Advertisement

సినీ జోష్ రివ్యూ: పుష్ప ది రైజ్‌

Fri 17th Dec 2021 03:00 PM
pushpa the rise review,pushpa review,pushpa the rise movie review,pushpa the rise telugu review,pushpa telugu review,allu arjun pushpa the rise review,allu arjun pushpa review,sukumar pushpa review  సినీ జోష్ రివ్యూ: పుష్ప ది రైజ్‌
Pushpa Movie Telugu Review సినీ జోష్ రివ్యూ: పుష్ప ది రైజ్‌
Advertisement

సినిమా: పుష్ప

బ్యానర్: మైత్రి మూవీస్

నటీ నటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, రావు రమేష్, సునీల్, అనసూయ, ధనుంజయ, జగదీష్, ఫహాద్ ఫాసిల్, బ్రహ్మాజీ మరియు ఇతరులు

ఫోటోగ్రఫీ: కూబా

మ్యూజిక్ డైరెక్టరు: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్

దర్శకుడు: సుకుమార్

కరోనా పాండెమిక్ తరువాత రిలీజ్ అవుతున్న ఒక పెద్ద సినిమా 'పుష్ప'. అల్లు అర్జున్ కథా నాయకుడిగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం. అదీ కాకుండా వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. ఎర్ర చందనం నేపథ్యం లో ఈ సినిమా కథ తీయటం జరిగింది అని దర్శకుడు సుకుమార్, లీడ్ ఆక్టర్ అల్లు అర్జున్ చెప్పటం జరిగింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు అన్ని పెద్ద హిట్ కావటం, బడ్జెట్ కూడా పెద్దగా ఉండటం తో ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా వున్నాయి. అందులోకి మొదటి సారిగా అల్లు అర్జున్ సినిమా అయిదు భాషల్లో విడుదల కావటం కూడా ఈ అంచనాలను పెంచింది. డైరెక్టరు సుకుమార్ ఒక అద్భుతమయిన టెక్నీషియన్ అన్న సంగతి అందరికి తెలిసిందే, అయితే ఇందులో అతను అల్లు అర్జున్ ని ఎలా చూపించారు, సినిమా ఎలా మలిచారు అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

పుష్ప కథ అంత శేషాచలం అడవులు ఆ చుట్టుపక్కల జరుగుతుంది. పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఒక సాధారణ రోజువారీ కూలీ. ఎర్ర చందనం దొరికేది ఈ శేషాచలం ఆడవుల్లోనే, దానికి ప్రపంచం అంతటా మంచి గిరాకీ వుంది. అటువంటి ఎర్ర చందనం పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించటం లో అక్కడ ఒక సిండికేట్ ఉంటుంది. పుష్ప మొదట ఒక చిన్న కూలీగా మొదలుపెట్టి తన తెలివితేటలు, తెగింపు తో రెడ్డి (అజయ్ ఘోష్) ని బాగా ఆకట్టుకుంటాడు. మంగళం శీను (సునీల్) అతని భార్య (అనసూయ) అక్కడ సిండికేట్ కి పెద్ద. పుష్ప ఈ సిండికేట్ హెడ్ కావాలని అనుకుంటాడు. ఒక పక్క పోలీస్ శాఖ, మరో పక్క, మనగలం శీను ముఠా సభ్యులు పుష్ప ని ఎదగనీయకుండా అడ్డుపడుతూ వున్న నేపధ్యం లో పుష్ప ఎలా తన కోరిక నెరవేర్చుకున్నాడు? శ్రీవల్లి ని ప్రేమించిన పుష్ప రాజ్ ఆమెని పెళ్లి చేసుకున్నాడా? అన్నది మొత్తం కథ.

పెర్ఫార్మన్స్:

మొదటి సీన్ లోనే మనకు అర్థం అయిపోతుంది ఈ సినిమా మొత్తం అల్లు అర్జున్ నడిపిస్తాడని. అతని డైలాగ్ డెలివరీ, నటన, ఆ చిత్తూరు యాస, అన్నీ అద్భుతంగా అమరాయి. అల్లు అర్జున్ చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. మొదటి నుండి చివరి వరకు ఒకటే రకమయిన నటన ప్రదర్శిస్తూ అల్లు అర్జున్ ఒక రకంగా ఈ సినిమా మొత్తం తన భుజాల మీద మోశాడు. తన టోటల్ కెరీర్ లో ఈ సినిమాలో చూపించిన పెర్ఫార్మన్స్ ఎప్పటికి గుర్తిండిపోయే పాత్ర. అల్లు అర్జున్ అనగానే మనకు డాన్సులు బాగా చేస్తారు, ఫైట్స్ బాగా చేస్తారు అనే కాకుండా, ఇందులో ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేస్తారు అని నిరూపించారు. ఇంటి పేరు చెప్పమని వచ్చిన రెండు మూడు సీన్స్ లో అల్లు అర్జున్ కనబరచిన నటన అలాగే తల్లి గురించి వచ్చిన సీన్స్ లో బాగా చేసి తాను ఏంటి అన్నది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా కథ మొత్తం పుష్ప అనే అతని జీవితం, అతని ఒడిదుడుకులు, సొసైటీ లో అతను పడిన అవమానం, అవన్నీ తట్టుకొని అతను తాను అనుకున్న దాన్ని ఎలా సాధించాడు అన్నది. తెర మీద పుష్ప మాత్రమే కనపడతాడు అన్నట్టుగా చేసారు అల్లు అర్జున్. ఇక అతనికి జోడిగా రష్మిక మందన్న బాగా చేసింది. చాలా చక్కటి అభినయం, అందంతో అందరిని ఆకట్టుకొంది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పటం బాగుంది. సునీల్ ని మనం కమెడియన్ గా చూసాం ఇంతవరకు, కాని ఇందులో ఒక విలన్ గా కొత్తగా కనిపిస్తాడు. బాగా చేసాడు కూడా. అలాగే అజయ్ ఘోష్ ఇంకో విలన్ గా కూడా రాణించాడు. అనసూయ పాత్ర అంత పెద్దగా లేకపోయినా, ఉన్నదాంట్లో బాగా చేసింది. శత్రు పోలీస్ ఆఫీసర్ గ బాగా రాణించాడు. అలాగే అల్లు అర్జున్ ఫ్రెండ్ గ జగదీష్ సినిమా మొత్తం కనిపిస్తాడు. అతను అల్లు అర్జున్ స్నేహితుడుగా తన పాత్రలో ఒదిగిపోయాడు. సమంత ఒక పాటలో మెరుపులా కనిపిస్తుంది, అందరిని అలరిస్తుంది. రావు రమేష్ అక్కడ అక్కడ కనిపిస్తూ తన పాత్రని బాగా మెప్పించారు. అతను ఉండటం వల్ల ఈ సినిమా కి కొంచెం వెయిటేజీ వచ్చింది.

అజయ్ ఘోష్ విలన్ గా బాగా రాణించాడు. ధనుంజయ్ అజయ్ ఘోష్ కొడుకుగా ఇంకో విలన్ గా కనిపిస్తాడు. నటుడు ఫహాద్ ఫాసిల్  కొత్త పోలీస్ ఆఫీసర్ గా కనపడతాడు. అతనికి తోడుగా బ్రహ్మాజీ కూడా వస్తాడు. వీళ్ళు సెకండ్ పార్ట్ లో కీలకం అని హింట్ ఇస్తారు.

సాంకేతికపరంగా

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా రిలీజ్ కి ముందే బాగా హిట్ అయింది. పాటలు అన్ని చాలా బాగా వచ్చాయి, అందులోకి సమంత ఐటెం సాంగ్ అయితే మొత్తం చిత్రానికే హైలైట్. కూబా సినిమాటోగ్రఫీ గురించి మాత్రం చెప్పాలి. మారేడుమల్లి అడవులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు లో షూటింగ్ చేసారు, కూబా ఆ అడవులను, చుట్టూ పక్కల గ్రామాలను చాల చక్కగా చిత్రీకరించారు. ఒక్కొక్కొ సీన్ చూస్తుంటే వీనుల విందుగా ఉంటుంది. కథలో అతని సినిమాటోగ్రఫీ ఒక భాగం అవుతుంది. ఇంత చక్కని లొకేషన్స్ మన రాష్ట్రం లో ఉండగా, మనవాళ్ళు అందరూ ఎక్కడికి పరుగులు తీయటం విచిత్రంగా ఉంటుంది. కూబా పచ్చని అడవులు, వాగులు, వంకలతో పాటు ప్రతి నటుని యొక్క అహభావాలను కూడా బాగా కాప్చర్ చేసారు. సంభాషణలు కూడా చాల బాగా రాసారు. చంద్రబోస్ పాటలు చాలా చక్కగా రాసారు. పోరాటమా సన్నివేశాలు బాగా కోరియోగ్రఫీ చేసారు.

విశ్లేషణ

ఒక సాధారణ స్థాయి నుండి అత్యున్నత స్థాయికి అదీ గ్యాంగ్, ముఠాల నేపథ్యంలో ఒక మనిషి ఎలా ఎదిగాడు అన్న చాలా సినిమాలు వచ్చాయి. కమల్ హాసన్ నాయకుడు, అజయ్ దేవగన్ కంపెనీ ఇంకా చాలా వున్నాయి. డైరెక్టరు సుకుమార్ అటువంటి కథనే ఈ ఎర్ర చందనం నేపధ్యం ఎంచుకొని పుష్పరాజ్ అనే సామాన్యమయిన కుర్రాడు ఎలా ఎదిగాడు అని తీసుకున్నారు. సుకుమార్ మన తెలుగు సినిమా లో వున్న అతి కొద్దిమంది మంచి టెక్నిషన్స్ లో ఒకరు. అతని సినిమా మేకింగ్ లు అన్ని కొత్తగా ఉంటాయి. ఈ సినిమాకి వచ్చేసరికి అతను తీసుకున్న కథ పాతదే అయినా కొంచెం కొత్తగా చూపించటానికి ప్రయత్నం చేసాడు. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా సూపెర్జ్ ఉంటాయి. సునీల్ ఇంటికి అల్లు అర్జున్ వచ్చి మాట్లాడే సీన్ తరువాత వచ్చే ఫైట్ సీన్ అదిరిపోయింది. అలాంటివే చాలా వున్నాయి. కార్ లో రష్మిక అల్లు అర్జున్ రొమాంటిక్ సీన్ కూడా బాగా వచ్చింది. అలాగే సుకుమార్ మెయిన్ క్యారెక్టర్ అల్లు అర్జున్ పాత్ర మలిచిన తీరు కూడా చాల బాగుంది. అతని చుట్టూ కథ తిరుగుతూ మిగతా పాత్రలు అన్ని వస్తూ ఉంటాయి. అంతవరకు బాగానే వుంది. కాని సుకుమార్ కొన్ని తప్పిదాలు కూడా చేసారు. సినిమా నిడివి సుమారు మూడు గంటలు మరియు చాలా చోట్ల అతను బలవంతంగా కొన్ని సీన్స్ ని పొడిగించాడని అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ అస్సలు బాగోలేదు. ఫహద్ ఫాసిల్ ని  చూపించటం కోసం అని ఆ పోలీస్ స్టేషన్ సీన్ దాని తరువాత వచ్చే పార్ట్ సీన్ ని అనవసరంగా పొడిగించారు. ఈ రెండు సీన్స్ ప్రేక్షకులకి చాలా బోర్ కొట్టిస్తాయి. అజయ్ ఘోష్ చనిపోయాక, రావు రమేష్ పుష్ప అయినా అల్లు అర్జున్ ని సిండికేట్ హెడ్ గా అనౌన్స్ చేస్తాడు. అప్పుడు కొత్త ఎస్పీ గా ఫహద్ ఎంట్రీ చూపిస్తే సరిపోయేది. ఎలాగు సెకండ్ పార్ట్ అనుకున్నారు కాబట్టి అందులో అతను అల్లు అర్జున్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నది అర్థం అవుతుంది. కానీ సుకుమార్ ఆ సెకండ్ పార్ట్ కోసమని క్లైమాక్స్ పాడుచేశారు. సినిమా మొత్తం సుకుమార్ మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. మూడు గంటలపాటు ప్రేక్షకుడిని కూర్చోపెట్టాలి అంటే చివరి వరకు ఏదైనా ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉండాలి. సుకుమార్ మైండ్ లో సెకండ్ పార్ట్ వుంది అని ఎప్పుడు అయితే వచ్చిందో, ఈ మొదటి పార్ట్ సెకండ్ హాఫ్ చాలా స్లో అయిపొయింది. ఆ ప్రభావం ఇక్కడ పడింది.

మొత్తం మీద పుష్ప సినిమా స్లోగా అనిపించినా, అల్లు అర్జున్ క్యారెక్టర్, నటన, అతని యాస అన్నిటితో తన బుజాల మీద తీసుకెళ్లాడు. చివరి ఇరవయి నిముషాలు కొంచెం బోర్ అనిపించినా సినిమా పాస్ మార్క్ వేసేయొచ్చు. పుష్ప సుకుమార్ సినిమా అనే కన్నా, అల్లు అర్జున్ సినిమా అంటేనే బాగుంటుంది. అతని విశ్వరూపం చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Pushpa Movie Telugu Review:

Allu Arjun Pushpa Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement