Advertisement

సినీ జోష్ రివ్యూ: శేఖర్

Fri 20th May 2022 05:02 PM
shekar review,shekar movie,shekar review,shekar telugu review,rajasekhar shekar review  సినీ జోష్ రివ్యూ: శేఖర్
Cinejosh Review: Shekar సినీ జోష్ రివ్యూ: శేఖర్
Advertisement

సినీ జోష్ రివ్యూ: శేఖర్ 

నటీనటులు: రాజశేఖర్‌, ముస్కాన్‌, ఆత్మీయ రాజన్‌, శివాని, సమీర్‌, అభినవ్‌ గోమతం తదితరులు

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

సినిమాటోగ్ర‌ఫి: మల్లికార్జున్ నారగాని 

ప్రొడ్యూసర్స్: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌

దర్శకత్వం: జీవిత రాజశేఖర్‌

రిలీజ్ డేట్: 20-05-2022 

గత కొంత కాలంగా 15 రోజులకొక భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తే.. ఈ వారం నుండి చిన్న సినిమాల జాతర మొదలయ్యింది. అందులో ముందుగా రాజశేఖర్ నటించిన శేఖర్ థియేటర్స్ లోకి వచ్చింది. గరుడ వేగ, కల్కి చిత్రాలతో లైం టైం లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్.. భార్య జీవిత దర్శకత్వంలో మలయాళం లో అద్భుతమైన హిట్ అయిన జోసెఫ్ మూవీని తెలుగులో శేఖర్ గా రీమేక్ చేసారు. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని నటించడం, శేఖర్ ప్రమోషన్స్ ఫ్యామిలీ అందరూ కలసి పాల్గొనటం, శేఖర్ గా రాజశేఖర్ లుక్ అందరిలో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెంచాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో సమీక్షలో చూసేద్దాం..

కథ:

శేఖర్‌(రాజశేఖర్‌).. ఓ రిటైర్డ్‌ కానిస్టేబుల్. ఆయన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో నెంబర్ వన్. క్రైమ్ సీన్ లోకి ఎంటర్ అయితే నేరస్తులను ఎవరైనా సరే కనిపెట్టేసే కానిస్టేబుల్. ఓ మర్డర్‌ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. పోలీస్ లు ఛేదించలేని కేసులు శేఖర్ దగ్గరకి వస్తుంటాయి. శేఖర్ మాజీ భార్య ఇందు(ఆత్మీయ రాజన్‌) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. శేఖర్ మాజీ భార్య ఇందు రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతుంది. కానీ ఇందు మరణం పై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే సీన్ లోకి దిగుతాడు. అయితే ఇందు ది రోడ్ యాక్సిడెంట్ కాదని ఆమెది హత్య అని శేఖర్ తెలుసుకుంటాడు. అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఇందు హత్య కేసును శేఖర్‌ ఎలా ఛేదించాడు? అసలు శేఖర్‌ భార్య నుండి విడిపోవడానికి కారణం ఏంటి? అనేది శేఖర్‌ మిగతా కథ.

నటీనటులు:

గరుడ వేగ లో పవర్ ఫుల్ NIA అధికారిగా కనబడిన రాజశేఖర్, కల్కిలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఇందులో రిటైర్డ్‌ పోలీస్ గా శేఖర్ పాత్రలో లుక్స్ పరంగాను, అలాగే పెరఫార్మెన్స్ పరంగాను చాలా బాగున్నారు. భర్తగా, తండ్రిగా ఆ పాత్రలో లీనయమైపోయారు. ఎమోషనల్‌ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌లో యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించడానికి ట్రై చేసారు. శేఖర్ భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్‌ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. శేఖర్‌ కూతురుగా శివాని పాత్ర సినిమాలో ఎక్కువసేపు కనిపించకపోయినా.. ఆమె కథకి కీలకంగా మారింది. సమీర్‌, అభినవ్‌ గోమతం, పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు. 

విశ్లేషణ:

క్రైమ్‌ థ్రిల్లర్‌, ఇన్వెస్టిగేటివ్‌ కథలకు బలమైన ట్విస్ట్ లు తోడైతే ఆ సినిమా ని ఆదరించే ప్రేక్షకులు కోకొల్లలు. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. మలయాలంలో హిట్ అయిన జోసెఫ్ ని తెలుగు నేటివిటీకి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి, తెలుగు నటులతో శేఖర్ ని తెరకెక్కించారు జీవిత రాజశేఖర్. అయితే ఇప్పుడు ఏ సినిమా అయినా వేరే భాష నుండి తెలుగులో రీమేక్ అవుతుంది అంటే.. దానిని ఓటిటిలో చూసేసి దానికి రివ్యూలు ఇచ్చేస్తున్న టైం లోనూ కొన్ని రీమేక్స్ ఆడియన్స్ ఆదరణ పొందుతున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్స్ కి మంచి ఆదరణ ఉంటుంది. అలా జోసెఫ్ కి రీమేక్ గా వచ్చిన శేఖర్‌ కథ ప్రేక్షకుడు కొత్తగా ఫీలవడం కాస్త కష్టమే. ఓ హత్య కేసుని ఛేదించడం కోసం పోలీసులు శేఖర్ సహాయం కోరడం.. ఆ కేసుని శేఖర్ చక చకా ముగించేయడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి, కూతుళ్లు మధ్య వచ్చే సీన్స్‌, ఎమోషనల్ సీన్స్, భార్య-భర్త కొన్ని కారణాల చేత విడిపోయే సన్నివేశాలు బాగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని కలగజేసేదిలా ఉంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. కాకపోతే హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే నిర్ణయాలు కూడా కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌ లొ కొన్ని బలమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగడం, ఇన్వెస్టిగేషన్‌ కూడా రొటీన్‌గా ఉండడం ఈ సినిమాకు మైనస్‌. క్రైం థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు ఓసారి చూసొచ్చే సినిమా శేఖర్.

సాంకేతికంగా:

అనూబ్‌ రూబెన్స్‌ సంగీతం ఓకె ఓకె. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో మరికాస్త శ్రద్ద పెట్టాలసింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

ఫంచ్ లైన్: సాగతీత ఎక్కువైంది శేఖరా...!

రేటింగ్: 2/5

Cinejosh Review: Shekar:

Shekar Movie Telugu review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement