద్దరికి ఇద్దరూ తమతమ పాత్రలకి జీవం పోయడంతో సీతా - రామ్ ల మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై పొయెట్రీగా మారింది. అఫ్రిన్ గా రష్మిక కి నటిగా తనలోని కొత్త కోణాలని చూపించే అవకాశం దక్కింది. పతాక సన్నివేశాలలో తన నటన నటిగా తాను పొందుతున్న పరిణితికి నిదర్శనం. నటుడిగా సుమంత్ కి కూడా సీతారామంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది అనే చెప్పాలి. తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, భూమిక, గౌతమ్ మీనన్ తదితరులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.

తెరవెనుక :

ఫొటోగ్రఫీ ఎక్సట్రార్డినరీగా ఉంది. పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చెయ్యడంలో సినిమాటోగ్రాఫర్స్ తమ ప్రతిభ చూపించారు. ఎన్నో వైవిధ్యమైన లొకేషన్స్ ని, కాశ్మీర్ - రష్యా వంటి ప్రదేశాల్లో షూట్ చేసిన సన్నివేశాలు కనులకి ఇంపుగా తెరపైకి తీసుకువచ్చారు. సంగీతం కూడా కథలో మిళితమై సాగడం ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలు పాటల్లా కాకుండా కథలో భాగంగా కనిపించడం, ఆలా చిత్రీకరించడం మెచ్చుకోదగిన విషయం.

చివరిగా :

ప్రేమ కథలనే పేరుతో ఆలింగనాలూ, చుంబనాలు, ప్రణయ సన్నివేశాలూ తెరపై యథేచ్ఛగా పరిచేస్తున్న ప్రస్తుత తరుణంలో మనవైన, మనకే సొంతమైన సంస్కృతీ సంప్రదాయాల్ని పాటిస్తూ అచ్చమైన ప్రేమ గాథను ఇప్పట్లో కూడా ఇంత స్వచ్ఛంగా చెప్పొచ్చని నిరూపించేలా నిర్మితమైంది సీతారామం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న స్వప్నదత్ ఇప్పుడీ సీతారామం చిత్రంతో ఆ ప్రత్యేక గుర్తింపును పదింతలు పెంచుకున్నారు. ఆమె తండ్రైన సుప్రసిద్ధ నిర్మాత అశ్వనీదత్ అండతో, ఆయనే గర్వపడేలా తను మున్ముందు మరిన్ని మంచి చిత్రాలను అందిస్తుందని ఆశించొచ్చు. ఇక మొదటి సినిమా అందాల రాక్షసితోనే ఆంధ్రా మణిరత్నం అనిపించుకున్న హను రాఘవపూడి ఇన్నాళ్లకు తడబడకుండా తనదైన భావుకతను సీతారామంలో ఆద్యంతం ఆవిష్కరించారు. అశ్వనీదత్ అన్నట్లుగా మరో చరిత్ర, గీతాంజలి చిత్రాల స్థాయిలో సెల్యులాయిడ్ పోయెట్రీ అనిపించే సీతారామం ఆడియన్సుకి హండ్రెడ్ పర్శంట్ థియేట్రికల్ ఎక్సపీరియన్సుని ఇస్తుందనడంలో సందేహం లేదు. హను రాఘవపూడి చెప్పినట్లుగా ఓటీటీలోకి వచ్చాక చుసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తారని అనడంలోనూ సంకోచం అక్కర్లేదు.

Punch line : సీతారామం.. దృశ్యకావ్యం

Rating : 3/5

 

Cinejosh Review: Sitaramam:

Sita Ramam Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement